ఎల్‌ఐసీ లాభాల్లో 17 శాతం వృద్ధి

17 percent growth in LIC profitsన్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 17 శాతం వృద్ధితో రూ.11,056 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ 2023-24 ఇదే త్రైమాసికంలో రూ. 9,444 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,17,017 కోట్ల నికర ప్రీమియం వసూళ్లు చేయగా.. గడిచిన క్యూ3లో 8.6 శాతం తగ్గి రూ.1,06,891 కోట్లుగా చోటు చేసుకుంది. అయినప్పటికీ లాభాల్లో మెరుగైన వృద్ధిని కనబర్చడం విశేషం. గడిచిన డిసెంబర్‌ త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.2,01,994 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాది త్రైమాసికంలో రూ.2,12,447 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ 10.29 శాతం పెరిగి రూ.54,77,651 కోట్లకు చేరింది. 2024-25 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో ఎల్‌ఐసీ లాభాలు 8.27 శాతం పెరిగి రూ.29,138 కోట్లుగా నమోదయ్యింది.