– హాజరు శాతం మినహాయింపుతో పరీక్షకు అనుమతించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-ఓయూ
హాజరు శాతంతో పనిలేకుండా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించాలని కోరుతూ హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తూ.. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలని కోరారు. అనంతరం వారు ప్రిన్సిపాల్ ప్రొ.కాశింతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కనీస హాజరు శాతం ఉన్నవాళ్లకు అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. కనీస హాజరు శాతం లేని విద్యార్థులను ఎలా అనుమతివ్వాలని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అస్సలు క్లాస్‌లకు రాని విద్యార్థులకు (0 శాతం హాజరు ఉన్నవారికి) బ్యాక్‌లాగ్‌లో పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తామని హామీనిచ్చారు. ఆ బ్యాక్‌లాగ్‌లో పరీక్ష రాసేవారిలో అత్యంత పేదలు ఉంటే పరీక్ష ఫీజును తానే స్వయంగా చెల్లిస్తానని హామీనిచ్చారు. దాంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.