గరం గరం పొగరున్న కుర్రాడి పాట

Garam Garam Pogarunna Kurradi songమంచివాళ్ళకి మంచివాడిగా, శత్రువులకు యముడిలా కనిపిస్తూ, చెడు ఎక్కడ కనిపించినా చీల్చి చెండాడే హీరో విశ్వరూపాన్ని పొగడుతూ వచ్చిన పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. హీరో ఎంట్రీ సాంగ్స్‌ ఓ కొత్త ట్రెండ్‌ ను సష్టించాయి. అలాంటి పాటల వరుసలోనిదే ఇపుడు మనం ముచ్చటించుకోబోయే పాట.. 2024 లో వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో సేనాపతి భరద్వాజ పాత్రుడు రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం..
హీరో తన తల్లికిచ్చిన మాట కోసం ఆరు రోజులు తన ఆవేశాన్ని అణచుకుంటూ ఉంటాడు. శనివారం మాత్రం తనకు అన్యాయం చేసిన వారిపై విరుచుకుపడుతుంటాడు. పగ తీర్చుకుంటాడు. అలా..హీరో ఖలేజాని, అతనికున్న దమ్ముని, ధైర్యాన్ని పొగడుతూ సేనాపతి భరద్వాజ పాత్రుడు అద్భుతమైన పాటను రాశాడు..తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ పదాలను ప్రయోగిస్తూ ఒక కొత్త అభివ్యక్తితో పాటను రాశాడు..
దేనికైనా తెగించేవాడు. దేనినైనా గెలిచేవాడు. అసాధ్యాలను కూడా సాధ్యం చేసేవాడు. అతడే కథానాయకుడు.. ఆ కథానాయకుడు ఆరు రోజుల పగను పంటి కింద అదిమిపెట్టుకుని శనివారం రాగానే ఆ పగను, ఆ ఆవేశాన్ని చల్లార్చుకుంటాడు. ఎక్కడికక్కడి లెక్కలు తేల్చుకుంటాడు. ఆరు రోజులు పెండింగ్‌ లో ఉన్న అవినీతి కేసులకు శనివారం రోజు ముగింపు చెబుతాడు. అలా అని హీరో ఇక్కడ అందరిపట్ల ఆవేశాన్ని ప్రదర్శించడు. అవినీతిపరుల పట్ల, తనకు అన్యాయం చేసిన తన శత్రువులపట్ల మాత్రమే విలనిజాన్ని ప్రదర్శిస్తాడు.
అతడు గండర గండడు. దుండగుల సమూహానికి దండన వేసే యోధుడు. అతడు మామూలుగా నాటుదనమున్నవాడు. కాని ఆరురోజులు మాత్రం నీటుగా కనబడతాడు. అతనిలో ఉన్న కరకుదనం అందరికి అంత తొందరగా కనబడదు. ఎంత పనిలో ఉన్నా, బాధ్యతగా ఉన్నా తడబాటు మాత్రం అతను ఎరుగడు. క్లాస్‌, మాస్‌ రెండింటిని తనలో చూపించగల నేర్పున్నవాడు. మునిలాగా మౌనంగా ఉంటాడు. అలా ఆరురోజులు ఆయన మునిలా ఉన్నప్పుడు ఎవ్వరిని ఎదిరించడు. బెదిరించడు. ఎలాంటి యుద్ధభేరీలు మోగించడు. ఇక శనివారం వస్తే శత్రువు తలను పలకలాగా భావిస్తాడు. తను రాయాల్సిన రాత రాస్తాడు. అంతటి తెగువ ఉన్న వీరుడతడు. అతనితో ఎవరైనా మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతిరోజు ప్రశాంతమే. శనివారం మాత్రం ప్రళయమే..
గరం గరమున్న యముడతడు. ఆరు రోజుల్లో మాత్రం సహనంతో ఉన్న శివుడిలా కనబడతాడు. అతని నరనరం బిగువుతో పిడికిలెత్తి నిలబడుతుంది. నియమాలు తెలిసిన తెగువ ఉన్నవాడు. ఎక్కడ ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు..అతని కణకణం కరుగుగా నాటుగా ఉంటుంది. అందరిలాంటి వాడిలా ఉండడు. ప్రత్యేకంగా
ఉంటాడు. ఇది అతనిలో ఉన్న ఇంకో రకం.. అయోమయం తగదని తెలిసినవాడు. సమయాన్ని బట్టి శత్రుసంహారం చేసుకుంటూ వెళ్తాడు.
ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే కిక్కును వారమంతా పక్కన పెడతాడు. విశ్రాంతి అనే పరీక్షలో లిస్టులు రాసి సిద్ధం చేసుకుంటాడు. ఆ తరువాత సమయం చూసి యుద్ధం ప్రారంభిస్తాడు. తప్పు ఒప్పుల గడబిడల మధ్యన ఏది సరియైనదో తెలపడు. ఏది మార్గం.. ఏది ఎడమ, కుడిమ అంటూ దారుల సంగతి గందరగోళంగా ఉన్నా ఎవ్వడి సహాయం తీసుకోడు.
అతని కనుచూపు ఉరిమితే చీకటికున్న తిమ్మిరి వదిలిపోతుంది. ఆ నలుపురంగు కరిగిపోయే వరకు మెరుపులా మెరుస్తూ తరుముతాడు. పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రజల్ని పీడిస్తూ ఉంటే శ్రీకష్ణుడు, సత్యభామ కలిసి అతన్ని సంహరించి ప్రజల్ని రక్షించినట్టుగా హీరో కూడా అమాయకుల్ని పీడించే అసురులను శిక్షిస్తాడు. మంచివాళ్ళను రక్షిస్తాడు. సరికొత్త లోకాన్ని సష్టించాడతడు అది ఎంతో ప్రశాంతమైన లోకం. ఆ లోకాన్ని ఒక్కసారి చూడు. ఎంతో నేర్పుతో, సరిహద్దు దాటని తీరుతో, ఓర్పుతో పయనిస్తున్నాడు. నిప్పును కూడా గుప్పిట పట్టుకుని దాస్తాడు. శనివారం మాత్రం సెగలు గక్కుతూ ప్రతి వారం జరిగిన అవినీతి కథలను కాల్చుతుంటాడు.
ఇందులో హీరో తెగువను గురించి చెబుతూ ‘గండర’, ‘గండడు’, ‘దుండగ’, ‘దండు’, ‘దండన’ వంటి సమత గల పదాలు లయాత్మకంగా వినిపించడంతో పాటకు మరింత ఊపు వచ్చింది. శ్రోతకు కూడా ఎంతో ఉత్తేజంగా వినిపిస్తుంది. అనిపిస్తుంది. ‘తిమిరానికే వదిలెను తిమ్మిరి’, ‘నలుపు కరిగేదాకా మెరుపై తరమడం’ లాంటి భావాలు పాటకు ప్రత్యేకతను తెచ్చాయి. హీరో నాని, హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ ల నటన ఈ సినిమాకే ప్రత్యేకతను తెచ్చాయి. హీరో శనివారం చూపించే తన తెగువను ప్రత్యేకాంశంగా తీసుకుని ఇంత గొప్ప పాటను రాసిన సేనాపతి భరద్వాజ పాత్రుడు ప్రశంసనీయుడు..
పాట
గండర గండర గండర/గండర గండర గండడు ఎవడు/దండిగ నిండిన దుండగ దండుకి/దండన వేసే వీడు/మాములుగ నాటు అయిన నీటు/ఎరగడు తడబాటు ఆ మాసు క్లాసుల మధ్యన ఊగుట/వీడికి అలవాటు/ముని మాదిరి మ్యూటు/ఆ స్లాట్‌ లో నో ఫైటు/శత్రువు తల స్లేటు/రాస్తాడటరా ఫేటు/కేర్ఫుల్‌ వాట్‌ యు థింక్‌/కేర్ఫుల్‌ వాట్‌ యు సే/గెట్‌ ఇట్‌ రాంగ్‌ అండ్‌ ఎవ్రిడే/కుడ్‌ బి సాటర్డే/గరం గరం యముడయో సహనాల శివుడయో/నరం నరం బిగువయో నియమాల తెగువయో/కణం కణం కరుకయో ఇది ఇంకో రకమయో/అయోమయం తగదయో సమయంతో మెలికయో/ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే కిక్కుని పక్కన నెడతాడే/రెస్ట్‌ అనే టెస్టులో బెస్టుగ వీడే/లిస్టులు రాయడమొదలడే/రాంగు రైటు గడబిడలో ఏది కరెక్టో తెలపడురో/లెఫ్ట్‌ ఓ రైట్‌ ఓ మరి స్ట్రెయిట్‌ ఓ ఎవ్వడినీ అడగడురో/కనుచూపే ఉరిమిందోరు తిమిరంకే వదిలెను తిమ్మిరి/నలుపంతా కరిగే వరకు మెరుపై మెరుపై తరిమిందోరు/పురాణే జమానే మే నరకాసుర/నమక్‌ ఏక్‌ రాక్షస్‌ రెహతా తా/వో లోగోన్‌ కో బహుత్‌ సథాతా తా/ఇస్లియే శ్రీకష్ణ నే/సత్యభామ కే సాత్‌ మిల్కర్‌ ఉసే..మార్‌ డాలా/కమ్మగా సరికొత్తగా సష్టించిన లోకం చూడరా/బుద్ధిగా బహుశ్రద్ధగా సరిహద్దే దాటని తీరురా/ఓర్పుతో నేర్పుతో నిప్పుని/గుప్పిట కప్పడా శనివారమై సెగ కక్కుతూ/ప్రతి వారపు కథలని కాల్చడా..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత,
6309873682