జవహర్ నవోదయ విద్యాలయం పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేయాలి 

– జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్
నవతెలంగాణ –  కామారెడ్డి
జవహర్ నవోదయ విద్యాలయం వచ్చే విద్యా సంవత్సరానికి 9 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఎంట్రెన్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్ నవోదయ విద్యాలయం లో 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఖాలీగా ఉన్న సీట్ల భర్తీకి రేపు ( 8-2-2025) జరుగనున్న ఎంట్రెన్స్ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇంటర్మీడియట్ కోర్సుకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1-30 వరకు, తొమ్మిదవ తరగతి కోర్సుకు ఉదయం గం.11-15 నుండి గం.1-45 నీ. వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ఎంట్రెన్స్ నిర్వహణకు 14 కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని, 13 కేంద్రాలు కామారెడ్డి లో, ఒక కేంద్రం నిజాం సాగర్ లో ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు. ఇందుకు 9వ తరగతి పరీక్షకు 1739 మంది, ఇంటర్మీడియట్ కు 2103 మంది విద్యార్థులకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్ లను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్రాల వద్ద 144 ( 163 బి ఎన్ ఎస్) సెక్షన్ విధించాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని అవసరమైన మందులతో నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్, పంచాయతీ అధికారులకు తెలిపారు. పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.చంద్ర శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ జనార్ధన్, కామారెడ్డి మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.