నెత్తిమీద ఎత్తుకొని ఊరేగిస్తం

Take the scalp and carry it in processionనది ఒడ్డున కూర్చున్న పంచాక్షరి మదిలో ఒడ్డుకు తాకుతున్న అలలలాగే తన ప్రేమ జ్ఞాపకాలు తగులుతూ ఉన్నరు. ఆమె తన ప్రియుడు ప్రశాంత్‌ను శిఖరంలాగా కొలుస్తున్నది. ప్రపంచమంతా తానే నిండి ఉన్నాడు అనేంతలా అతడి ధ్యాసలో మునిగిపోయింది. చూడటానికి చామనచాయ కాని కళ మొఖం. వంక పెట్టడానికి ఏ ఒక్క సాకూ దొరకదు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ప్రేమలో పడ్డంత మాత్రాన చదువును పక్కన పెట్టలేదు. హద్దులూ దాటలేదు. ప్రేమంటే ప్రేమే. ఆమె ఊహల్లో ఉండగానే ”గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే” తన అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ పాట పాడుతూ వచ్చిండు ప్రశాంత్‌.
పంచాక్షరి వెనకకు తిరిగి చూసి ”అబ్బో సారు భలే హుషారుగున్నడే” మనసులో అనుకోని
”నా దగ్గరకొస్తే అలా ఉంటుందా నీకు” అడిగింది లేస్తూ.
”ఎలా?” అన్నడు ప్రశాంత్‌.
”అదే గాల్లో తేలినట్టు గుండె పేలినట్టు”.
”నాకే కాదు ఈ ప్రపంచంలో తన పిల్ల పక్కనుంటే ఎవరికైనా అలానే ఉంటుంది” అంటూ జేబులో ఉన్న చాక్లెట్‌ తీసిచ్చిండు.
”నీ మాటలే చాక్లెట్‌లా ఉంటరు. మళ్ళీ ఇదెందుకో?”
”నా మాటల్ని తినలేవు కాబట్టి”
”అవునా. రా! అలా నడుస్తూ మాట్లాడుదాం” అంటూ ప్రశాంత్‌ చేయి పట్టుకుని తను నడుస్తుంటే అతను ఆమె పట్టుకున్న చేయినే చూస్తూ అడుగులేసిండు. అలా కొంత దూరం నడిచాక ప్రశాంత్‌ పంచాక్షరిని చూస్తూ ఆగిపోయిండు. ఆమె తిరిగి చూస్తే కన్నార్పకుండా అలానే చూస్తూ ఉండిపోయిండు.
”ఏంటి ఇలా చూస్తుండు. ఎప్పుడు చూడనట్టు” మనసులో అనుకోని.
”హలో సార్‌. ఏంటి కొత్తగా చూస్తున్నవ్‌? నచ్చానా లేదా?” అంటూ చిన్నగా నవ్వింది.
”బంగారు బొమ్మలా ఉన్నవ్‌. నువ్వు నచ్చక పోవడమేంటి. నాతో ఈ అడుగులేసినట్టే లైఫ్‌ లాంగ్‌ ఉండే ఏడడుగులు వేస్తావా?” అంటూ మళ్ళీ కన్నార్పకుండా చూసిండు ప్రశాంత్‌.
”నువ్వు ఊ.. అను. నా నాన్నలా చూస్కుంట”
”ఊ”
”అమ్మతో చెప్తా”
”ఏమని?”
”నాకు ప్రశాంతాన్నిచ్చే ప్రశాంత్‌ ని తోడుగా ఇమ్మని” అంటూ సిగ్గుపడింది పంచాక్షరి.
”అబ్బో నా బంగారానికి సిగ్గు కూడా వస్తుందా?”
”ఏం రావొద్దా?” నవ్వు మొఖంతో అన్నది.
”రావొచ్చు. సరే డ్యూటీకి టైం అవుతుంది. పోదాంపా” అని చెప్పేసరికి.
”ఓరు సూర్యుడా! మేం కలిసినప్పుడు రయ్యిన ఉరకకుండా ఆగి మమ్మల్ని చూస్తూ ఉండొచ్చుగా. మేము కాసేపు ఎక్కువగా మాట్లాడుకుంటాం” నడుముకు చేతులు పెట్టుకొని ఆకాశంవైపు అంటుంటే ప్రశాంత్‌ ఆమెను చూసి నవ్వుకుని భుజంపై చేయివేసి నడిపించిండు.
భుజంపై వేసిన చేయిని పట్టుకుని సంతోషంగా అడుగులేసింది.
లిలిలి
కాలం రెండేండ్లు కాళ్ళకు గిర్కలు కట్టుకొని ఉరికినట్లు ఉరికింది.
పంచాక్షరి డిగ్రీ పూర్తిచేసి టీచర్‌ ట్రైనింగ్‌ కోర్స్‌ చేస్తోంది. పది వరకే చదివిన ప్రశాంత్‌ అదే సూపర్‌ వైజర్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అప్పుడప్పుడు ఇంట్లో పంచాక్షరి పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఓ రోజు ప్రశాంత్‌తో దిగిన ఫోటోని వాళ్ళమ్మకు చూపించింది. మొదట కొట్టినట్టు అరిసినా అతను చూపే ప్రేమను పంచాక్షరి కళ్ళకు కట్టినట్టు ధైర్యంగా చెప్పింది. అయినా వాళ్ళమ్మ నా బిడ్డ బతుకు ఎట్లైతదోనని భయపడింది. కారణం బిడ్డ ప్రేమించింది వాళ్ళ కులం వ్యక్తిని కాదు. పంచాక్షరిది మాదిగ కులం ప్రశాంత్‌ ముదిరాజ్‌ కులం. ప్రేమ ఎంత గొప్పదైనా పెళ్ళికి మాత్రం కులం కంచె వేయకుండా ఉండదు. ఇక్కడా అదే జరగబోయింది. కానీ పంచాక్షరి ప్రశాంత్‌ కుల కంచెను ఒప్పుకుంటేగా. ఇరువురు తమ ప్రేమను పెద్దలముందు పెట్టిండ్రు. మాటల యుద్ధాల తర్వాత పెళ్ళికి అంగీకారం దొరికింది. రెండు మనసులు, రెండు కుటుంబాలు కలిసినరు. కాని పెళ్ళికి మాత్రం ప్రశాంత్‌ పాలోళ్ళ పంచాది అడ్డువడ్డది.
ప్రశాంత్‌ పాలోళ్ళే గత ముప్పై ఏండ్ల సంది ఊర్ల సర్పంచ్‌గా ఉంటూ పెద్దరికం చేస్తున్నది. ఊరు మొత్తంల అరవై శాతం ముదిరాజ్‌ కులపోళ్ళే. అందులో మళ్ళీ మూడు వర్గాలు. ప్రశాంత్‌ ఉండే వర్గపోళ్ళు అతని ప్రేమ పెళ్ళి సంగతి తెల్సి ”మాదిగోళ్ళ పిల్లని జేస్కొని మా ఇజ్జత్‌ గడ్డిల కల్పుదమనుకున్నవారా. ఈ పెండ్లికి మేం ఒప్పుకోం” అన్నరు.
ఆ మాట వినేటాలకు ప్రశాంత్‌ ఆలోచనల పడ్డడు. కాని పంచాక్షరిని మర్సి ఉండలేడు. పెండ్లికి దినం దగ్గరవడుతోంది. ఎట్లైతదోనని లోపల ఒకటే టెన్షన్‌.
ఆఖరికి ప్రశాంత్‌ బాధ చూడలేక వాళ్ళ నాయిన చిన్నాయినలు పంచాక్షరి వాళ్ళూరికి పోయి మాట్లాడి ముహూర్తం పెట్టుకొని వచ్చిండ్రు.
ముప్పై ఏండ్లుగా ఊర్లో రాజకీయం చేస్తున్న ప్రశాంత్‌ పాలోళ్ళ వీరయ్య ఇంటి నుంచి ఒక్కరు కూడా పెళ్ళికి రాలేరు. మాదిగోళ్ళ పిల్లని చేస్కుంటుండని. ఆ కుటుంబంతోపాటు వాళ్ళకు అనుచరులుగా ఉండే మరో రెండు కుటుంబాలు పెళ్లిని బహిష్కరించిండ్రు. కాని మిగతా అందరూ వచ్చిండ్రు. పెళ్లి ఘనంగా జరిగింది. కులాలు కలవకున్నా మనసులు కలిసినరు. ఇద్దరి జంట సరిపోయిందని పెళ్ళికి వచ్చినోళ్ళు దీవించిండ్రు.
లిలిలి
ఊర్ల సర్పంచ్‌ ఎలక్షన్ల లొల్లి షురూవైంది. ఈసారి కూడా రిజర్వేషన్‌ బీసిలకే వచ్చింది. అందులో ఎప్పుడూ రెండు వర్గాలకే పోటి. ఒకటి వీరయ్య వర్గం. రెండోది వెంకటయ్య వర్గం. ఇద్దరూ ఒకే కులం. తుమ్మెదపేట గ్రామ పంచాయతి ఏర్పడినప్పటి నుంచి వీరయ్య కుటుంబమే సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నది. ఈసారి కూడా మాదే విజయం అనే దీమాతోటి ఉన్నడు వీరయ్య. ఈసారైనా గెలవకపోతానా అన్నట్లు ఆలోచన జేస్తున్నడు వెంకటయ్య.
ఎవరికి తోచినట్లు వారు సన్నాహాలు చేస్తున్నరు. ఈ ఇద్దరు కాకుండా కొత్తవాళ్ళు సర్పంచిగా గెలిస్తే బాగుండు అనుకునేవాళ్ళు కూడా లేకపోలేరు. ఎందుకంటే వాళ్ళతో వేగివేగి తుమ్మెదపేట జనాలకు మస్తైంది. వెంకటయ్య చేతిలో అధికారం లేకున్నా కొంతవరకు బాగానే ఏంపుక తిన్నడు.
ఊర్లో బతుకుదెరువు లేక పట్నంలో కారు నడుపుకొని పొట్టనింపుకునే రాజేష్‌ ఈ మధ్యనే ఊరికొచ్చి ఉంటున్నడు. పదివరకు చదివిండు. అందరితో కలివిడిగా ఉంటడు. తనది కూడా ముదిరాజ్‌ కులమే అయినా వీరయ్య, వెంకటయ్యల లెక్క కులపిచ్చి చూపియ్యడు. అందరితో సమానంగా ఉంటడు. అందులో యువకుడు. ఊర్ల ఎవరికి ఏ ఆపతున్నా తెలిస్తే ముందొచ్చి ఉంటడు. అందర్ని అన్నా, తమ్మీ, బావా, మావా వరుసపెట్టి పిలుస్తడు. వీరయ్య, వెంకటయ్యలు మాత్రం వాళ్ళ నోటికొచ్చిందే వరుస.
సాయంత్రం ఏడుగంటలకి కొంతమంది యువకులు రాజేష్‌ ఇంటికొచ్చిండ్రు. కాని రాజేష్‌ పనికిపోయి ఇంకా రాలేడు. ఎనిమిది వరకు ఎదురు చూసిండ్రు. రాజేష్‌ వచ్చిండు. ఎన్నడులేనిది తన ఇంటిముందు మంది ఉన్నది చూసి ”ఏమైంది?” అన్నట్లు బండిదిగి వచ్చిండు.
అక్కడున్న యువకులలోంచి ఒకతను ”వెల్కం తుమ్మెదపేట సర్పంచ్‌ సాబ్‌” అన్నడు.
ఆ మాట వినగానే కొంత ఆశ్చర్యపోతూ ”నేనెందుకైత తమ్మి సర్పంచ్‌” అన్నడు రాజేష్‌.
”లేదన్నా! ఈ తాప నువ్వే సర్పంచ్‌” అని మరో యువకుడన్నడు.
రాజేష్‌ ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఖర్చుపెట్టంది ఎలక్షన్స్‌ కావు. జనాలు ఓట్లు ఎయ్యరు. అందరూ కూర్చొని గంటకు పైగానే మీటింగ్‌ పెట్టుకున్నరు.
తుమ్మెదపేటలో ముదిరాజుల ఓట్ల తర్వాత మాదిగ కులానివే ఎక్కువ ఓట్లు. వాళ్ళంతా వీరయ్యకు నమ్మినబంట్లు. బీసిలవి, మైనార్టీలవి అక్కడిక్కడ చీలిపోయినా మాదిగోళ్ళ ఓట్లు ఎవరికిపడితే వాళ్ళే సర్పంచ్‌. వీరయ్య అదే దీమాతోటి ఉన్నడు. వెంకటయ్య ఒక్కసారి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నడు.
నామినేషన్లు ఏసిండ్రు. ప్రచారం షురూవైంది. ఇన్నేండ్లు ఇద్దరూ వ్యక్తులు పోటీలో ఉంటె ఈ తాప ముగ్గురైండ్రు. ప్రచారం మరింత జోరుగైంది. పైసలు పంచేటోళ్ళు పైసలు పంచిండ్రు. మందు పంచేటోళ్ళు మందు పంచిండ్రు. ఆ రెండూ లేని రాజేష్‌ ఆలోచన పంచిండు. వీరయ్య తన వర్గపు ఓట్లు మాదిగ్గేరి ఓట్లు చూస్కొని మురిసిపోతున్నడు మళ్ళా నేనే గెలుస్తానని. ఊర్ల కూడా కొంత అదే ప్రచారముంది. మాదిగోళ్ళు ఎవరివైపుంటే వాళ్ళదే విజయం అనేటోళ్ళు లేకపోలేరు.
నాదంటే నాదే గెలుపు అనే ఊపులో వీరయ్య, వెంకటయ్యలు ఉన్నరు. రాజేష్‌ తన పని తను చేసుకుంటూ పోతున్నడు. ఊర్లున్న జనాభాలో ముప్పై శాతమున్న మాదిగోళ్ళంతా వీరయ్య వెంటే ఉన్నరు. వెంకటయ్య మస్తు కాకవట్ట చూసినా ఆయనవైపు ఒక్కరూ కూడా చూసేటట్లు లేరు.
వీరయ్య మీసాలు మెలేస్తున్నడు. పంచేది పంచేస్తున్నడు. నాకేం తక్కువ అన్నట్లు వెంకటయ్య కూడా పంచేస్తున్నడు. రాజేష్‌కు పంచడానికి ఏమీలేవు. ఇప్పుడేమో పంచుతేకాని ఓట్లేసే పరిస్థితిలా లేదు.
రేపే ఓట్ల పండుగ. ఎంతమంది పోలీసులు గస్తీ కాసినా పంచుడు ఆగుతలేదు. జనాలు మత్తుగా తూలుతున్నరు.
అందరూ వీరయ్య, వెంకటయ్యల వెంటనే ఉన్నరు. కొంతమంది యువకులు మాత్రమే రాజేష్‌ వెంట ఉన్నరు. దిగులుగా కూర్చున్నడు. జనాలను చూస్తే మొదటిసారి నామినేషన్‌ వేసి తప్పు చేశానా అనిపించింది రాజేష్‌కు. తన ముందున్న యువకులు సప్పుడు చేయకుండ నిలబడ్డరు. టైం తొమ్మిదిన్నరయ్యింది. రాజేష్‌ అందరి మొఖాలు చూసిండు. అందరు ఏమన్న చెప్తాడా అన్నట్లు చూసిండ్రు.
”పోయి తిని పడుకోండ్రి. పొద్దున కలుద్దాం” అన్నడు. అందరూ ఆశ్చర్యపోయిండ్రు.
”నేను చెప్పింది నిజమే. అందరు పోయి తిని పడుకోండ్రి. పొద్దున ఓట్లేసేదుంటది” అని మళ్ళా చెప్పిండు రాజేష్‌. అందరూ ఏమైంది ఈ మనిషికి అన్నట్లు చూసిండ్రు.
”మీరు పోయేటట్లులేరు. నేనే పోతా” అని అక్కడి నుండి కదిలిండు రాజేష్‌.
”ఏందిరా! రాజేషన్న ఇట్ల పోతుండు” అక్కడే ఉన్న శరత్‌ అన్నడు.
”ఈ జనాలకు మంచి చేసేటోని కన్నా మందు పోసేటోడే కావాలె. ఆయనతోన పైసల్లేవు. అయినా మనమనుకున్న సిద్ధాంతం అది కాదు. ఇప్పుడు జనాలు ఎంటలేరు. మనమేమో అన్న గెలిస్తే బాగుంటుందని ఒప్పించి నామినేషన్‌ వేయించినం. రేపు ఓట్లు పడక ఓడిపోతే ఆ చదువురాని వాళ్ళముందు నవ్వులపాలు కాడా? అన్న కూడా అదే ఆలోచిస్తున్నట్టున్నడు” అని శేఖరన్నడు.
”సరేలే! ఎట్లయ్యేదుంటే అట్లే అయితది. పోదం పాండ్రి” అని అందరూ అక్కడి నుండి ఇండ్లల్లకు పోయిండ్రు.
రాజేష్‌ పొద్దున నాలుగింటికే లేచి శరత్‌, శేఖర్‌లకు ఫోన్‌ చేసి లేపి భూత్‌ ఏజెంట్లుగా ఉండాలని చెప్పిండు. తను కూడా స్నానం చేసి తయారైండు.
ఆరు గంటల వరకు అందరూ పోలింగ్‌ భూత్‌ ఉన్న స్కూల్‌ దగ్గరకు పోయిండ్రు. లోపలంతా సెట్‌ అయ్యింది. శరత్‌, శేఖర్లను ఏజెంట్లుగా పెట్టి బయటకోచ్చిండు రాజేష్‌. వీళ్ళతోపాటు వీరయ్య, వెంకటయ్య తరపున కూడా ఏజెంట్లు ఉన్నరు.
వీరయ్య, వెంకటయ్య మనుషులు ఓటర్ల కోసం ఊరంతా జల్లెడ పడుతున్నరు. రాజేష్‌ ఓ ఇద్దరు యువకులను వెంటబెట్టుకొని ఊర్లోకి పోతుంటే ఒక పెద్దమనిషి ఎదురొచ్చిండు. రాజేష్‌ దగ్గరకుపోయి ”నమస్తే తాతా. నీ ఓటు నాకే ఎయ్యాల్నే” అన్నడు.
పెద్దమనిషి రాజేష్‌ను కిందికిమీదికి చూసి ”ఒక్కటంటే ఒక్క కోటరియ్యలే. ఓ నోటియ్యలే. నీకు ఓటేయ్యాల్నారా?” అన్నడు.
ఆ మాట వినేటాలకు రాజేష్‌కు తల తీసేసినట్లు అయ్యింది. మొఖమంతా చిన్నగయ్యింది. తనతో పాటున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే.
సప్పుడు చెయ్యకుండ ఇంటికి పోయిండు రాజేష్‌. భార్య ఏమైంది అన్నట్లు చూసింది. పట్టించుకోకుండా దుప్పటి కప్పుకొని పడుకున్నడు.
ఆ విషయం వీరయ్య, వెంకటయ్యలకు తెలిసి నవ్వుకున్నరు. నామినేషన్‌ మాత్రమే ముగ్గురేసిండ్రు. పోటి మళ్ళా ఇద్దరి మధ్యనే అనుకున్నరు. ఓట్లేయడానికి వచ్చినోళ్ళను కాకావట్టి లోపలికి పంపుతున్నరు. రాజేష్‌కు వేయమని చెప్పేటోళ్ళు ఒక్కరు కూడా లేరు.
మధ్యాహ్నం కావొస్తుంది. వీరయ్య వర్గం సంబరాలు షురూ చేసింది. వాళ్ళను చూసి వెంకటయ్య వర్గం కూడా షురూ చేసింది.
ఓటింగ్‌ అయిపోయి లెక్కింపు మొదలైంది. వీరయ్య, వెంకటయ్యలూ, వాళ్ళ ఏజెంట్లు లెక్కింపులో పాల్గొన్నరు.
రాజేష్‌ ఇంటి నుంచి రాలేడు. అతని తరపున ఏజెంట్లే పాల్గొన్నరు.
వీరయ్య మొఖం వెలిగిపోతోంది. వెంకటయ్య మొఖం ఆశగా చూస్తోంది. శరత్‌, శేఖర్‌లు ఏమీ తెల్వనట్టు చూస్తూ ఉన్నరు.
లెక్కింపు పూర్తి కావొస్తుంది. అందరి మొఖాలు అయోమయంగా ఉన్నరు.
శేఖర్‌ దమ్మురాంగ రాజేష్‌ ఇంటికి ఉరికొచ్చిండు. ఇంటి ముందు నిలవడి ఆయాస పడుతుంటే ఇంట్లోంచి రాజేష్‌ భార్య వచ్చి ”ఏమైంది శేఖర్‌. అంత ఆయాస పడుతున్నవ్‌” అనడిగింది.
శేఖర్‌ ఆయాస పడుతూనే నవ్వుతూ ”రాజేష్‌ అన్ననే సర్పంచిగా గెలిచిండు వదిన. అన్నను బయటకు రమ్మను” అని అక్కడే నిలవడిండు.
ఆమె ఇంట్లకు పోయి ”మామా లేవు శేఖరొచ్చిండు. నువ్వే గెలిచినవంట” చెప్పేసరికి కప్పుకున్న దుప్పటి తెరిచిండు. రెండు కండ్లనిండా నీళ్ళు వచ్చినరు. లేచి భార్యను గట్టిగా పట్టుకున్నడు. భార్య కంట్లో కూడా నీళ్ళు జారినరు. అదే కన్నీళ్ళతో బయటకొచ్చిండు. శేఖర్‌ను చూడగానే హత్తుకున్నడు.
”కంగ్రాట్స్‌ అన్న. నువ్వే మా సర్పంచ్‌ సాబ్‌ ” అన్నడు శేఖర్‌.
ఇద్దరు పోలింగ్‌ భూత్‌ కు ఉరికిండ్రు. రాజేష్‌ వచ్చింది చూసి అందరూ సప్పట్లు కొట్టిండ్రు. అందరికి దండం పెడుతూ లోపలికి పోయిండు.
మొదటి యాబై ఓట్ల వరకే వీరయ్య లీడింగులో ఉన్నడు. తర్వాత అంతా రాజేష్‌ కే పడ్డరు.
ఎప్పుడూ వీరయ్య వెంట ఉండే మాదిగ మన్యం పొద్దుగాలనే టౌన్‌కు పోయి పూలదండ తెచ్చి చేతిలనే పట్టుకొని పోలింగ్‌ భూత్‌ దగ్గర బయట రోడ్డుమీద నిలవడిండు.
కొందరు భూత్‌లకెల్లి బయటకొస్తున్నరు. అందులో వీరయ్య ముందు నడుస్తున్నడు.
తుమ్మెదపేటలో ముప్పై ఏండ్ల రాజకీయ చరిత్రున్న కుటుంబం మొదటిసారి ఓడిపోయింది. అది వీరయ్య మొఖంలో స్పష్టంగా కనబడుతోంది. మాదిగ మన్యం చేతిలో ఉన్న పూలదండను చూసి దగ్గరకు పోయి
”ఇంక ఆ దండతోన పనేముందిరా! అక్కడ పారేరు” అన్నడు వీరయ్య.
మన్యం చిన్నగా నవ్వి ”తెచ్చింది నీ కోసం కాదు మామా. మీ తమ్ముడు రాజు కోసం” అన్నడు.
ఆ మాట వినగానే వీరయ్యకు కోపం వచ్చింది. మన్యం గల్ల పట్టుకున్నడు.
”ఇన్నేండ్లు నా ఎంట తిరిగి నేను వెట్టింది తిని నాకే వెన్నుపోటు పొడుస్తవారా? తూ… నీ బతుకు” అన్నడు వీరయ్య గట్టిగా కోపంగా.
ఆ మాట విని అందరూ వాళ్ళ దగ్గరకు ఉరికొచ్చిండ్రు. మన్యం గల్ల పట్టుకున్న వీరయ్యను పక్కకు గుంజిండ్రు.
”ఇన్నేండ్లు నీవేందో తెల్వక నీ ఎంట తిర్గినం. నీవేసింది తిన్నం. కాని ఇకముందు అవ్వి నడువవి. నీ కులం పోరడు మా కులం పిల్లను పెండ్లి చేస్కుంటేనే మాదిగి దాన్ని చేస్కుంటుండని, కులం తక్కువదని ఆ పెండ్లికే దూరంగున్న మీకు మాదిగోళ్ళ ఓట్లేందుకు?. మాకూ మనసుంటది. మాకూ ఆత్మగౌరవం ఉంటది. ఆ రెండింటికి దెబ్బ తగిలితే ఫలితం ఇట్లుంటది. మాదిగోళ్ళపిల్ల అంటరానిదైతే మాదిగోళ్ళ ఓట్లు కూడా అంటరానివే. మమ్మల్ని హత్తుకునేటోళ్ళని మేము ఎత్తుకుంటం. ఆడా ఈడా కాదు నెత్తిమీద ఎత్తుకొని ఊరేగిస్తం” ఆగకుండా కడుపులున్న ఎతనంతా బయటవెట్టేటాలకు లోపలున్న రాజేష్‌ జనాలు గుమ్మిగూడింది చూసి అక్కడికి వచ్చిండు. రాజేష్‌ను చూసిన మన్యం వీరయ్యను పక్కకు జరిపి చేతిలున్న దండ రాజేష్‌ మెడలేసిండు. రాజేష్‌ రెండు చేతులెత్తి దండం బెట్టిండు. అందరూ చూస్తున్నంగనే మన్యం రాజేష్‌ ను భుజాలపై ఎత్తుకొని ఊరంతా తిరిగిండు.
కె.పి. లక్ష్మీనరసింహ
9010645470