పడవ ప్రయాణం…కాలి నడక

– కొండలు, గుట్టలు దాటుకుంటూ పయనం
– దారిలో మృత్య ఒడికి చేరిన వారెందరో
– అక్రమ వలసదారుల కన్నీటి వ్యథలు
అమృతసర్‌: వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికాకు చెందిన సైనిక విమానం బుధవారం అమృతసర్‌ చేరుకుంది. వారిలో ఎవరిని కదిలించినా ఒళ్లు గగుర్పొడిచే విషయాలే చెబుతు న్నారు. అక్రమ మార్గాల్లో అమెరికాకు ఎలా చేరామో వివరించారు. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తనను ముందుగా ఇటలీకి, ఆ తర్వాత లాటిన్‌ అమెరికాకు తీసికెళ్లారని చెప్పారు. మార్గమధ్యంలో రూ.30,000 విలువైన తన బట్టల్ని ఎవరో దొంగిలించారని తెలిపారు. పడవలో 15 గంటల పాటు ప్రయాణించామని, ఆ తర్వాత 40-45 కిలోమీటర్లు నడిచామని కొందరు చెప్పారు. ’17-18 కొండలు దాటాం. పొరబాటున కాలు జారిందా అంతే సంగతులు. బతికే అవకాశమే లేదు. ఇలాంటివి ఎన్నో చూశాం. గాయపడితే చావాల్సిందే తప్ప మందూ మాకూ ఉండదు. ఎన్నో మృతదేహాలను చూడాల్సి వచ్చింది’ అని ఓ యువ కుడు అన్నారు. అమృతసర్‌ చేరిన వలసదారుల్లో 33 మంది హర్యానాకు, మరో 33 మంది గుజరాత్‌కు, 30 మంది పంజాబ్‌కు, ముగ్గురు మహారాష్ట్రకు, ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు, ఇద్దరు చండీఘర్‌కు చెందినవారు. ‘నన్ను సరైన వీసాతో అమెరికా పంపమని ఏజెంట్‌ని అడిగాను. కానీ అతను నన్ను మోసం చేశాడు. గత సంవత్సరం జూలైలో విమానంలో బ్రెజిల్‌ చేరాను. విమానంలోనే అమెరికా పంపుతానని ఏజెంట్‌ హామీ ఇచ్చాడు. కానీ వంచించాడు. అక్రమంగా సరిహద్దును దాటించాడు.
ఆరు నెలలు బ్రెజిల్‌లో ఉన్న తర్వాత సరిహద్దు దాటి అమెరికా చేరాను. కానీ అమెరికా సరిహద్దు గస్తీ దళం నన్ను అరెస్ట్‌ చేసింది’ అని జస్పాల్‌ సింగ్‌ వివరించారు. కాగా స్వదేశానికి చేరుకున్న వారిని విమానాశ్రయం టెర్మినల్‌ భవనంలో వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు ప్రశ్నించారు. వారికి నేర చరిత్ర ఏమన్నా ఉన్నదేమో ఆరా తీశారు.