‘తండేల్‌’ రివ్యూ

'Tandel' Review‘లవ్‌స్టోరీ’తో హిట్‌ కాంబినేషన్‌గా మారిన నాగచైతన్య, సాయిపల్లవి నటించిన చిత్రం.. ‘కార్తికేయ 2’తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు  చందూమొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం.. ‘100% లవ్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాగచైతన్యతో గీతాఆర్ట్స్‌ నిర్మించిన చిత్రం.. ‘బుజ్జితల్లి..’, ‘హైలెస్సో’,  ‘ఓం నమ:శివాయ’ వంటి పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందడం.. వెరసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాల్సిన అన్ని అంశాల్లో ‘తండేల్‌’ నూటికి నూరు శాతం  మార్కుల్ని సొంతం చేసుకుంది. అయితే థియేటర్లకి వచ్చిన ప్రేక్షకులతో అదే స్థాయి మార్కుల్ని సొంతం చేసుకుందా లేదా అనేది చూద్దాం.
పలు కారణాలతో సముద్రాల్లో సరిహద్దుల్ని దాటి అటు పాకిస్తాన్‌, ఇటు శ్రీలంక పోలీసులకో పట్టుబడిన జాలర్ల గురించి మనం తరచూ వార్తల్లో వింటుంటాం, చదువు తుంటాం. ఇలాంటి వార్తలు, వాస్తవ సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
జాలర్ల కుటుంబాలకు చెందిన రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమకథని చూపిస్తూనే, మరో వైపు పాకిస్తాన్‌లాంటి శత్రు దేశంలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న జాలర్ల వెతలతో దేశభక్తిని చాటే యత్నం చేశాడు దర్శకుడు.
అయితే ఈ ప్రయత్నంలో ఆయన తడబడిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. అటు ప్రేమకథలో, ఇటు దేశభక్తిని చాటే అత్యంత కీలక సన్నివేశాలు బలంగా లేకపోవడమే ఇందుకు కారణం. పైగా ఆ సన్నివేశాల్లో సైతం ఫ్రెష్‌నెస్‌ కనిపించకపోవడం మరో కారణం.
‘తండేల్‌’ అంటే లీడర్‌ అని అర్థం. ఆ లక్షణాలు రాజులో ఉన్నాయని చూపించే సన్నివేశాలూ ఇదే కోవలో ఉన్నాయి. ఇక సినిమా ప్రారంభమైన గంట సేపు వరకు నత్తనడకలా సాగుతూ సహనానికి పరీక్ష పెడుతుంది.
ఈ సినిమా చూస్తున్నంత సేపూ మణిరత్నం ‘రోజా’, ఐశ్వర్యరారు ప్రధాన పాత్రలో నటించిన ‘సర్జజీత్‌’ సినిమాల్లోని సన్నివేశాలు గుర్తొస్తుంటాయి.
నటన పరంగా ఇందులో సరికొత్త నాగచైతన్య కనిపించారు. తండేల్‌ రాజుగా తన పాత్ర కోసం ఆయన మారిన విధానం, అలాగే మాట్లాడిన శ్రీకాకుళం యాస కూడా బాగుంది. ఇక సత్యగా నటించిన సాయిపల్లవి కూడా అద్భుతంగా నటించింది. ఆన్‌స్క్రీన్‌ వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే ఆడుకాలం నరేన్‌, కరుణాకరన్‌, ప్రకాష్‌ బెలవాడి, పృధ్వీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దేవిశ్రీ ప్రసాద్‌ తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ ఏంటో మరోసారి ఫ్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమాకి తన మ్యూజిక్కే బలమైన శక్తి. కొన్ని సన్నివేశాలకు ఆయన సమకూర్చిన నేపథ్య సంగీతం అద్భుతం. ‘బుజ్జితల్లి’, ‘హైలస్సో’, ‘నమ: శివాయ’ పాటలు స్క్రీన్‌పై విజువల్‌ ట్రీట్‌ ఇచ్చాయి. శ్యామ్‌దత్‌ కెమెరా పనితనం, శ్రీనాగేంద్రతంగల కళాదర్శకత్వం బాగున్నాయి. ఎడిటింగ్‌ని నవీన్‌నూలీ ఇంకా బాగా చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓ భావోద్వేగభరిత ప్రేమకథని, దేశభక్తితో సమ్మిళితం చేసి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో ‘తండేల్‌’ తడబడి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో ఇది ఫర్వాలేదనిపించే సినిమాగా నిలిచింది. అయితే నాగచైతన్య మెస్మరైజింగ్‌ పర్‌ఫార్మెన్స్‌కి మాత్రం ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
– రెడ్డి హనుమంతరావు
నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, ప్రకాశ్‌ బెలవాడి, కల్పలత, ఆడుకాలం నరేన్‌, కరుణాకరన్‌, పృథ్వీరాజ్‌, చరణ్‌దీప్‌, మహేష్‌, పార్వతీశం తదితరులు
సాంకేతిక నిపుణులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎడి టింగ్‌ : నవీన్‌ నూలి, సినిమాటో గ్రఫీ : శ్యామ్‌దత్‌, కథ: కార్తీక్‌ తీడ,
నిర్మాత : బన్నీవాసు, సమర్పణ : అల్లు అరవింద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : చందూ మొండేటి.
విడుదల : 7-2-2025
బలాలు : నాగచైతన్య, సాయిపల్లవి నటన దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం శ్యామ్‌దత్‌ సినిమాటోగ్రఫీ శ్రీ నాగేంద్రతంగల కళా దర్శకత్వం
బలహీనతలు : తెలిసిన కథ నత్తనడకలా సాగే తొలి గంట సన్నివేశాలు.. పేలవమైన పాకిస్తాన్‌ ఎపిసోడ్‌