లవీనా… భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో క్యాన్సర్ ప్రవేశించింది. కుటుంబాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఆమెనే కాదు భర్తను కూడా క్యాన్సర్ చుట్టుముట్టింది. ఇక వారి బాధలు వర్ణనాతీతం. అన్ని ఇబ్బందుల్లోనూ పిల్లలను కాపాడుకోవాలనే ఆమె సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఆ వ్యాధిని ధైర్యంగా జయించి ఇప్పుడు ఏకంగా లక్షల టర్నోవర్‌లో వ్యాపారం చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె పరిచయం…
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరానికి చెందిన లవీనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈమె భర్త కూడా ఓ ప్రైవేట్ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించి ఒక్క కుదుపు కుదిపేసింది. 2010లో ఆ జంటకు క్యాన్సర్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. లవీనాకు రొమ్ము క్యాన్సర్ కాగా, ఆమె భర్తకు నోటి క్యాన్సర్ వచ్చింది. మధ్యతరగతికి చెందిన వారికి చికిత్స తీసుకోవడం అత్యంత భారంగా మారింది. ఒక వైపు చికిత్సకు అయ్యే ఖర్చు, మరో వైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఇవన్నీ ఎలా నెట్టుకురావాలో అర్థంకాక ఆవేదన చెందారు.
దొరికిన చోటల్లా అప్పులు చేసి
క్యాన్సర్ బారి నుండి ఏదో రకంగా బయట పడి తమ పిల్లల్ని చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళ దగ్గర ఎంత దొరికితే అంత అప్పు చేసి చికిత్స చేయించుకున్నారు. అవి తీర్చగలమనే నమ్మకం కూడా అప్పట్లో వారికి లేదు. కానీ వ్యాధిని జయించాలనే సంకల్పం మాత్రం ఉంది. ఎంతో బాధతో కూడుకున్న కీమోథెరపీ, రేడియోథెరపీలు చేయించుకొని చివరకు కోలుకున్నారు. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం చుట్టుముట్టాయి. కనీసం తిండి కూడా లేని పరిస్థితి. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాలేదు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చివరకు చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
సరదాగా నేర్చుకున్న కళతో…
లెవీనా ఎలాగో క్యాన్సర్ నుండి కోలుకొని మామూలు స్థితికి వచ్చింది. కానీ ఆమె భర్తకు మాత్రం నోటి క్యాన్సర్ కారణంగా వైద్యులు మాట రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పారు. కష్టాల నుండి బయట పడేందుకు ఉన్న ఇంటిని సైతం అమ్మేసుకున్నారు. లవీనానే ధైర్యం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఉపాధిని వెదుక్కొనే పనిలో పడింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న ఫుడ్ కోర్సు గుర్తుకొచ్చింది. అలా సరదాగా నేర్చుకున్న ఆహార సంరక్షణ కోర్సు ఇలా తమ బతుకులు బాగు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ కోర్సులో భాగంగా మురబ్బా, ఊరగాయలు, జామ్‌లు తయారు చేయడం నేర్చుకున్న కళే ఇప్పుడు తనకు జీవనాధారం అని భావించింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార సంరక్షణకు సంబంధించిన వందరోజుల ఉపాధి అభివృద్ధి కార్యక్రమం నిర్వహించింది. లవీనా వెంటనే అందులో చేరి శిక్షణ తీసుకుని సర్టిఫికేట్ అందుకుంది.
లవీనాస్ ట్రిప్టి ఫుడ్స్
లవీనా ఎంతో ఆసక్తితో శిక్షణ అయితే పూర్తి చేసింది. కానీ వ్యాపారం ప్రారంభించేందుకు ఆమె వద్ద కేవలం 15 వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయినా ఆమె ఏ మాత్రం అధైర్య పడలేదు. వాటినే పెట్టుబడిగా పెట్టి ‘లవీనాస్ ట్రిప్టి ఫుడ్స్’ అనే పచ్చళ్ల ఫుడ్స్టార్టప్ని ప్రారంభించింది. స్వయంగా ఇంట్లో తయారు చేసి స్క్వాష్, జామ్‌లు, ఊరగాయలు విక్రయించడం మొదలుపెట్టింది. అయితే అమ్మకాలు అంత సులభంగా జరగలేదు. తయారు చేయడం ఈజీనే కానీ వాటిని ప్రజల వద్దకు చేరేలా చేయడం ఆమెకు చాలా కష్టంగా మారింది. అసలు వ్యాపార కిటుకేంటో తెలియక చాలాకాలం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆమెకు ఓ పెద్ద టాస్క్‌లా మారింది.
బతుకు పోరాటంలో…
స్థానికంగా జరిగే కిట్టి పార్టీల ద్వారా తన వ్యాపారం గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. శ్యాంపుల్ బాటిల్స్ ఇవ్వడం వంటివి చేయడంతో మెల్లగా అమ్మకాలు మొదలయ్యాయి. అలా ఒకరి నుంచి ఒకరికి ఆమె స్వయంగా తయారు చేసే పచ్చళ్లు, జామ్‌ల గురించి తెలియడంతో వ్యాపారం ఊపందుకుంది. లాభాలు రావడం మొదలైంది. ఆ లాభాలతో అప్పులు తీర్చడమే కాకుండా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. అయితే లవీనా చేస్తున్న ఈ బతుకు పోరాటంలో ఆమె కొడుకు తన చదువును పక్కన పెట్టి తల్లి వ్యాపారంలో చేదోడుగా నిలవాల్సి వచ్చింది. తన కొడుకు అందించిన సహకారం వల్లనే తన వ్యాపారం ఈ రోజు ఈ స్థాయికి చేరిందని ఆమె గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాపారం 34 లక్షల రూపాయల టర్నోవర్‌తో దూసుకుపోతోంది.
ఆశతో పోరాడితే…
లవీనా కొడుకు కిన్షుక్ మాట్లాడుతూ ‘సీఏ చేయాలనేది నా కల. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోయాను. నా కుటుంబాన్ని ఆదుకోవడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మా అమ్మ ప్రారంభించిన వ్యాపారంలో సాయం చేసేందుకు నేను ముందుకు వచ్చాను. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు ఇంటింటికి తిరిగేటప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. వ్యాపారం నిర్వహించడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాను. మాట్లాడలేని నా తండ్రి కూడా నాలో స్ఫూర్తి నింపారు’ అంటూ గుర్తు చేసుకున్నాడు. అచంచలమైన సంకల్పం, ఆశతో పోరాడితే గెలుపు తలుపు తప్పక తెరుచుకుంటుందనడానికి ఈ 50 ఏండ్ల క్యాన్సర్ వారియర్ లవీనా జీవితమే ఓ ఉదాహరణ.