ఆసియా క్రీడలకు వృతి అగర్వాల్‌

– ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ స్విమ్మర్‌
హైదరాబాద్‌ : తెలంగాణ యువ స్విమ్మర్‌ వృతి అగర్వాల్‌ రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల్లో పోటీపడనున్న తొలి తెలంగాణ స్విమ్మర్‌గా నిలువనుంది. హౌంగ్జౌ ఆసియా క్రీడలకు భారత స్విమ్మింగ్‌ సమాఖ్య భారత జట్టును శనివారం ప్రకటించింది. మహిళల 4, 200 మీటర్ల రిలే రేసులో వృతి అగర్వాల్‌ పోటీపడనుంది. 16 ఏండ్ల వృతి అగర్వాల్‌ ఇటీవల జాతీయ క్రీడల్లోనూ నాలుగు పతకాలతో మెరిసింది. తాజాగా హైదరాబాద్‌లో ముగిసిన జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లోనూ పతకాల పంట పండించింది. ‘ఆసియా క్రీడల భారత జట్టులో ఇంత త్వరగా చోటు ఆశించలేదు. ఇంత గొప్ప అవకాశం లభించటం పట్ల సంతోషంగా ఉంది. ఆసియా క్రీడల మెగా సవాల్‌కు సిద్దమవుతాను. ఆసియా క్రీడల్లో పతకంతో దేశం గర్వపడేలా చేస్తానని’ వృతి అగర్వాల్‌ తెలిపింది.