35 ఏండ్ల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ 

– పడిదల సాంబయ్య మండల దళిత కాంగ్రెస్ విభాగ అధ్యక్షులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట 
35 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని మండల దళిత కాంగ్రెస్ విభాగం అధ్యక్షులు పడిదల సాంబయ్య అన్నారు.గురువారం  మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గణపాక సుధాకర్  ఆధ్వర్యంలో ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి అమలు చేసిన శుభ సందర్భముగా ప్రజా ప్రభుత్వ పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవిందరావుపేట మండల దళిత కాంగ్రెస్ విభాగ అధ్యక్షులు పడిదల సాంబయ్య  పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రి సీతక్క  చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భముగా సాంబయ్య  మాట్లాడుతూ గత ముప్పై ఐదు యేండ్ల నుండి చేస్తున్న మాదిగల పోరాటాన్ని గుర్తించి, ముఖ్యంగా ప్రజా బెబ్బులి, నవయుగ అంబేద్కర్, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  జరిపినా పోరాట ఫలం వలన ఎస్సి కులాల జాబితాలో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం సమాన వాటా దక్కాలని ఎస్సి కులాలను ఐక్యం చేస్తూ అలుపెరగని అతని పోరాటం అనితర సాధ్యం అని, జనాభా దామాషా ప్రకారం వాటా అడుగుతున్నారని గుర్తించిన సిఎం రేవంత్ రెడ్డి  ఎస్సి వర్గీకరణ చేయాలనే ఆలోచనతో అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టి ఆమోద ముద్రవేసిన శుభ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, మంత్రి సీతక్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికల్లో ఎస్సి వర్గీకరణ చేస్తానని చెప్పిన బీజేపీ పార్టీ మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంకా ఎస్సి వర్గీకరణ చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సి వర్గీకరణ చేసి, దళితుల అందరికీ సమాన వాటా కల్పించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వెంటనే బీజేపీ పార్టీ కూడా ఎస్సి ఎబిసిడి వర్గీకరణ చేసి వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. గత బి.ఆర్.ఎస్.ప్రభుత్వం మంద కృష్ణ మాదిగ ని అక్రమ అరెస్టు చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అతని పోరాటాన్ని గుర్తించి అతనికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది అని అన్నారు. గత బి.ఆర్.ఎస్.ప్రభుత్వం దళితుడిని సిఎం చేస్త అని చెప్పి, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సి లోని 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం సమాన వాటా అందించింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, రైతన్నల పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల ఎస్సి నాయకులు అందరూ పాల్గొన్నారు.