ఇక పనామా కాలువలో ప్రయాణానికి చార్జీల్లేవు

– ప్రకటించిన ట్రంప్‌ సర్కార్‌
– అలాంటిదేమీ లేదన్న పనామా అథారిటీ
– నేడు మరో విడత చర్చలు
వాషింగ్టన్‌: అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకువచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పనామా కాలువ గుండా అమెరికా నౌకలు ఇక చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేకుండా అమెరికా ఓడలు కాలవ గుండా ప్రయాణించవచ్చని, తద్వారా ఏడాదిలో లక్షలాది డాలర్లు ఆదా చేయవచ్చని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఆదివారం తాను జరిపిన చర్చల సందర్భంగా పనామా రాయితీలు ఇవ్వడానికి అంగీకరించిందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. అయితే ఈ ప్రకటనను పనామా కాలవ అధికార యంత్రాంగం తిరస్కరించింది. ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహా సముద్రాలను కలిపే ఈ కీలమైన కాలువను నిర్వహించే పనామా కెనాల్‌ అథారిటీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కాలువ గుండా వెళ్ళే ఓడలకు టోల్స్‌, ఇతర ఫీజులు వసూలు చేసే అధికారం ఈ యంత్రాంగానికి వుంది. ట్రంప్‌ సర్కార్‌కు ఫీజుల విషయంలో తామెలాంటి సద్దుబాట్లు చేయలేదని స్పష్టం చేసింది. అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి సిద్ధంగా వున్నామని తెలిపింది. కీలకమైన ఈ జల మార్గాన్ని పరిరక్షించే స్థానంలో వున్న అమెరికా నుండి ఇలా ఫీజులు వసూలు చేయడం సరైన చర్య కాదని పనామా అథారిటీకి స్పష్టం చేసినట్లు రూబియో తెలిపారు. శుక్రవారం కాలవపై కొత్తగా చర్చలు జరపడానికి ఇరు పక్షాలు సిద్ధంగా వున్నాయి. గత నవంబరులో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి బల ప్రయోగంతోనైనా కాలువను స్వాధీనం చేసుకునే అవకాశం వుందని ట్రంప్‌ చెబుతూ వస్తున్నారు. ఈ కాలువ గుండా 40శాతం అమెరికన్‌ కంటెయినర్లు ప్రయాణిస్తాయి.