శేషాచలం కొండల్లో.. తుంబురు తీర్థంలో..

Show positive ways..జనవరి 24 -26 తేదీల్లో YHA నిర్వహించిన తుంబురు తీర్థం ట్రెకింగ్‌లో పాల్గొనడానికి నాలుగు నెలలకు ముందే విహంగ నుండి కొంతమంది సిద్ధమయ్యాం. కానీ, వివిధ కారణాల వల్ల అందరూ విరమించుకున్నారు.
నా వయసుకి, ఆరోగ్య స్థితికి నేను ఈ ట్రెక్‌ చేయగలనా అని సందేహించినప్పటికీ ట్రెక్కింగ్‌ చేయాలనే ఉత్సాహం నా అడుగులు శేషాచలం కొండల వైపే నడిపింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 24వ తేదీ ఉదయం 9 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలవ్వాలి. నేను రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ఉదయం 5.30కి దిగి స్టేషన్‌లోనే ఉన్న ప్రీపెయిడ్‌ వెయిటింగ్‌ రూమ్‌లోకి చేరే సరికి మైసూర్‌ నుండి వచ్చిన ట్రక్కర్స్‌ పరిచయం అయ్యారు. ఏడున్నర తర్వాత వెళ్లి బ్రేక్‌ ఫాస్ట్‌ ముగించుకుని రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్ళాను. అప్పటికే ఈ ట్రిప్‌ ఫీల్డ్‌ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ గారు, సూర్య గారు మా రిజిస్ట్రేషన్‌ పనిలో ఉన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల నుండి వచ్చిన ట్రెక్కర్లు ఎప్పుడెప్పుడు అడవిలో ప్రవేశించాలా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. 58 మంది ట్రెక్కర్లు, నలుగురు నిర్వాహకులు, నాలుగు మినీ బస్సుల్లో బయలుదేరాం. రేణిగుంట నుండి కుక్కల దొడ్డి బేస్‌ కాంప్‌కి 19 కిమీ దూరం, తూర్పు కనుమల్లోని శేషాచలం కొండల పాదాల అంచున ఉన్న చిన్న గ్రామం. మామండూరు కుక్కల దొడ్డి దాటగానే శ్రీ వెంకటేశ్వర నేషనల్‌ పార్క్‌ బోర్డు దర్శనమిచ్చింది. అది దాటి కొద్దిగా ముందుకు వెళ్ళాక వచ్చిన ఒక కల్వర్టు దగ్గర మా వాహనాలు ఆగిపోయాయి. అక్కడి నుండి మా ట్రెకింగ్‌ ప్రారంభం. అక్కడ మాకు గైడ్‌ చేసే స్థానిక ఆదివాసీలు సిద్ధంగా ఉన్నారు. నాలుగడుగులు వేశామోలేదో వాగు వచ్చింది. లగేజితో పాటు కాళ్లకున్న షూ కూడా చేతపట్టుకుని వాగులో కాలు పెట్టా. నీళ్లు చల్లగా జిల్లుమంటూ..
మా అందరికంటే ముందు మా గైడ్‌ వెంకటస్వామి కత్తి చేతపట్టుకుని నడుస్తుంటే ఆ వెనుక మా ఆర్గనైజర్‌ శ్రావణ్‌. అలా అందరి కంటే చివర ఆర్గనైజర్‌ సూర్య, గైడ్‌ రాజు ఉంటే మధ్యలో ప్రసాద్‌ ఉండి మమ్మల్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించారు. అడవి బాటలో కొంత దూరం వెళ్ళాక రెండు బాటలు కనిపించాయి. ఎడమవైపు ఉన్న సన్నని కాలి బాట దగ్గర పసుపు కుంకుమలు వేసి ఉన్నాయి. అది అన్నమయ్య తిరుమలకు నడిచిన బాట. అక్కడ మమ్మల్నందరినీ ఆపి అందరూ ఉన్నామో లేదో లెక్క చూసుకుని రెండో బాటలో నడిపించారు. పుష్ప సినిమా మేము నడుస్తున్న ఆ ప్రదేశంలోనే తీశారట.
ఈ జీవవైవిధ్య వాటిక చిరుతపులులు, ఏనుగులు, హైనా, ఎలుగుబంటి, అడవిపందులు, అడవిదున్నలు, సాంబార్‌, జింకలు, దుప్పిలు, నక్కలు, తోడేళ్ళు, రేచుకుక్కలు, అడవిపిల్లులు వంటి 178 రకాల పక్షులు జంతువులకు నివాసం. 1500 రకాలకు పైనే రకరకాల మొక్కలూ ఉన్నాయి. వాటి నివాసంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అడవిని గౌరవించడం మన బాధ్యత. బిగ్గరగా అరవడం, మాట్లాడటం, నవ్వడం వంటివి చేయకుండా మౌనంగా ఉండమని ముందే నిర్వాహకులు మా అందరికీ చెప్పారు. ఒకసారి దారి తప్పితే చాలా కష్టం అని మరీమరీ హెచ్చరించారు.
మేము బండి ఇరుసు చేరేవరకు కొండల్ని, కోనల్ని కలుపుతూ ఒకే వాగు అనేక వంపులు తిరుగుతూ వయ్యారాలు పోతూ మా కాళ్లకు చుట్టుకుంటూనే ఉంది. కొన్నిచోట్ల జల జాలు ఆవిరైపోయిన గుండు రాళ్ల వంకలు మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వాయి. చిన్న పెద్ద గులకరాళ్ళ ఏరులో కాలు పెట్టగానే చల్లగా తగిలి కాళ్ల అలసట తీర్చి హాయిగా ఉన్నప్పటికీ అడుగు తీసి అడుగు వేయడం మాత్రం అంత సులువుగా లేదు. నీటి అడుగున ఉన్న బండరాళ్ళు పాదం పడగానే కదిలిపోతూ.. నాచు పట్టిన బండలు మమ్మల్ని జారుస్తూ.. ఆటపట్టిస్తూ.. మేం మాత్రం తక్కువా ఏం? తగ్గేదేలే.. అంటూ మూడో కాలు అరువు తెచ్చుకుని మరింత భద్రంగా ఏటిని దాటుతూ ముందుకు సాగాం.
అడవితల్లి ఒడిలో చేరిన మేం బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి కొత్తలోకంలో విహరించడం మొదలెట్టాం. మధ్యాహ్నం ఒకటిన్నరకు బండి ఇరుసు చేరుకున్నాం. ఆ రోజు మా మకాం బండి ఇరుసు లోనే. బండి ఇరుసు అంటే అది ఒక ఊరు అనుకునేరు. కానే కాదు. ఒకప్పుడు స్థానిక గిరిజనులు మామండూరు, కుక్కల దొడ్డి తదితర ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశానికి వచ్చేసరికి చిన్నాపెద్ద గులకరాళ్ళ ప్రవాహ ఉధతిలో ఒరవడిలో బండి ఇరుసులు పాడయిపోయేవట. అందుకే ఆ ప్రదేశాన్ని బండి ఇరుసు అంటారట. మా కంటే రెండు గంటల ముందు ఆ ప్రదేశానికి చేరిన YHA నిర్వాహకుడు బాలు, వాలంటీర్లు మా కోసం అంగళ్లలో, రోడ్డుపక్కల వేసుకునే గుడారాల్లాగా 5 గుడారాలు వేయించారు. వంట చేయిస్తున్నారు. చెత్త ఎట్లాబడితే అట్లా వేయకుండా నాలుగు కర్రలు పాతి ప్లాస్టిక్‌ కవర్‌ తగిలించారు. ప్రకతికి పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని విధానాల పట్ల ఉన్న శ్రద్ధ నన్ను బాగా ఆకట్టుకుంది.
సగం మంది మహిళా ట్రెక్కర్స్‌ తమ భర్తతో వచ్చారు. మరి కొందరు స్నేహితులతో వచ్చారు. నాకు మాత్రం అందరూ కొత్త. అయినప్పటికీ కొత్తగా అనిపించలేదు. తెలిసిన వాళ్లు తెలియని వాళ్లు, ఆడామగా తేడా, చిన్న పెద్ద, ప్రాంతీయ భేదాలు, కుల మత భాషా భేదాలు లేకుండా అంతా మనవాళ్లే. అందరూ ఎంతో కలివిడిగా, స్నేహంగా ఉండడం, అవసరమైనప్పుడు సాయం చేయడం చూసినప్పుడు ఎన్నెన్నో అస్థిత్వాలుగా విడిపోయి కొట్టుకుంటున్న సమాజంలోని మనుషులేనా వీళ్ళు. సుతిమెత్తగా స్పందిస్తూ సహకరించుకుంటూ.. కోల్పోతున్న మనిషితనం నిలబెడుతున్నట్లుగా తోచి ట్రెక్కింగ్‌ అంటే మరింత అభిమానం పెరిగింది.
వడ్డించిన వేడివేడి కిచిడి,పెరుగన్నం ఆవురావురంటూ తినేశాం. ఆ తర్వాత మా లగేజీ అక్కడే ఉంచి రెండున్నరలోపే చాకిరేవు బాన జలపాతానికి బయలుదేరాం. పెద్ద పెద్ద కొండరాళ్ళు ఎక్కిదిగుతూ, వాగులు వంకలు దాటుతూ కనిపించని జలపాతపు హౌరు గుండె నిండా నింపుకుంటూ గమ్యం చేరుకున్నాం. ఈత వచ్చినప్పటికీ అంత చల్లటి నీటిలో దిగితే జలుబు దగ్గు పెరుగుతాయని భయం కూడా నన్ను ఆపింది. కానీ ఈ మనసుంది చూశారూ.. ఊరుకోదుగా. రండి మేడం అని అవతలి ఒడ్డుకు చేరిన వాళ్ళు పిలుస్తుంటే నేనూ దిగేశా.
బాగా ఈత వచ్చిన వాళ్లు నీళ్ళలోకి దిగారు. బాగా లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా తాడు అడ్డు పెట్టారు. కానీ మాలో ఓ ఔత్సాహిక ట్రెక్కర్‌ నీటిలోకి దూకేశారు. నిర్వాహకులు ఇంకెప్పుడూ ఏ నీటి గుండాల్లో, జలపాతాల్లో అట్లా దూకొద్దని, అది చాలా ప్రమాదకరమని చెప్పడంతో ఇక ఎవరూ ఆ సాహసం చేయలేదు. నీటి ప్రవాహానికి ఎదురుగా ఈత కొడుతూ కొంతసేపు అక్కడ గడిపాము. శరీర అలసట మాయమై కొత్త శక్తి వచ్చింది. మహిళా ట్రెక్కర్లు బట్టలు మార్చుకోవడానికి అప్పటికప్పుడు ప్లాస్టిక్‌ షీట్‌తో ఒక చిన్న గది తయారు చేయడం చూస్తే ప్రతి అవసరాన్ని గుర్తించి తీర్చే YHA శ్రద్ధ చూస్తే ముచ్చటేసింది. తిరిగి మేం విడిదికి వచ్చేసరికి వేడి వేడి బజ్జిలు, టీ సిద్ధంగా ఉన్నాయి. రాత్రి భోజనం సమయం అయ్యేవరకు సహజ రమణీయ ప్రకతి చూసి అబ్బురపడుతూ, ఆస్వాదిస్తూ కొందరు, ముచ్చట్లతో మరి కొందరు ఎవరి లోకంలో వారు విహరిస్తూ.. సరికొత్త అనుభూతులు సొంతం చేసుకుంటూ..
నట్టనడుమ అడవిలో, కొండకోనల్లో ఆకాశ పందిరిలో అద్భుతమైన రాత్రి భోజనం అన్నం, పప్పు, టమాటా కూర, సాంబారు, రసం, పెరుగన్నం, పాపడ్‌, పాయసం చూసి మాకు ఆశ్చర్యం. ఆనందం. సుష్టుగా తిని వాగు నుంచి మా గుడారాల దగ్గరకు వచ్చేసరికి నెగడు మండుతోంది. ట్రెక్కర్లను దగ్గరకు రప్పించుకుంది. కాసేపు అంత్యాక్షరి ఆడి అలసిసొలసి ఉండడంతో గుడారంలోకి చేరాం. చుట్టుముట్టు కొండల నడుమ సెలయేటి గలగలలు వింటూ, చిక్కటి చీకటిలో మిలమిల మెరిసే చుక్కలు చూస్తూ.. ఒక టెంట్‌లో 15 మంది మహిళలం ఇరుక్కుని పడుకున్నాం. నాలా నిద్రపట్టని కొందరు నెగడు ముందు చేరి చలి కాచుకుంటున్నారు. రాత్రంతా అది మండుతూనే ఉంది. అది మాకు వెలుతురును, వెచ్చదనాన్ని అందివ్వడమే కాకుండా క్రూర మగాలు అటువైపు రాకుండా ఉండడం కోసం చేసిన ఏర్పాటు అది. సెలయేటికి ఒక వైపు స్త్రీలు, మరో వైపు పురుషులు కాలకత్యాలను వెళ్ళమని ముందురోజు రాత్రి చెప్పి ఉండడంతో సెలయేటి నీటిని కలుషితం చేయకుండా పనులు కానిచ్చేశాం. కొందరికి ఇబ్బంది అయినప్పటికీ అంతకు మించి మరో మార్గం లేదు.
వేడివేడి టీ, మరగకాచిన ఏటి నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉన్నాయి. సమయం గడుస్తున్నది కానీ ఆ ఉషోదయ వేళ భానుడి జాడలు లేవు. ఎప్పటికో నెమ్మదిగా బాలభానుడు ఒళ్ళు విరుచుకుని బద్దకంగా కొండల మీదుగా వచ్చేసరికి మేమంతా గోధుమ రవ్వ ఉప్మాతిని, మధ్యాహ్నం కోసం బిర్యానీ ప్యాక్‌ చేసుకుని, మేం తెచ్చుకున్న బాటిల్‌లో తాగునీళ్లు నింపుకుని ప్రయాణానికి సిద్దమైపోయాం. ముందు రోజు దాదాపు తొమ్మిది కిలోమీటర్లు కొండరాళ్ళు, వాగువంకల దాటుతూ దాదాపు 15కిలోల బరువుతో నడిచినప్పటికీ, రాత్రి నిద్ర లేనప్పటికీ ఏ మాత్రం నీరసం లేదు. ఒళ్ళు నొప్పులు లేవు. ప్రకతిలో ఉన్న గొప్పదనమో! లేక కొత్త లోకం చూస్తున్న ఉద్వేగ ఉత్సాహమో!
దాదాపు 9 సార్లు వాగులు దాటినా తర్వాత కరువు కోన ముసలోడి బండ దాటాం. మూడు వేల ఏండ్లనాటి ఆదిమ మానవుడు సంచరించినట్లున్న ఆధారాలున్న ప్రాంతం కాబట్టి ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఆసక్తి చూపే గుహలు దూరంగా చూశాం. సన్యాసి గవి గుహల రాళ్లపై వేల ఏండ్ల క్రితపు చిత్రాలు పులి, జంతువులవి చూశాం. ఆ చిత్రాలు ఎండకు ఎండి, వానకు తడిసి చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యం. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ గుహకు చేరుకున్నాం. ఈ గుహలోనే వేంకటేశ్వరుడి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశలో స్వామి ధ్యానంలో గడిపిందట. ఆ గుహలో తపస్సు చేసుకుంటూ దిగంబరస్వామి ఉండేవాడట.
మేం బయలు దేరిన తర్వాత వంట సామాను, మా గుడారాల సామాను అంతా సర్దుకుని నెత్తిన పెట్టుకుని మమ్మల్ని దాటి వెళ్లి మాకంటే ముందే వెంగమాంబ గుహ చేరిన వాలంటీర్లు వంట మొదలు పెట్టారు. కొందరు మా కోసం గుడారాలు వేస్తున్నారు. మేం మార్గ మధ్యలోనే భోజనాలు ముగించాం కాబట్టి మా లగేజి కుప్పేసి దానిపై పై పట్టాలు కప్పేసి (కోతుల నుంచి రక్షణ కోసం) శేషాచలం కొండల్లోని 108 తీర్ధాల్లో ఒకటైన తుంబురు తీర్థంకి బయలు దేరాం. మేం అప్పటివరకూ చేసిన ట్రెక్కింగ్‌ ఒక ఎత్తు. తుంబురు లోయలో చేసే ట్రెక్కింగ్‌ ఒక ఎత్తు. పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసిన ప్రదేశం తుంబురు. భక్తుల దష్టిలో ఒక పవిత్ర పుణ్య స్థలం. భక్తి విశ్వాసాలు లేని నాకు ఎదురైన ప్రకతి సౌందర్యాన్ని ఆస్వాదించడం తప్ప ఎటువంటి ఎక్సపెక్టషన్స్‌ లేవు.
పెద్ద పెద్ద బండరాళ్లు, జల ప్రవాహాలు దాటిన తర్వాత పెద్ద పుట్ట. దానికి చుట్టిన పాత పసుపు రంగు గుడ్డ చిక్కిపోయి చివికిపోయి.. ప్రధాన తీర్థం చేరడానికి దాదాపు 900 మీటర్ల ముందు నుంచి మార్గం మరింత కష్టంగా మారింది. నడుములోతు కంటే ఎక్కువ నీళ్లలో ఎడమ వైపు తాడు కుడి వైపు కొండను పట్టుకుని, కొన్ని చోట్ల బాగా వంగి జాగ్రత్తగా నడవాలి. నీళ్లు లేనిచోట తుప్పురంగు బండలు తడిగా జారుడుగా.. దాదాపు 100 అడుగుల ఎత్తున ఏటవాలుగా రెండుగా చీలి మొన తేలిన కొండ, మాసిన ఇటుక రంగు రాళ్ళ చీలిక మధ్య 20-30 అడుగుల వెడల్పు, అందులో ఏడెనిమిది స్వచ్ఛమైన నీటి గుండాలు.. అంతు తెలియని లోతులో.. వాటిని అడుగులో అడుగు వేసి జాగ్రత్తగా దాటుతూ తుంబురు తీర్థం చేరడం.. ఆ నీళ్లు ఔషధులతో కూడిన నీళ్లు.. ఆ గుండాల్లో స్నానానికి ఎవరూ దిగడానికి వీల్లేదని ముందే హెచ్చరిక. రెండుగా చీలిన కొండల్లోంచి కనిపించే అద్భుతమైన ఆకాశ దశ్యం. అద్భుతమైన శిలల ఆర్ట్‌. ప్రకతిని మించిన శిల్పులు ఇంకెవరున్నారు?!
సముద్రమట్టానికి వెయ్యి మీటర్ల పైనే ఎత్తులో ఉన్న ఈ శేషాచల కొండలు చాలా పురాతనమైనవి. 540 కోట్ల ఏండ్ల కిందట ఏర్పడినవిగా చెప్తున్నారు. కొన్ని వేల ఏండ్ల కిందట తిరుమల కొండల్లో ప్రళయం వచ్చి కొబ్బరికాయ రెండు ముక్కలై నట్లుగా కొండ రెండుగా చీలిడం వల్ల ఘోణ తీర్థం ఏర్పడింది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 16 కిమీ దూరంలో ఉన్న తుంబుర తీర్థం గురించి స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలోని వేంకటాచల మహత్యం వ్యాస మహర్షి రాశాడట. రెండు కొండలు కలిసిన చోట నుంచి మధ్యలో ఇరికిన బండరాళ్ల మధ్య నుంచి దూకే జలపాతమే ఘోణ తీర్థం. దీన్ని తుంబుర తీర్థం అంటారు. ఆ జలపాతం పక్కనే గుర్రం తలతో కనిపించే తుంబురుడు. గుర్రం ముఖం ఎందుకుందో తెలియలేదు.
నా తోటి మహిళా ట్రెక్కర్లు పవిత్రమైన స్థలంలోకి చెప్పులు వేసుకోకూడదని కాళ్లకున్న షూ తీసేయమని నాపై ఒత్తిడి తెచ్చారు. నాకు రక్షణనిచ్చే షూ తీసేదిలేదని కచ్చితంగా చెప్పిన తర్వాత ఏమనలేక మౌనం దాల్చారు. అనుకున్న గమ్యాన్ని చేరి వచ్చిన ఆనందం అందరిలో. అనేక మూలికల సారాన్ని ఇముడ్చుకున్న అమూల్యమైన ఆ జలపాతపు నీటి కింద కొద్ది క్షణాలు గడిపి సష్టి రహస్యాలు, అద్భుతాల గురించి ఆలోచిస్తూ తప్తిగా సంతోషంగా తిరిగి అదే దారిలో మా బసకు చేరేసరికి వేడివేడి బజ్జీలు, టీ మా కోసం ఎదురుచూస్తున్నాయి.
మాటలతో చెప్పలేని అనుభూతులు నింపుకున్న మనసు ఆనందంతో కేరింతలు కొడుతుంటే శరీరం అలసిపోయాను కాసింత విశ్రాంతి కావాలన్నది. రాత్రి భోజన అనంతరం క్యాంప్‌ ఫైర్‌ దగ్గర చేరిన మగవాళ్లే కాస్త ముడుచుకుని ఉన్నారు, మహిళా ట్రెక్కర్లు ఆటాపాటాతో బాగా అలరించారు. భీమవరం నుండి వచ్చిన వాణి మరింత చురుకుగా ఉండి అందరికీ ఉత్సాహం కలిగించింది. కిందటి రాత్రి కంటే ఎక్కువ చలి. వణికిపోయాం. అంతా దాదాపు జాగారమే చేశారు. వెంగమాంబ గుహలో కొంతమంది పడుకున్నారు. వాళ్ళని ఎలుకలు నిద్రపోనివ్వలేదు. మూడోరోజు అంటే జనవరి 26 తేదీ రిపబ్లిక్‌ డే. అక్కడ జెండా వందనం చేసుకున్నాం. పార్టిసిపెంట్స్‌ అందరికీ YHA సర్టిఫికెట్‌ ఇచ్చారు. అల్పాహారంగా పొంగలి, కేసరి ముగించుకుని సాంబార్‌ అన్నం (బిస్‌ బిలాబాత్‌) మధ్యాహ్నానికి పాక్‌ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాం. అయితే వచ్చిన దారిలో కాదు. మరోదారిలో పాపనాశనం వైపు.
మూడుసార్లు మాత్రమే ప్రవాహం దాటి రాతి కొండలను అధిరోహిస్తూ ఎడమవైపు లోతైన తుంబురు లోయను చూస్తూ, కుడివైపు కొండ అంచులో ఎగుడు దిగుడు గులాబీ రాతి పలకలపై, రాతి గుళ్లపై జాగ్రత్తగా ప్రయాణం. అడుగు జారితే ఎక్కడ ఉంటామో తెలియదు. బాగా పై పైకి ఏటవాలుగా ఎక్కడం కాబట్టి అక్కడక్కడా ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ ట్రెక్‌ చేశాం. మధ్యలో భోజనం ముగించుకుని పింగదీసిన మడుగు, సలింద్రబండ, సంకసనందన మీదుగా ఏడు కిలోమీటర్లు ప్రయాణించి పాపనాశనం చేరుకున్నాం. మా దారిలో అక్కడక్కడ పసుపు రంగు పెయింట్‌తో వేసిన దూరం చెప్పే నంబర్లు, హెల్త్‌ చెక్‌ అప్‌ అని కనిపించాయి. మంచి నీటి పైప్‌, నలుపు సింటెక్స్‌ ట్యాంక్‌ కనిపించాయి. బహుశా అవి ఫాల్గుణ పౌర్ణమికి వచ్చే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అయి ఉండొచ్చు.
సంకసనందన చేరడానికి ఒకటిన్నర కిలోమీటర్లకు ముందు పాపనాశన తీర్థం, రామకష్ణ తీర్థం, తుంబురు తీర్థం అని చూపుతూ బోర్డు ఉంది. శేషాచలం కొండల్లో అడుగుపెట్టాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. ఒక్కరికి అనుమతి ఇవ్వరు. సమూహాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. అయినప్పటికీ అత్యంత విలువైన ఎర్రచందనం, చందనం దొంగచాటుగా తరలిపోతున్నదన్నది జగద్విదితమే. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ప్రపంచం అన్నీ మరచి, ప్రపంచాన్ని గుప్పెట్లో ఉంచే మొబైల్‌ మాటలు లేకుండా, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా గడపడం కొత్త అనుభవం. ట్రెక్కింగ్‌ ఒక గొప్ప అనుభూతి, అనుభవాన్ని ఇవ్వడమే కాదు, అంతుచిక్కని శేషాచలం అడవుల్లోకి చేసిన ప్రయాణం నాపై నాకు విశ్వాసం పెంచింది. శేషాచలం కొండల ప్రకతి, నిగూఢ వైవిధ్యం, రమణీయత సాహసికులకు స్వర్గధామం. మనిషి స్వార్ధపు నీడలు పడకపోవడం వల్లనే శేషాచలం కొండలు ఇంకా తన అస్థిత్వాన్ని నిలుపుకోగలుగుతున్నాయి. ప్రకతి చేసే మాయాజాలం నుంచి బయటపడటం అంత సులభం కాదేమో! అప్పుడే మనసు మరొక ట్రెక్కింగ్‌ కోసం ఉవ్విళ్లూరుతున్నది.
వి. శాంతి ప్రబోధ
9866703223