బోణి కొట్టేదెవరో..!

Who hits the cage..!– నేడు భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే
– మధ్యాహ్నం 1.30 గంటల నుంచే
నాగ్‌పూర్‌ : భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య నాగ్‌పూర్‌ వేదికగా తొలి వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే భారతజట్టు తలపడనుంది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో నిరాశపరిచిన సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌, కోహ్లిలకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. స్వదేశీ పిచ్‌లపై సత్తా చాటి ఛాంపియన్స్‌ ట్రోఫీ బరిలోకి దిగాలని వీరు ఉవ్విళ్ళూరుతున్నారు. ఐసిసి వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆగస్టులో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు వెళ్లిన భారతజట్టులో ఉన్న కోహ్లి ఆ మూడు వన్డేల్లో కేవలం 58పరుగులు మాత్రమే కొట్టాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రమే 157పరుగులే చేశాడు. పేస్‌ భారాన్ని జస్ప్రీత్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ షమీ అందుకోనున్నాడు. అతడు దాదాపు 16నెలల తర్వాత వన్డేల్లో మళ్లీ పునరాగమనం చేయనున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఇదే ఆఖరి వన్డే సిరీస్‌ కావడంతో వీరి ప్రదర్శనపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
ఇంగ్లండ్‌ జట్టులో జో రూట్‌కు చోటు :
భారత్‌తో తొలి వన్డేకు ముందురోజే ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఇసిబి) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్‌ బట్లర్‌ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. మాజీ సారథి జో రూట్‌కు తొలి వన్డే జట్టులో చోటు దక్కింది. దీంతో అతడు దాదాపు 16 నెలల తర్వాత తొలిసారిగా వన్డే ఫార్మాట్‌ బరిలో దిగనున్నాడు. ఓపెనర్లుగా బెన్‌ డకెట్‌, ఫిల్‌ సాల్ట్‌ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్‌ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. కెప్టెన్‌ బట్లర్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌-జాకొబ్‌ బెతెల్‌ జోడీ కొనసాగనుంది. బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల చేతిలో ఓటమిపాలైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్‌ మెకల్లమ్‌కు ఈ సిరీస్‌ కీలకం కానుంది.ఈ సిరీస్‌కు ముందు భారత్‌తో జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు 1-4తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు కనీసం వన్డే సిరీస్‌లోనైనా సత్తా చాటాలన్న దృఢ నిశ్చయంతో బరిలోకి దిగుతోంది.
ఛాంపియన్స్‌ ట్రోఫీకి నితిన్‌ మీనన్‌ దూరం :
ఐసిసి ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్స్‌, భారత్‌కు చెందిన నితిన్‌ మీనన్‌ ఛాంపియన్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను ఛాంపియన్స్‌ ట్రోఫీకి అందుబాటులో ఉండడం లేదని ట్విటర్‌ వేదికగా ఐసిసికి లేఖ రాశాడు. ఐసిసి 15మంది అధికారుల జాబితాను ప్రకటించగా.. అందులో 12మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలు ఉన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ, రావల్పిండి, లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుండగా.. భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబారు వేదికగా జరగనున్నాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభమై.. మార్చి 9న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది.
జట్లు(అంచనా) :
భారత్‌ : రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, కెఎల్‌ రాహుల్‌, కోహ్లి, పంత్‌(వికెట్‌ కీపర్‌), సుందర్‌/వరుణ్‌ చక్రవర్తి, శ్రేయస్‌, హార్దిక్‌, అక్షర్‌/జడేజా, షమీ, ఆర్ష్‌దీప్‌.
ఇంగ్లండ్‌ : బట్లర్‌(కెప్టెన్‌), డకెట్‌, సాల్ట్‌(వికెట్‌ కీపర్‌), రూట్‌, బ్రూక్‌, లివింగ్‌ స్టోన్‌, బెథెల్‌, కార్సే, ఆర్చర్‌, రషీద్‌, మహమూద్‌.