సందీప్ కిషన్, త్రినాథనావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మజాకా’. ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. రీతు వర్మ హీరోయిన్. ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఈనెల 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అన్షు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఆ స్పందనే నాకు నమ్మకాన్నిచ్చింది..
నాగార్జునతో ‘మన్మథుడు’, ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ సినిమాల తర్వాత లండన్ వెళ్ళిపోయాను. మాస్టర్స్ కంప్లీట్ చేసి, సైకాలజిస్ట్ అయ్యాను. అలాగే పెళ్ళి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అయితే నాకు మళ్ళీ సినిమాల్లో చేయాలని ఉండేది. ‘మన్మథుడు’ రీ రిలీజ్‌కి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంట్లో వారి సపోర్ట్‌తో మళ్ళీ ఈ సినిమాతో తెరపైకి రావడం ఆనందంగా ఉంది.
నవ్వుతూనే ఉన్నాను..
‘మజాకా’ లవ్లీ స్టోరీ. నాకు చాలా నచ్చింది. ప్రసన్న ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజారు చేశాను. నవ్వుతూనే ఉన్నాను. నా క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. 23 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ తెరపై కనిపిస్తున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని, నా పెర్ఫార్మెన్స్‌ని అందరూ ఇష్టపడతారనే నమ్మకం ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు యశోద. తను హెడ్ స్ట్రాంగ్ విమెన్. తనకి ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. అది ఆ పాత్రలో కనిపిస్తుంది. యశోద పాత్రలో లీనం కావడానికి నా వంతు ప్రయత్నం చేశాను. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కినతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రావు రమేష్ చాలా సపోర్టివ్. ఆయన డబ్బింగ్ పూర్తి చేసి ‘అన్షు అద్భుతంగా చేశావ్’ అని చెప్పడం చాలా ఎనర్జీ ఇచ్చింది. సందీప్ కిషన్, రీతు వర్మతో కాంబినేషన్‌లో సీన్స్ ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి.
నటనకి స్కోప్ ఉన్న పాత్రలే చేస్తా..
ఈ సినిమా నాకు కరెక్ట్ రీ ఎంట్రీ సినిమా. తదుపరి సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ చేసినా కథాపరంగా మంచి స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాను. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రల్నే చేస్తాను.