సానుకూల మార్గాలు చూపండి..

Show positive ways..తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాధ్యతలు అత్యంత సున్నితమైనవి. పిల్లల వ్యక్తిత్వం, వారిలో అభిరుచులు, జీవిత గమ్యం ఇవన్నీ తల్లిదండ్రుల ఆచరణ, ఆలోచనల ప్రభావంతో తయారవుతాయి. వారి పెంపక విధానం పిల్లల భవిష్యత్తుకు ఆధారం గా ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రుల క్రమశిక్షణ, ప్రేమ, ప్రోత్సాహం, స్వేచ్ఛ కలయికలో సరిసమానత అనుసరించడం కీలకం.
పాజిటివిటీని పెంచడం
పిల్లలు చిన్న వయసులోనే పాజిటివ్‌ లేదా నెగటివ్‌ ఆలోచనలకు ప్రబలంగా ఆకర్షితులవుతారు. ఎలాంటి విఫలం ఎదురైనా, అది వారి శక్తికి మించి అని భావించే బదులు, ప్రయత్నం కోసం నేర్పుగా అవగాహన కల్పించడం ముఖ్యమైంది. ఉదాహరణకు, పిల్లలతో వారిని ప్రోత్సహించే మాటలు మాట్లాడడం, చిన్న విజయాలకు ప్రశంసించడం వల్ల వారిలో తమ సామర్థ్యాలపై నమ్మకం పెరుగుతుంది. ఇది వారి భవిష్యత్‌ ఆత్మవిశ్వాసానికి దోహదపడుతుంది.
స్వేచ్ఛ, క్రమశిక్షణకు సమతుల్యత
పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం, వారి ఆలోచనల్ని ప్రోత్సహించడం వారు స్వతంత్రంగా అభివద్ధి చెందడానికి అవసరం. అయితే అది హద్దులను దాటితే, వారి తీరు క్రమశిక్షణ లోపించినదిగా మారే ప్రమాదం ఉంది. అదే విధంగా, అతి క్రమశిక్షణతో వారు తమ భావాల్ని వ్యక్తపరచకుండా, నిర్దిష్ట పరిధుల్లో బందీలా ఫీల్‌ కావచ్చు.
తల్లిదండ్రులు హద్దులు పెట్టినప్పటికీ, వాటిని ఎందుకు పెట్టామనే దానిపై పిల్లలకు స్పష్టత ఇవ్వాలి. ఉదాహరణకు, స్క్రీన్‌ టైమ్‌ పరిమితిని వివరిస్తూ, ఇది వారి ఆరోగ్యాన్ని , చదువు సమర్థతను మెరుగుపరుస్తుందని చెప్పడం ద్వారా వారు ఆ పరిమితిని అర్థం చేసుకోవచ్చు.
పరోపకార గుణాన్ని అలవాటు చేయడం
పరోపకార గుణం వ్యక్తిత్వ వికాసానికి మూలస్థంభం. పిల్లలు ఇతరులకు సహాయం చేయడంలో సంతోషాన్ని పొందేందుకు అలవాటు చేయడం ద్వారా వారు సమాజం పట్ల బాధ్యతగల పౌరులుగా మారతారు. శ్రద్ధగా చేయవలసిన పని, వారి వయసుకు తగిన సహాయ కార్యక్రమాలకు వాళ్లను ప్రోత్సహించడం. ఉదాహరణకు, ఆహారం పంచడం, పాఠశాలలో సహపాఠులకు సహాయం చేయడం వంటి చిన్నచిన్న చర్యలు వారిలో ఈ గుణాన్ని పెంపొందిస్తాయి.
కోపాన్ని నియంత్రించడం
పిల్లలతో తల్లిదండ్రులు చూపే ప్రవర్తన వారిపై తీవ్రమైన భావోద్వేగాలు చూపెడుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అతి కోపంగా వారిపై ప్రవర్తిస్తే, పిల్లలు భయానికి లోనవుతారు లేదా ప్రతిఘటించే స్వభావాన్ని అలవరుచుకుంటారు. పిల్లల తప్పిదాలను క్రమపద్ధతిలో సర్దిచెప్పి వారికి సానుకూల మార్గాలను చూపడం మంచిదైన పద్ధతి. వారితో సరళంగా మాట్లాడడం, ఎలాంటి పరిణామాలు వస్తాయో వారికి వివరించడం ద్వారా వారిలో బాధ్యతాభావం పెరుగుతుంది.
”ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా పిల్లల భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, వారు సానుకూల ఆలోచనలతో, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగగలుగుతారు.”
పిల్లల అవసరాలు
స్వీకార భావం: పిల్లలు తమకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రేమిస్తున్నారు అనే భావం కలిగి ఉండాలి.
ప్రేరణ: వారి లోపాలను, అంగవైకల్యాలను ప్రోత్సాహంతో అధిగమించగలమని నమ్మకం ఇవ్వాలి.
స్వేచ్ఛతో స్వీయశక్తి: స్వతంత్రంగా తమకు ఆసక్తి ఉన్న విషయాల్లో ముందుకు వెళ్లే అవకాశం ఇవ్వడం, తల్లిదండ్రుల తగిన మార్గదర్శకతతో కలగలిపి ఉండాలి.
నమ్మకాన్ని పెంపొందించండి: వారి మంచి పనులపై ప్రశంస చూపండి.
వారితో గడిపే సమయం : కేవలం వంచనలుగా కాకుండా వారితో ఆత్మీయంగా జత కావడం ద్వారా వారి సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు.
స్పష్టమైన హద్దులు : పిల్లలలో వ్యక్తిత్వ వికాసానికి అనువైన స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా, వారి శ్రేయస్సుకు సంబంధించిన హద్దులను వివరిస్తూ నిర్ణయాలు తీసుకోండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌