రాష్ట్ర అసెంబ్లీలో కులగణన నివేదిక ఆమోదం పొందింది. బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి సిఫారసు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రకటించారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో బిల్లుపెట్టి నేరుగా అమలుచేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. సర్కారీ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేకు అసెంబ్లీ గ్రీన్ సిగల్ ఇచ్చిన తరుణంలో రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ అవసరం.
తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని సభ డిమాండ్ చేసింది. ‘ఎందరో సీఎంలకు ఈ అవకాశం రాలేదు..నాకు వచ్చింది. ఫిబ్రవరి నాలుగును ఇక నుంచి సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తాం’ అని సీఎం ప్రకటించారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ కేంద్ర సర్కారు, దీనికి ఒప్పుకుంటుందా? ఇదొక ప్రశ్న. కాగా అసెంబ్లీలో తీర్మానం చేసి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ సర్కారు చేస్తున్నదనే విమర్శలూ వెల్లువెత్తుతు న్నాయి. జనాభా లెక్కలపై అసెంబ్లీలో కేంద్రంలోని మోడీ సర్కారుపై సీఎం నిప్పులు చెరగడం చర్చనీయాంశ మవుతున్నది. 2011 జనాభా లెక్కలు తప్పితే, దేశంలో మరే అధికారిక లెక్కలూ లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు కూడా. 2021లో జనాభా లెక్కలు సేకరించలేదనీ, అది బీసీల హక్కులకు నష్టం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రధానంగా ఓటరు జాబితాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాయి. అయితే ఓడిషా ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీహార్, కర్నాటక రాష్ట్రాలు మాత్రం కులసర్వే చేపట్టాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను రాజ్యాంగబద్దంగా కల్పిస్తున్నారు. బీసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొన్ని ఇస్తున్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో, ర్యాండమ్‌గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయ పద్ధతుల్లో రిజర్వేషన్లు అమలుచేస్తుండగా, ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటైంది. ఈ రిజర్వేషన్లు కర్నాటకకు చెందిన కె.కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవిళి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. త్రిపుల్ ‘టీ’ పేరిట మార్గదర్శకాలిచ్చింది. మొదటిది ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్దమైన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. రెండోది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి, మూడోది రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తం యాభై శాతం మేరకు మించకూడదు. ఆ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలోకూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది.ఈ నిబంధనలను పాటించని గుజరాత్, మహారాష్ట్రతోపాటు పలు ర్ఱాష్టాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దుచేసింది. సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటీనీ జనరల్‌గా మార్చాలని ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఉపకులాలవారీగా కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కారుకు అల్టిమేటం ఇస్తున్నాయి. అలాకాకుండా పార్టీపరంగానే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పూనుకుంటే, తీవ్రస్థాయి పరిణామాలు ఎదుర్కొవాల్సి రావచ్చు. కులగణన చేశాం, క్యాబినెట్‌లో తీర్మానించాం, అసెంబ్లీలో ఆమోదించాం, ఇక తమ పని అయిపోందని రేవంత్ సర్కారు కనుక చేతులు దులుపుకోవాలని భావిస్తే తప్పులో కాలేసినట్టే. అసెంబ్లీలో చెప్పినట్టుగా అఖిలపక్షం నిర్వహించి, అవసరమైతే ఢిల్లీ తీసుకెళ్లి మోడీ సర్కారుపై ఒత్తిడి తేవాలి. మెడలు వంచైనా సరే రిజర్వేషన్లను జనం ముంగిళ్లకు చేర్చాలి. వాటికి రాజ్యాంగ రక్షణ ఉండేలా చూసుకోవాలి.
1948 జనగణన చట్టం ప్రకారం జనగణన, కులగణన చేసే అధికారం కేవలం కేంద్రానిదే. ఇటీవల బీహార్ సర్కారు చేపట్టిన కులగణన కోర్టుకెక్కడమే నిదర్శనం. కులగణన కమిషన్ వేసి లెక్కలు తీసిన తెలంగాణ ప్రభుత్వం, అసెంబ్లీలో బిల్లుపెట్టి నేరుగా రిజర్వేషన్లను అమలు చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. గత పదేండ్లలో పంపిన పలు తీర్మానాలను మోడీ సర్కారు తుంగలో తొక్కిన విషయాన్ని గుర్తుచేస్తున్నది.
విద్యా, ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లోనూ ప్రవేశపెట్టాలని చెబుతున్నది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరహాలో బీసీలకు రిజర్వేషన్లను తెలంగాణలోనూ అమలుచేసే వీలుంది.