కాలేయంలో కొవ్వు (ఫ్యాటీ లివర్) ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య. ఒకసారి సమస్య మొదలయ్యాక పూర్తిస్థాయితో పరిష్కరించడం సాధ్యమౌతుందో లేదో చెప్పలేం. అయితే కొన్ని జాగ్రత్తలతో సమస్య పెరగకుండా నియంత్రించగలం. అందుకు ప్రధానంగా మనం చేయవలసినది ఆహార నియంత్రణ. అనారోగ్య సమస్య ఏర్పడిన తర్వాత అన్ని రకాల పదార్థాలు, కూరగాయలు, పండ్లు తినేందుకు అవకాశం ఉండదు. అధిక కొవ్వు తప్పనిసరిగా తగ్గించుకోవాలి. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ఏమేమి తీసుకోవచ్చో, తీసుకోకూడదో తెలుసుకుందాం.
పండ్లు, కూరగాయలు: వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువ ఉండాలి.
లీన్ ప్రోటీన్లు: చేపలు, పౌల్ట్రీ, బీన్స్, గింజలు వంటి లీన్ ప్రోటీన్లు ఎంచుకోవాలి.
ఫైబర్: ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి. ఫైబర్ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తణధాన్యాలు: బ్రౌన్ రైస్, ఓట్ మీల్ లేదా హోల్ వీట్, పాస్తా వంటివి ఎంచుకోవచ్చు.
బ్రోకలీ: బ్రోకలీ థైరాయిడ్ పనితీరు, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వాల్‌నట్‌లు: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ సమస్యను అదుపులో ఉంచుతాయి.
పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కాలేయ హానికారకాలను నిరోధిస్తుంది.
పరిమితం చేయవల్సినవి..
చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలను పరిమితం చేసేందుకు ప్రయత్నించాలి. అందులో రెడ్ మీట్, కోల్డ్ కట్స్, బేకరీ పదార్థాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, మద్యం వంటివి తగ్గించడంతో పాటు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ సమస్యను అధిగమించవచ్చు.