బడి ”జట్టు”- బడ్జెట్టు

School "Team"- Budgetమొత్తమ్మీద ఈసారి బడిజట్టులో మధ్యతరగతి కింది తరగతివాళ్లను బాగా పట్టించుకు న్నారట కద యాదన్నా, అన్నాడు నర్సింగ్‌. పక్కనే ఉన్న దామోదర్‌ అడిగాడు బడిజట్టు ఏమిటి నర్సింగ్‌ అన్నాడు. అదే అన్నా, ఆర్ధిక మంత్రి పార్లమెంటులో పెద్ద స్పీచ్‌ ఇచ్చి లెక్కలు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి? అని సూటుకేసులో పేపర్లు పెట్టుకొస్తారే! అది నేననేది అనేసరికి దామోదర్‌ నవ్వాడు. ఎందుకన్నా నవ్వుతావు అన్నాడు నర్సింగ్‌ అమాయకంగా. దాన్ని బడ్జెట్‌ అంటారు నర్సింగ్‌ అని చెప్పాడు దామోదర్‌. ఇద్దరి మాటలూ వింటున్న యాదన్న అందుకొని, మన నర్సింగ్‌ చెప్పిన దానిలో తప్పేమీ లేదు దామోదర్‌, లోతుగా చూస్తే ఎవరి బడి వారికుంది పార్లమెంటులో అంటే ఎవరి స్కూల్‌ వారిదన్నమాట! వాళ్లవాళ్ల బడులకు మంచిపనులు ఈ బడ్జెట్‌ ద్వారా చేస్తారన్న మాట. ఏ బడ్జెట్టుకైనా ముందు చాంబర్‌ ఆఫ్‌ కామర్సు వ్యాపారవేత్తలతో, ప్రరిశ్రమల యజమానులతో కలిసి ఆర్ధిక మంత్రి సంప్రదింపులు జరుపుతారు కదా. అది సంగతి. నాకు నోరు తిరగక అలా అన్నాను కాని దానిలోనూ నిజముందని యాదన్న భలే చెప్పిండు అని సర్సింగ్‌ మురిసిపోయాడు. ఇక మిత్రులందరితో ఈ విషయం చెప్పుకోవాలని అక్కడినుండి లేచాడు.
ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటిరోజు అన్ని పేపర్లలో రకరకాల వార్తలొస్తాయి. మధ్యతరగతిని లెక్కలోకి తీసుకున్న ప్రభుత్వం అని ఒకరు, పేదవారి బడ్జెట్టుగా ఒకరు, ఉన్నోళ్లకే మళ్లీ పెద్ద పీట అని ఒక పేపర్లో, అందరినీ ఆదరించిన బడ్జెట్‌ అని ఒక పేపరు ఇలా ఎన్నో వార్తలు. అసలు ఏ పద్దుల్లో ఎలాంటి ఖర్చులు చేస్తారు, ఏ సరుకులు, వస్తువులు ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి, రూపాయి రాక ఎలా ఉంటుంది, రూపాయ పోక ఎలా ఉంటుంది అన్న విశ్లేషణలూ ఉంటాయి. ఇక నిజాలు మాత్రమే నిఖార్సుగా రాసే పత్రికలు ఇది కార్పోరేట్ల బడ్జెట్‌ అని, పెద్దోళ్ల బడ్జెట్‌ అని ఇది మామూలేననీ రాస్తారు. ఈ రాతలు కూడా మామూలే మేమవన్నీ పట్టించుకోమని ఈ ఆర్ధిక పద్దులు ప్రవేశపెట్టేవాళ్ళూ అంటుంటారు. ఇక ప్రధాని ఎవరైనా సరే మా ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టింది అభివఅద్ధికరమైన బడ్జెట్‌ అని అనడం, తరువాత రాష్ట్రపతి తమకు రాసిచ్చిన ఉపన్యాసం చదువుతూ ఇది దేశాన్ని ముందుకు తీసుకుపోయే బడ్జెట్‌ అని మాట్లాడడం కూడా మామూలే. వీళ్లంతా కూడా అసలు అంబేడ్కర్‌ మహాశయుడు, ప్రజల పార్టీలు దీనిపై ఏమి చెప్పారు అని ఒక్కసారి చూసినా పరిస్థితి ఇలా ఉండదు.
ఇవన్నీ చూసి అది నిజమే కదా, ఇది నిజమే కదా అని సామాన్య ప్రజలు తమ తెలివికి పదును పెట్టి ఆలోచిస్తారు. ఏముందిలే కొత్త సీసాలో పాత సారా అని కొందరు పెదవి విరుస్తారు. ఆ.. ఈ బడ్జెట్‌ మన బతుకుల్ని బాగు చేసిందెప్పుడు, ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం అని కొద్దిగా కవిత్వాన్ని కలిపి చెప్పేవాళ్లూ ఉన్నారు. కొందరు కవులు కూడా తమవంతు బాధ్యతగా ఆర్ధికాంశాలతో కవిత్వం రాస్తారు. ఇక కార్మిక, ఉద్యోగ సంఘాలు అసలు ఇది ఎవరి బడ్జెట్‌ అని సదస్సులూ పెడతారు. విద్యార్ధి, యువజన సంఘాలు కూడా తమవంతుగా ప్రచారాలు చేస్తుంటారు. అసలు అక్కడినుండే కదా ముందు తరం తయారయ్యేది. అందుకే విద్యకు, వైద్యానికి ఈ బడ్జెట్లలో వేసే పీట రోజు రోజుకూ చిన్నగైపోవడం గురించి వాళ్లు చెబుతారు. వాటికి ఇన్ని కోట్లు కేటాయించామని ప్రభుత్వాలు చెబుతారు కాని మొత్తంలో వాటి శాతం తగ్గిపోవడం మనం చూస్తూనే ఉంటాము. చెప్పేటోళ్లు చెబుతూనే ఉంటారు, రాసేటోళ్లు రాస్తూనే ఉంటారు కాని ఎన్నికల సమయంలో ఇవన్నీ ప్రజలకు గుర్తుండవు. అందుకే వాళ్లకు సరిపోయే బడ్జెట్లు ఇంకా రావడం లేదు. ఎప్పుడూ ప్రజలను ఏమీ అనకూడదు ఎందుకంటే వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పడం లేదని కాదు కాను అర్థం చేయడం చాలా చాలా ముఖ్యం. వాళ్లనుండే ప్రజల్ని బాగు చేసే నాయకులు వస్తారు మరి. పునాది వాళ్లనుండి ఉంటే కాని తాము కోరుకున్న సమాజం రాదు. ఇలాంటి బడ్జెట్లు ఎన్నో వస్తూ పోతూ ఉంటాయి ఎన్నికల్లాగ. అంతర్లీనంగా మార్పు అనేది కొద్దిగానైనా వస్తుందో లేదో చూసుకోవడం అభివృద్ధికర శక్తులకు ఒక బాధ్యతగా ఉండాలి.
మేడం వేతన జీవులకు బహుమతిగా ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చారని ఒకరు రాస్తే అదేం లేదు సారుకు అంటే పెద్దాయనకే ప్రయిజులన్నీ అని పెదవి విరిచేవాళ్లూ ఉంటారు. ఒక పక్క కొత్త పారిశ్రామికవేత్తలకు ఇన్ని కోట్ల రుణాలిస్తామని అంటూనే ఇంకో పక్క బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నూరు శాతానికి పెంచుతున్నామంటారు. వేతన జీవుల వెతలన్నీ ఇక మటుమాయం, మా అక్క అందరినీ బాగా చూసుకుంటుంది అనుకునేలోపు పెంచిన ఆదాయపు పన్ను పరిమితి ద్వారా ఎలాంటి లాభంలేదని పాత, కొత్త ఆదాయపు పన్ను లెక్కలతో సహా ఇంకొకరు పోస్టు పెడతారు. కనీసం ఆనందపడిన సమయం కొద్దిగానైనా మిగిలించకుండా ఈ వార్తలేమిటిరా బాబూ అనుకునే ఉద్యోగులు మళ్లీ దేంట్లోనో పొరబడ్డామని కించిత్‌ నిరాశ పడతారు. దురాశ దు:ఖమునకు చేటు అని చిన్నప్పుడు చదువుకున్నది ఇంత పెద్దగైనా పనికొస్తుందని అప్పుడే తెలుసుకుంటారు. ఆశ దోశ అప్పడం అన్నట్టు ఈ బడ్జెట్టు ఉందని వాపోతారు.
బడ్జెట్‌ పద్మనాభాలు, రాజబాబులు, రేలంగిలు, బ్రహ్మానందాలు ఎవ్వరూ ఆనందంతో లేరని నవ్వించేవాళ్లెవరూ నవ్వుతూ లేరని దాన్నే తాత్వికంగా బడ్జెట్‌ అందురు అని ఒక ఆర్ధిక స్వామీజీ చెప్పొచ్చు. ఏది రాక ఏది పోక అంతా భ్రమ నాయనా, అంతా భ్రమే తల్లీ అందుకే ఈ డబ్బు మీద వ్యామోహం మాని ఇహలోకం మీద పొందే సుఖాలు ఏవీ ఉండవని నమ్మండి. అనే స్వామీజీకి మీరెప్పుడూ అంతే తత్వం మాకు చెబుతారు, ఆర్ధికం వాళ్ళకు చెబుతారు. సుఖంగా ఉండేది వాళ్లు, కష్టాలు పడేది, పడాల్సింది మేము అన్న సమాధానం ఎదురైనప్పుడే అసలు విషయం తెలిసేది. స్వాములెప్పుడూ రాజులకు, తరువాత రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటారని తెలుసుకుంటారు జనాలు. ప్రవచనాలు చెప్పేవాళ్లెప్పుడూ ఈ బడ్జెట్లు మంచివి కావని చెప్పనే చెప్పరు. ఇంకా వీలైతే రాజులు, వారి బాధ్యతలు, వాళ్ల ఖర్చులకు ప్రజలే కదా డబ్బు సమకూర్చాలని చెప్పినా చెప్పొచ్చు.
కాబట్టి నర్సింగ్‌ చెప్పినట్టు ఈ ఆర్ధిక పద్దులకు సంబంధించి ఎవరి బడి వాళ్లకుంటుంది. ఎవరి బడికి వాళ్లు సౌకర్యాలు, కేటాయింపులు చేస్తూ ఉంటారు. వ్యతిరేక బడుల వాళ్లు బలోపేతం కావడమే కదా ప్రజలకు కావలసింది. అప్పుడే ప్రజల బడికి సంబంధించిన బడ్జెట్లు వచ్చేది. గమనించండి జాగ్రత్తగా.
– జంధ్యాల రఘుబాబు, 9849753298