బాలల కోసం సరళ సుందర చుక్కల మణిపూసలు

Sarla Sundara for children Dotted beadsఉమ్మడి పాలమూరు జిల్లా నుండి ఇటీవల మళ్ళీ బాల సాహితీవేత్తలు అనేక మంది కనిపిస్తున్నారు. ఇది నిజంగా చక్కని పరిణామం. వీరికి తోడుగా పల్లెర్ల రాంమోహన్‌ మొదలుకుని చింతకుంట కిరణ్‌ వంటి అనేక మంది యువ కిశోరాలు నిబద్ధతతో బాలలతో రచనలు చేయించి వాటిని అచ్చులోకి తీసుకు వస్తున్నారు. మరికొందరు ఈ జిల్లాలో బాల వికాసకారులు ఉన్నప్పటికీ అందరి పేర్లను పేర్కొవడం ఔచిత్యం కాదు. కవిత్వం, గేయాలు, కథ, నాటికతో పాటు ఉత్తరాలు, వ్యాసాల వంటి అనేక రూపాల్లో ఇక్కడి పిల్లలు రచనలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ నేల మీద గరిపెల్లి అశోక్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన ‘అవ్వా తాతలకు ఉత్తరాలు రాద్దాం రండి’ కార్యక్రమంలోనూ పాలమూరుది పెద్దపీట. ఈ నేపథ్యంలో పాలమూరు నుండి పిల్లల కోసం లఘు ప్రక్రియ అయిన ‘మణిపూసలు’లో రచన చేసి నిలిచిన చుక్కల రమేశ్‌ మనకు ఇక్కడి నుండి కనిపిస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, లఘు రూప ప్రక్రియ అయిన మణిపూసలు రూపొందించిన వడిచర్ల సత్యం కూడా ఇదే ఉమ్మడి జిల్లావాడు.
చుక్కల రమేశ్‌ మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని నెల్లికొండిలో 15 జూన్‌, 1973న జన్మించాడు. చుక్కల వెంకటమ్మ- బాలప్ప వీరి అమ్మానాన్నలు. తెలుగు సాహిత్యంలో ఎం.ఏ చదివి తెలుగు పండిత శిక్షణ పొందారు. ప్రయివేటు విద్యా సంస్థలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దశాబ్ధాల బోధనానుభవం, మాతృభాష మీద ప్రేమతో పద్య విద్యను ఒడిసిపట్టుకుని పద్య రచన, గేయ రచనలతో పాటు ఇటీవల రూపొందిన మణిపూసల్లోనూ తన రచనలు చేస్తున్నారు. అనేక రేపాలు ప్రక్రియల్లో చుక్కల రమేశ్‌ చక్కని రచనలు చేసినప్పటికీ రచయితగా అచ్చయిన మొదటి పుస్తకం ‘చుక్కల మణిపూసలు’. తన ఇంటిపేరుతోనే ఈ కవి తన కవిత్వాని అచ్చువేయడం విశేషం. చుక్కల రమేశ్‌కు పద్యమంటే మక్కువ… అవధానాల్లో పాల్గొనడం ఇష్టం. పృచ్చకునిగా ఈయన అనేక అవధానాల్లో పాల్గొన్నాడు. చుక్కల రమేశ్‌ తాను పనిచేస్తున్న పాఠశాల్లో ప్రతియేడు భాషాదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా పిల్లలను పద్యం వైపు మరల్చేందుకు శతక పద్య పఠనం నిర్వహించి వారి నగదు బహుమతులను పాఠశాల నుండి అందిస్తారు.
కవిగా అనేక కవితలను రాసిన చుక్కల రమేశ్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కవి సమ్మేళనాలు, కార్యక్రమాలలో పాల్గొని కవితా గానం చేసి సత్కారాలు అందుకున్నారు. వాటిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ సంభరాల కవి సమ్మేళనం, తెలంగాణ మహళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి శతావధానం సందర్భంగా జరిగిన సత్కారం, అవధాన కళా కౌముది ఆముదాల మురళి శతావధాన సత్కారం, రాజమహేంద్రవరం గోదావరి రచయితల సంఘం విశేష సత్కారంతో పాటు వివిధ సంస్థల సత్కారాలతో పాటు ‘మణిపూసల కవిభూషణ’ వంటి పురస్కారాలు వాటిలో ఉన్నాయి.
బాలల కోసం చుక్కల రమేశ్‌ తెచ్చిన రచన ‘చుక్కల మణిపూసలు’. ఇది పిల్లలకు సులభంగా చేరడమే కాకుండా కవిగా రమేశ్‌ తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ తేటతెల్లంగా అర్థం అవుతాయి. ఇది రమేశ్‌ సరళ శైలికి, మణిపూసల సరళతకు చక్కని ఉదాహరణ కూడా. ‘శ్రీ పద’ములె మణిపూసలు / గురువాక్కులె మణిపూసలు / చదువుకొండి బాలలు / ‘చుక్కల’ మణిపూసలు’ అంటూ పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా చెప్పి ఈయన ‘బడి గుడి’లోంచి వ్యక్తిగా ఎదిగినవాడు. దానిని ‘చదువు నేర్పేది గురువు/ బద్దిని చెప్పేడి గురువు / తెలుగుకొండి బాలలు / బతుకును చూపేది గురువు’ అంటూ గురుతు చెబుతాడు. మనిషి సంఘజీవి కదా! ఇతర ప్రాణులకు, మనుషులకు ఉన్న అంతరం లేదా తేడాను ఒక మణిపూసలో చక్కగా చెబుతాడీ కవి. ‘మంచిమాట వెండి వలె / మౌనం బంగారం వలె / మనిషికి మాత్రమే వరం / కాపాడు కవచం వలె’ అంటాడు. ఇంకోచోట ‘తెలుగు కోసం కలబడుదాం / తెలుగు కోసం నిలబడుదాం’ అని చెబుతాడు. చదువులమ్మ ఖ్యాతి గురించి, బాగా చదువుకున్నవారి గౌరవం గురించి ఒకచోట ఇలా అంటాడు కవి- ‘చదివినోడు మురిసిపోవు / తెలిసినోడు మెరిసిపోవు / త్యానిరతి కలిగినోడు / జగమంతా వెలిగిపోవు’, అంటూ చదువుల సారాన్ని చెబుతూనే ‘చదువుకోండి పుస్తకాలు / మెరుగుపడును మస్తకాలు’ అంటాడు. ఇంకా ‘అభివృద్ధికి ఆధారం / భవిష్యత్తు కాధారం / అవనిలోన వెలుగులకు / చదువొక్కటె ఆధారం’ అని తేల్చి చెబుతాడు. ఇంకాస్త ముందుకెళ్లి ‘దేవుడొక్కడే గుడిలో / ఎందరో కలరు బడిలో’ అంటూ బడిని గుడిగా, అక్కడి గురువులను దేవుళ్ళుగా కీర్తిస్తాడు. అమ్మ గురించి, అమ్మ పాల గురించి, బడి గురించి, విజ్ఞానం, ఆసక్తుల గురించి ఇందులో ఎన్నో చక్కని పూసల మణులున్నాయి. అలతి అలతి పదాలతో బాలల హృదికి నచ్చేట్టు, వాళ్ళు మెచ్చేట్టు చక్కని చుక్కల మణిపూసలు రాసిన చుక్కల రమేశ్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, పాలమూరు సిగలో మరిన్ని బాల సాహిత్య సరులను జేర్చాలని కోరుతూ… జయహో! బాల సాహిత్యం!
డా|| పత్తిపాక మోహన్‌
9966229548