ఇక హెచ్‌1బీ భారమే

And H1B is a burden– అధిక ఫీజులు..ట్రంప్‌ కొత్త నిబంధనలు
– మార్చి 7 నుంచి హెచ్‌1బీ క్యాప్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం
వాషింగ్టన్‌ : ఈ ఏడాది మార్చి 7 నుంచి హెచ్‌1బీ క్యాప్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానున్నది. హెచ్‌1బీ వీసా క్యాప్‌ లాటరీ కోసం ఆసక్తి కలవారు నమోదు చేసుకోవచ్చు. ఇది మార్చి 24 వరకు కొనసాగుతుంది. ఇక ఇదే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఉపాధిని చేర్చనున్నారు. వీసా లాటరీ పటిష్టతను మెరుగుపర్చాలనే కోరిక నుంచి పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఫీజులు, టాప్‌-డౌన్‌ షిఫ్టింగ్‌తో సహా లాటరీకి కొత్త మార్పులు ఉద్భవించాయని విశ్లేషకులు చెబుతున్నారు.
దరఖాస్తుదారుని రిజిస్ట్రేషన్‌ ఫీజు తీవ్రంగా పది డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరిగింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదిగా చెప్తున్నారు. ఇక మునుపటిలాగే, దరఖాస్తును సమర్పించటా నికి ఒకే ప్రత్యేకమైన పాస్‌పోర్ట్‌ నెంబర్‌ను మాత్రమే ఉపయోగించవచ్చు. ఆమోద వ్యవధి ముగిసిన తర్వాత యూఎస్‌సీఐఎస్‌.. ఈ ఏడాది మార్చి 31 నాటికి పేర్ల ఎంపికను పూర్తి చేస్తుందని అంచనా. ఎంపిక చేసిన ఉద్యోగుల యజమానులు.. దానిని స్వీకరించిన తర్వాత వారు హెచ్‌1బీ వీసా దరఖాస్తుకు అనుగుణంగా ఉండాలి. అవసరమైన సహాయక పత్రాలు, రుసుములను సమర్పించాల్సి ఉంటుంది.
గతంలో అనేక మంది యూఎస్‌ ఉద్యోగులు అంతకముందు దాఖలు చేయకపోతే, తిరస్కరణలు ఉంటే.. మిగిలిన హెచ్‌1బీ వీసా కోటాను పూరిం చటానికి యూఎస్‌సీఐఎస్‌ రెండో లాటరీని నిర్వహించింది. అయితే, కొత్త వ్యవస్థ కింద.. ఏజెన్సీ దీనిని వీలైనంత అరుదుగా చేయాలని కోరుకుంటున్నది. ఒకవైపు రుసుము పెంపు, రిజిస్ట్రేషన్‌ మార్పులు అమలులోకి వచ్చాయి. మరోవైపు, కొత్త హెచ్‌1బీ ఆధునీకరణ నియమాలు గతేడాది జనవరి 17న అమలు చేయబడ్డాయి.
హెచ్‌1బీ వీసాలలో 72 శాతానికి పైగా భారతీయులే : కేంద్రం
అక్టోబర్‌ 2022 నుంచి సెప్టెంబర్‌ 2023 వరకు అమెరికా జారీ చేసిన మొత్తం హెచ్‌1బీ వీసాలలో 72.3 శాతం భారతీయ పౌరులే పొందారు. యూఎస్‌ పౌరసత్వ, వలస సేవల డేటాను ఉటంకిస్తూ రాజ్యసభకు కేంద్రం తెలిపింది. ఉక్రెయిన్‌లో వివాదం ప్రారంభానికి ముందు 21,928 మంది భారతీయ విద్యార్థులున్నారనీ, కానీ నవంబర్‌ 01, 2024 నాటికి వివిధ ఉక్రెయిన్‌ విశ్వవిద్యాలయాల్లో 1802 మంది విద్యార్థులే చేరారని ప్రభుత్వం ఎగువ సభకు వివరించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ లిఖిత పూర్వక సమాధానాన్ని వెల్లడించారు. హెచ్‌1బీ వీసా కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలపై సంబంధిత ద్వైపాక్షిక సంభాషణ విధానాల ద్వారా భారత ప్రభుత్వం అమెరికాతో, ఇతర వాటాదారులతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నదని వివరించారు. విదేశాలలో ఆర్థిక మాంద్యం, ఉపాధి నష్టం, ఆర్థిక అస్థిరత కారణంగా భారత్‌కు తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్యపై డేటా అందుబాటులో లేదని కేంద్రం తెలపటం గమనార్హం.ఇజ్రాయిల్‌, పాలస్తీనా, ఉక్రెయిన్‌లలో ఇప్పటి వరకు జరుగుతున్న ఘర్షణల వల్ల ప్రభావితమైన మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంత అని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు ఒక ప్రత్యేక ప్రశ్నలో అడిగారు. ”ఉక్రెయిన్‌లో వివాదం ప్రారంభానికి ముందు 21,928 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. గతేడాది నవంబర్‌ 1 నాటికి, వివిధ ఉక్రేనియన్‌ విశ్వవిద్యాలయాలలో 1802 మంది విద్యార్థులు మాత్రమే చేరారు” అని జైశంకర్‌ తన ప్రతి స్పందనలో వివరించారు. ఇక ఇజ్రాయిల్‌లో దాదాపు 900 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారనీ, వీరు ఎక్కువగా స్టెమ్‌ రంగాలలో పీహెచ్‌డీ లేదా పోస్ట్‌డాక్టోరల్‌ అధ్యయనాలలో చేరారన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన దాడుల తర్వాత భారత ప్రభుత్వం భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావటానికి ‘ఆపరేషన్‌ అజరు’ను ప్రారంభించిన విషయం విదితమే. దీని కింద 1309 మంది భారతీయులు దేశానికి తిరిగి వచ్చారు. ఇందులో 768 మంది భారతీయ విద్యార్థులూ ఉన్నారు. పాలస్తీనాలో భారతీయ విద్యార్థి ఒక్కరు కూడా లేరని విదేశాంగ మంత్రి తెలిపారు.