అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత 

– ఎస్సై క్రాంతి కిరణ్ 

నవతెలంగాణ – పెద్దవంగర: అనుమతులు లేకుండా ట్రాలీ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అవుతాపురం గ్రామ శివారులో పోలీసులు శుక్రవారం ఉదయం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో నాంచారి మడూరు నుండి జనగాం జిల్లా నవాబ్ పేట మార్కెట్ కు వెళ్తున్న ఆటో ట్రాలీని ఆపి తనిఖీలు చేశారు. అందులో అనుమతులు లేకుండా ఆవు, రెండు లేగ దూడలు, గేదె, రెండు గేదె దూడలు తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆ పశువులు, ఆటో ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం, గుండ్య తండాకు చెందిన బానోత్ నారాయణ, వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, గోప్య తండాకు చెందిన భూక్యా రాములు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పశువులను సంరక్షణ కోసం వర్ధన్నపేట లోని బృందావన గోశాలకు తరలించారు.