క్రీడా రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తాం 

– ధనసరి సూర్య యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
క్రీడా రంగానికి ప్రభుత్వంలో తగిన ప్రోత్సాహం అందిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని దుంపెళ్ళిగూడెం రహదారి పక్కన మెరిట్ స్కూల్ గ్రౌండ్ నందు అరుణోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఇన్విటేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క తనయుడు, యువ నాయకులు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడారు.అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొత్తపల్లి ప్రసాద్ రావు కి అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అలాగే నేటి యువత క్రీడలను మరిచి చరవాణిలో మునిగి తేలుతున్నారు అని, అందులో బాల్ బ్యాడ్మింటన్ అంతరించిపోతున్న క్రీడ అని, నేటి తరం యువతకు బాల్ బ్యాడ్మింటన్ క్రీడ గురించి కూడా తెలియదని కానీ, అరుణోదయ యూత్ వారు 45 యేండ్ల పైబడిన వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ పెట్టడం, టోర్నమెంట్ విజయవంతం చేయడం అసాధారణం అని, అయిన ఎంతగానో శ్రమించి నేడు టోర్నమెంట్ విజయవంతం చేయడం ఆనందంగా ఉందని, నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన 45 యేండ్ల పైబడిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని అన్నారు. అలాగే నేటి యువత కూడా క్రీడల్లో పాల్గొని, క్రీడా రంగంలో రాణించాలని, యువతకు నేను ఎప్పుడు అండగా ఉంటానని, యువత క్రీడలకు తగిన ప్రోత్సాహకరం కూడా అందిస్తా అని అన్నారు. క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉంటారని అన్నారు. ఇకనైనా నేటి యువత అందరూ క్రీడల్లో పాల్గొని మన గ్రామానికి, మండలానికి, జిల్లాకు మంచి పేరును తీసుకురావాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, గోవిందరావుపేట మండల అరుణోదయ యూత్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.