లలైసింగ్‌ జీవన సంఘర్షణ మనకు ఆదర్శం !

Lalising's conflict of life is our ideal!భీడ్‌ హమేషా తమాషా దేఖ్‌తీ హై
క్రాంతి తో ఏక్‌ హీ వ్యక్తి లాతా హై
సమూహం ఎప్పుడైనా తమాషా చూస్తుంది. మార్పు, పరివర్తన, విప్లవం వంటివి తేవడం ఒకే ఒక్కవ్యక్తికి సాధ్యమవుతుంది! సత్యాన్వేషణలో ఎంతకైనా తెగించడం, దేశభక్తి కలిగి ఉండటం, తర్కబద్ధంగా ఆలోచిస్తూ ఆంధ విశ్వాసాల్ని అంతం చేయడం, మానవత్వానికి ఉదాహరణగా నిలవడం.. లలైసింగ్‌ బౌద్ధ జీవన సంఘర్షణ మనకు తెలియజేస్తుంది.
మనుషుల్ని ముట్టుకుంటే అపవిత్రులవు తున్నారంటే- దేవుడు లేడని అర్థం – అని అన్నాడు లలైసింగ్‌ బౌద్ధ (1 సెప్టెంబర్‌ 1911-7 ఫిబ్రవరి 1993). ఉత్తరభారత పెరియార్‌గా ప్రసిద్ధుడైన ఆయన గురించి దక్షిణ భారత ప్రజలకు పెద్దగా తెలియదు. పెరియార్‌ ఇ.వి. రామసామి ఉత్తర భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు లలైసింగ్‌ రెండు మూడు పర్యాయాలు ఆయన్ను కలిశాడు. ఆయన రచనలకు ప్రభావితుడై, ఆయనకు అనుయాయుడై పోయాడు. మరోవైపు మహాత్మాఫూలే, సావిత్రీబాయిఫూలే, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ల ఆలోచనా ధోరణిని, జీవన విధానాన్ని, సంఘర్షణల్ని ఆదర్శంగా తీసుకుని తను కూడా సామాజికరంగంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం నిరంతరం సంఘ ర్షించాడు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలెదురైనా తన ధ్యేయం నుండి దృష్టి మరల్చలేదు. పెరియార్‌ ఇ.వి. రామసామి రచన ‘రామాయణ్‌ పార్ట్‌ థెరంగల్‌'(ద రామాయణ ఎట్రూ రీడింగ్‌)ను హిందీలోకి తొలిసారి అనువదించి ప్రచురిస్తే- ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పుస్తకాల ప్రతుల్ని జప్తుచేసింది. లలైసింగ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులలో రెండుచోట్లా రాష్ట్ర ప్రభుత్వంపై విజయం సాధించి, ఒక వైపు బహుజన నాయకుడిగా – మరోవైపు స్వాతంత్య్రయోధుడిగా నిలిచాడు. సామాజికన్యాయం కోసం జీవితాంతం మొక్కవోని ధైర్య సాహసాలతో ఒంటరిగా పోరాడుతూ వచ్చాడు. ప్రచురణ కర్తలెవరూ ప్రచురించకపోవడంతో ‘సచ్చి రామాయణ్‌’ ప్రచురణ కోసం తన పదిహేనెకరాల భూమిని అమ్మి, తనే ఒక ప్రెస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
మారుమూల గ్రామమైన తన కఠారాలో కాకుండా అక్కడికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో వరుసగా మూడు గదులు కట్టించాడు. ఒక దాంట్లో ప్రెస్‌, మరోగదిలో పుస్తకాల షాపు, ఇంకో గది తను ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రెస్‌పేరు ‘సస్తాప్రెస్‌’ ; పుస్తకాల షాపు అశోకచక్రవర్తి పేరుతో ‘అశోకా పుస్తకాలరు’- అని పెట్టాడు. ఈయన ఆచ్చేస్తున్న పుస్తకాలు, చెపుతున్న విషయాలు మనువాదులకు భరించలేనివిగా ఉండేవి. అనేకసార్లు దొంగచాటుగా దెబ్బతీయాలని, చంపాలని కుట్రలు పన్నారు. కుటుంబంలో తనకంటూ ఎవరూ లేకపోయినా, తనను, తన ఆలోచనలను బలపరిచేవారు సమాజంలో చాలామంది ఉన్నారన్న ఆత్మవిశ్వాసంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒంటరిగానే తిరిగేవాడు. ఎప్పుడూ భుజానికి ఒక సంచి ఉండేది. అందులో పుస్తకాలు, తెల్ల కాగితాలు పెన్ను ఉండేవి.
పెరియార్‌ ఆలోచనా విధానంలో పడిపోయి ఆధోరణిలోనే లలైసింగ్‌ తన స్వీయరచనలు కూడా వెలువరిస్తూ వచ్చాడు. శంభుక వధ, అంగుళీమల, ఏకలవ్య, సిపాయీ క త బాహీ, ఆదివాసోంకి పహిచాన్‌; ఆర్యోంక నైతిక్‌ మల్‌ ప్రకాశ్‌; సోశితోం పర్‌ ధార్మిక్‌ డెకాయిటీ (అణగారిన వర్గాల మీద ధార్మిక దోపిడీ) సోశితం పర్‌ నైతిక్‌ డెకాయిటీ; సామాజిక విలంబిత్‌ కైసే సమాప్త్‌? సామాజిక న్యాయం కోసం జరిగే ఈ ఆలస్యం ఎలా సమాప్త మౌతుంది?); సచ్చీ రామాయణ్‌కి చాబి (వాస్తవ రామాయణాన్ని తెరవడానికి తాళం చెవి) ఇవన్నీ నాటకాల రూపంలో, సంభాషణల రూపంలో ఉన్నాయి గనక గ్రామీణ ప్రజలకు బాగా నచ్చేవి. నవలలు, వ్యాసాల కన్నా నాటికల రూపంలో అయితే గ్రామీణుల్ని చైతన్యపరచడానికి బావుంటాయని ఈ రచయిత భావన. క్షేత్రస్థాయిలో జనంతో ఉండి జీవితాంతం సంఘర్షించిన ఈ సామాజిక విప్లవకారుడి గురించి ప్రముఖ పత్రికలేవీ రాయలేదు. వికీపిడియాలో గాని, గుగూల్‌లో గానీ సమాచారం లేదు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడెమీలు ఈయన రచనల్ని పట్టించుకోలేదు. అయితే లలైసింగ్‌ జీవన సంఘర్షణను ప్రజాగాయకులు గానం చేశారు. ప్రజాకళాకారులు కొంత వరకు ఆయనను పరిచయం చేస్తూ వచ్చారు. మొత్తానికి మొత్తంగా బ్రాహ్మణవాదానికి భజన చేసే రచయితలు, పత్రికలు, రాజకీయ నాయకులు ప్రబలిపోయిన కారణంగా, అందుకు విరుద్దంగా పనిచేసే లలైసింగ్‌ లాంటి వారి గూర్చి ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారూ?
మాన్యవర్‌ కాన్షీరామ్‌ లలైసింగ్‌ గురించి తెలుసుకుని, అతని ఫొటోలు- తన పోస్టర్స్‌లో ముద్రించడం వల్ల, తన ప్రసంగాలలో తరచూ అతని ప్రసక్తి తెస్తూ ఉండడం వల్ల కొంత ప్రచారం జరిగింది. ‘మిలే ములాయం కాన్షీరాం/ హవా మె ఉడ్‌ గయె జై శ్రీరామ్‌’ అనే నినాదం ఉధృతమై బహు జనులకు రాజ్యాధికారం దక్కుతుందన్న ఆశాభావం బలపడింది. ఉత్తరప్రదేశ్‌లో యాదవులకు అధికారం కూడా దక్కింది. కానీ, వారు వారి స్వార్థ ప్రయోజ నాలు చూసుకున్నారే తప్ప, బహుజనుల ప్రయోజనాల్ని పట్టించుకోలేదు. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడనూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లలైసింగ్‌ జీవన సంఘర్షణను మొత్తానికి మొత్తంగా వెలుగులోకి తేవడానికి ఒక పరిశోధక విద్యార్థి పూనుకున్నాడు. అతని పేరు ధరమ్‌ వీర్‌ యాదవ్‌. పెరియార్‌ ఇ.వి.రామసామి, లలైసింగ్‌ల అడుగుజాడల్లో నడిచే ఈ పరిశోధకుడు కులం గుర్తింపు యాదవ్‌ను వదిలేసి తనకు తానే ధరమ్‌ వీర్‌ గగన్‌ అని పెట్టుకున్నాడు. ఢిల్లీలో పి.జి., హైద్రాబాద్‌ యూనివర్సిటీలో యం.ఫిల్‌ చేసిన ఈ యువ పరిశోధకుడు లలైసింగ్‌ పనిచేసిన సంస్థలన్నీ సందర్శించి, అతనితో కలిసి పనిచేసిన సహ ఉద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి, ఎందరో ప్రజా కళాకారుల ప్రదర్శనలు చూసి, సుదీర్ఘకాల శోధించి ఢిల్లీ జె.ఎన్‌.యూ నుండి పిహెచ్‌.డి సాధించాడు. ఆయన సేకరించిన సమాచారమంతా ఒక క్రమపద్ధతిలో పెట్టి ఐదు సంపుటాలుగా రెండు వేల పేజీల్లో నమోదు చేశాడు. ఆ సంపుటాలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తర భారత పెరియార్‌’ గా గుర్తింపు పొందిన లలైసింగ్‌ జీవిత సంఘర్షణ కాలగర్భంలో కలిసిపోకుండా డాక్టర్‌ ధరమ్‌ వీర్‌ గగన్‌ అడ్డుకున్నాడు.
లలైసింగ్‌ మానవత్వం గురించి చెప్పుకోవడానికి ఒక సంఘటన చూద్దాం – ఒకసారి ఆయన స్వగ్రామం కఠోరాలో నీటి ఎద్దడి ఏర్పడింది. లలైసింగ్‌ మిత్రుడు మంగల్‌ సింగ్‌ అని ఉండేవాడు. అతను వాల్మికి, పైగా సఫాయి కర్మచారి. అతనంటే ఊరి పెద్దలకు చిన్నచూపు. అతణ్ణి ఒరేరు మంగలియా అని పిలిచేవారు. ఆ కరువు రోజుల్లో మంగలియా బావి ఎండిపోయింది. అతను నీటి కోసం యాదవ్‌ల బావి దగ్గరికి వెళ్లాడు. యాదవులు చూసి ఈసడించుకున్నారు. తక్కువ జాతివాడు అందులో సఫాయి కార్మికుడు. మంగలియా గనక తమ బావిని ముట్టుకుంటే అది అపవిత్రమౌతుందనే నానా మాటలని వెనక్కి పంపించారు. విషయం తెలుసుకుని లలైసింగ్‌ యాదవ్‌ తన వంతు నీరు తోడుకుని తెచ్చి, తన ఇంట్లో పెట్టేవాడు. మళ్లీ తన ఇంటి నుండి మంగలియాకు ఇచ్చేవాడు. అలా ఆ కరువు రోజుల్లో వాల్మికి జాతి కుటుంబాలను లలైసింగ్‌ ఆదుకున్నాడు. ఈ వివక్షను అంతం చేయాలని మనసులో ధృఢంగా అనుకున్నాడు. ఓరోజు బ్లాక్‌ ఆఫీసుకు వెళ్లి, అధికారులతో మాట్లాడి వాల్మికి కుటుంబాలకు నీరులేదని వెంటనే అక్కడ ఒక బావి తవ్వించాలని అప్లికేషన్‌ పెట్టాడు. ప్రభుత్వం పూనుకుంటే తను కూడా వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సహాయం చేస్తానని కూడా చెప్పాడు. అధికారులు అందుకు సమ్మతించి మంగల్‌సింగ్‌ వాల్మికి ఇంటి దగ్గరలో ఎక్కువ లోతు బావి తవ్వించారు. కొద్దికాలానికే పరిస్థితి తిరగబడింది. ఈసారి యాదవుల బావి ఎండిపోయింది. దగ్గరలో మంగలియా కొత్తబావి తప్ప మరో బావి లేదు. విధి లేక యాదవులు మంగలియా దగ్గరికి వెళతారని ముందే ఊహించి, లలైసింగ్‌ మంగలియాకు ఒక సూచన చేశాడు. యాదవులు అతని బావిని ముట్టుకుంటే అపవిత్ర మౌతుందనీ, వారిని బావి దగ్గరకు రానివ్వద్దనీ చెప్పాడు.
”అయ్యా! నేను చిన్న కులం వాణ్ణి! అలా అని నేనెలా చెప్పగలనూ?”- అని మంగలియా కంగారుపడ్డాడు. ”ఏం ఫరవాలేదు. అలాగే చెప్పు – ఊళ్లో ఈ వివక్ష, అస్పృశ్యత సమసిపోవాలంటే మనం ఒక్కోసారి కఠినంగా ఉండాలి” అని – ధైర్యం చెప్పాడు. అనుకున్నట్లుగానే యాదవులు బిందెలు, కుండలు తీసుకుని మంగలియా బావి దగ్గరికి వెళ్లారు. మంగల్‌సింగ్‌ అడ్డగించాడు. ”నేను ముట్టుకుంటే మీ బావి అపవిత్రమైపోతుందని అన్నారు కదా? మరి ఇప్పుడు మీరు ముట్టుకుంటే నా బావి అపవిత్రమైపోదా? – వెళ్లండి! వెళ్లండి!!” – అని ఈసడించుకున్నాడు. యాదవులు అసలు విషయం గ్రహించారు. వీడికి ఇలా మాట్లాడే ధైర్యం లేదు. లలైసింగ్‌ వెనక ఉండి వీడితో ఇలా చెప్పిస్తున్నాడని గ్రహించి – అందరూ కలిసి లలైసింగ్‌ దగ్గరకు వెళ్లారు.
”మంగల్‌ సింగ్‌ అన్న దాంట్లో న్యాయం ఉంది కదా?” అన్నాడు లలైసింగ్‌- అతడు గొంతు తడుపు కోవడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకుండా మీరు అప్పుడు అతణ్ణి తన్ని తరిమేశారు కదా? మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నీళ్లకోసం అతని దగ్గరికి వెళ్లారూ?- అని ప్రశ్నించాడు. ఆ రోజుల్లో నేను బావి నుండి నీళ్లు- నా ఇంటికి మోసుకెళితే, నా ఇంటికొచ్చి మంగల్‌ సింగ్‌ నీళ్లు తీసుకుపోయేవాడు తెలుసా? అయినా, అంటూ, ముట్టూ, అప్పృశతా ఎక్కడ ఉన్నాయి? మీ మెదళ్లలో ఉన్నాయి. మీ మూర్ఖత్వంలో ఉన్నాయి. అవన్నీ ఆర్షబ్రాహ్మణులు కల్పిం చినవి. వాటిని అనుసరించడం మనకు అవసరమా? అందరం మనుషులమన్నది గ్రహిస్తే పరిష్కారం దొరుకుతుంది” అని చెప్పాడు లలైసింగ్‌. ” ఏదో ఒకటి చేసి మా అందరి ప్రాణాలు నిలుపు. మాకు నీరు కావాలి!”- అన్నారందరూ.
అందుకు ఒకటే షరతు – ఊళ్లో అస్పశ్యత పాటించగూడదు. అన్ని కులాల, అన్ని మతాలవారు కలిసిపోయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందరి ఇళ్లకు అందరు వెళ్లాలి. మనమంతా మనుషులం- ఒకే జాతి వాళ్లమనేది అందరూ గ్రహించాలి!” – అన్నాడు లలైసింగ్‌. విషయం అర్థమై కొందరు, విధిలేక మరికొందరు ”అలాగే. అలాగే చేద్దాం” అని అన్నారందరూ. లలైసింగ్‌ వెళ్లి మంగలియా బావిలోంచి యాదవులందరికీ మంచినీళ్లు ఇప్పిం చాడు. ఇలాంటి సంఘ సంస్కర్తలు ఎంతోమంది ఎన్నోరకాలుగా క్షేత్రస్థాయిలో ప్రయత్నిస్తూ ఉంటే కదా ఇప్పుడు మనం ఉంటున్న ఈ సమాజం ఏర్పడిందీ? దీన్ని మళ్లీ వెనక్కి నడిపించే వారిని పసిగట్టి, వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చేసింది!
‘ఇతరులకు ఇవ్వడం వల్ల మనసులో ఒక రకమైన విశాలమైన భావన కలుగుతుంది. మనం జీవించే ప్రపంచాన్ని మన చర్యలే సృష్టిస్తాయి కాబట్టి, ఇవ్వడం అనే చర్య ద్వారా విశాలమైన ప్రపంచసృష్టి జరుగుతుంది!’- అని చెప్పింది బౌద్ధ ద్దమ్మం.
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
– డాక్టర్‌ దేవరాజు మహారాజు