‘కూలి’న బతుకులు

Surviving on 'wage'పొట్టచేతబట్టుకుని.. పట్టెడన్నానికి పట్నానికి వచ్చి.. ఉండటానికి నీడలేక.. అద్దె ఇంట్లో ఆపసోపాలు పడుతూ.. అడ్డా కూలీలుగా మారి.. దొరికిన పనులతో కాలం వెళ్లదీస్తున్న బడుగు జీవులు.. ఎండను లెక్క చేయకుండా.. చెమటతో తడుస్తూ… భార్యాపిల్లలను తలచుకుంటూ మట్టిలో మట్టిలా కలిసి పనిచేస్తున్న వారిని ఆ మట్టే కనికరంలేని మృత్యువుగా కబళించింది. అప్పటివరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో క్షణాల్లో విషాదం అలుముకుంది. తేరుకునేలోపే మట్టిపెల్లల కింద మూడు ప్రాణాలు సజీవ సమాధయ్యాయి.
నగరంలో భవన నిర్మాణాల్లో నాణ్యత, నిర్మాణ కూలీల భద్రత గాలిలో దీపంలా మారుతున్నాయి. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలు, సెల్లార్‌ తవ్వకాలు ప్రమాదకరంగా మారి ప్రాణాలను కబళిస్తున్నాయి. ఎల్బీనగర్‌లో బుధవారం చోటుచేసుకున్న సెల్లారు ప్రమాదంలో అధికారుల, నిర్మాణదారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. నగరంలో అటు రోడ్డు అంచు వరకు, ఇటు పక్కనున్న ప్లాటు పునాదుల వరకు సెల్లారును తవ్వడం షరామామూలైంది. నెల కిందట గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో ఇలాగే చేయడంతో పక్కనున్న ఐదంతస్తుల భవనం నేలమట్టమైంది. ఇలాంటి సందర్భాల్లో అధికారులు తాఖీదుల పేరుతో తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. ముందు తేదీలతో నోటీసులిస్తున్నారు. అనుమతులను ఆన్‌లైన్‌లో ఇచ్చి.. నోటీసులను భౌతికంగా ఇవ్వడమే అందుకు నిదర్శనం. అక్రమ నిర్మాణాల రిజిస్టరు నిర్వహణ, డిజిటల్‌ నోటీసులకు ప్రణాళిక విభాగం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఏదేనీ నిర్మాణాన్ని కూల్చివేసే ముందు.. పాత తేదీలతో నోటీసులిచ్చి.. ఒకేసారి కూల్చడం పరిపాటిగా మారిపోయింది. ఇది సర్వత్ర ఆందోళన కలిగిస్తోంది.
స్థలం మొత్తాన్ని వినియోగించుకోవాలనే దురాశతో సెల్లార్‌ కోసం మట్టిని ప్లాటు అంచుల వరకు తవ్వేస్తున్నారు. పిల్లరు బెడ్డుల కోసం.. 25అడుగుల లోతున, ఒకటిన్నర మీటరు పొడవున ఎలుకలు బొరియలు పెట్టినట్టుగా మట్టిని తొలగిస్తున్నారు. ఇవేవీ తవ్వకం ఇంజినీరు పర్యవేక్షణలో జరగటం లేదు. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. భవన నిర్మాణాల్లో బిల్డర్ల ఉల్లంఘనలు, అధికారుల ఆమ్యామ్యాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఏదైనా జరిగితే మొక్కుబడి నోటీసులివ్వడం, నాలుగు రోజులు హడావిడి చేయడం తరువాత చేతులు దులుపుకుంటున్నారే తప్ప కనీసం పశ్చాత్తాపం కూడా చెందడం లేదు. బిల్డర్లు, అధికారులకు మధ్యనున్న ”ఆర్థిక సంబంధాలే” ఇందుకు కారణమనే ఆరోపణలు షరా”మామూలు”గా మారాయి.
అసంఘటిత కార్మికులు నగరాలపై ఆధారపడ్డ తర్వాత భార్యా భర్తలిద్దరూ పని చేయాలి. చాలీచాలని జీతం.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. చాలామంది తమ పిల్లల్ని చదివించలేక మధ్యలోనే చదువు ఆపేసి పనుల్లో పెడుతున్నారు. దాంతో మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు చేయాల్సిన యువత కార్మికులుగా మిగిలిపోయి కష్టం చేసి బతుకుతున్నారు. అనారోగ్యం.. అనుకోని దుర్ఘటన జరిగినా ఇక వారి పరిస్థితి.. వారి కుటుంబ పరిస్థితి దయనీయమే. నిన్నటి ఎల్బీనగర్‌ ఘటనలో కూడా అదే జరిగింది. ఒకే కుటుంబం ముగ్గురిని కొల్పోయింది. రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగించే కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం చూడాల్సిన కార్మికశాఖ వారికి కనీసమాత్రంగా కూడా భరోసా ఇవ్వలేకపోతోంది. కనీస వేతన చట్టం సవరణ చేయకుండా, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా, కనీస పనిగంటలు అమలు చేయకుండా, కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతను కాపాడకుండా ఉత్పత్తి, సేవా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను వంచిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్‌, ప్రయివేట్‌ సంస్థలకే కొమ్ముకాస్తున్నది.
అసలు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి తమ పని కాదన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పని ప్రదేశంలో, నిత్య జీవితంలో కార్మికులు ఎదుర్కొనే చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దీనావస్థకు చేరాయి. కార్మికుల న్యాయమైన కోర్కెలు, డిమాండ్లను కూడా పరిష్కరించలేనంతగా కార్మిక శాఖ నిర్వీర్యమైపోతోంది. గ్రామాల నుంచి బతుకు తెరువు కోసం వలసలు వచ్చిన కార్మికులకు నగరాల్లో కూడా బతుకు గగనమే అవుతుంది. కనీస గుర్తింపు కార్డులు కూడా లేని వారు ఎంతోమంది. ఇలాంటి వారందరిని ప్రభుత్వం గుర్తించి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, రేషన్‌ కార్డులు, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలి. నగరాల్లో కూడా ఉపాధి హమీ పథకం అమలు చేస్తే ఇటువంటి అసంఘటిత కార్మికులకు కొంతపని దొరుకుతుందన్న మేధావులు సూచనలను కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి. అన్నిటికీ మించి ఇలాంటి ఘటనలు, మరణాలు సంభవించకుండా నిబంధనలను కఠినంగా అమలుచేయాలి. నిర్మాణాల్లో ఆక్రమాలనూ అవకతవకలను నివారించాలి. అప్పుడైనా ఇలాంటి బతుకులకు భరోసా దొరుకుతుందని ఆశిద్దాం.