కొన్ని సినిమాలు మనసును తడి చేస్తాయి. వాటిని చూడడమే ఓ గొప్ప అనుభవం. ఇటీవలి కాలంలో ఇలాంటి అనుభవం ఇచ్చే సినిమాలు హాలీవుడ్ లోనూ తగ్గిపోతున్నాయి. గొప్ప సినిమాలు తీయడం వేరు, మనసును తాకే సినిమాలు తీయడం వేరు. భాష తెలియని వాళ్లు కూడా చూసి ఆనందించగల సినిమాలు ప్రస్తుతం ఇంగ్లీషులోనూ తక్కువే. అలాంటి చిత్రాల నడుమ గర్వంగా నిలుస్తుంది ‘కోడా’.
ఇది 2021లో వచ్చి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించింది. ఆస్కార్ బరిలో నిలిచి ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సహాయ నటుడి కేటగిరీల్లో మూడు ఆస్కార్‌లు గెలుచుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా చెవిటి నటులతో చిత్రించిన సినిమా కోడా. ఈ సినిమాకు మాతక ఫ్రెంచ్ భాషలో 2014లో వచ్చిన ‘లా ఫెమీలే బేలేర్”. ఇది కూడా మంచి ప్రజాదరణ పొందింది. ఇది ఓ కుటుంబం కథ. ఆ కుటుంబంలో ఒక్క అమ్మాయి తప్ప అందరూ చెవిటివాళ్ళే. వీరి అనుబంధమే ఈ సినిమా నేపద్యం. ఈ కథ ఫ్రెంచ్‌లో సినిమాగా వచ్చి అందరికీ నచ్చినా ఆ పాత్రలలో మామూలు నటులు బధిరులుగా నటించడం తమకు నచ్చలేదని కొన్ని బధిర సంఘాలు వాదించాయి. అందుకే ఇదే కథను ఇంగ్లీషులో నిర్మిస్తూ దర్శకురాలు సియాన్ హెదర్ బధిరుల పాత్రలకు బధిర నటులనే ఎన్నుకుని సినిమాను అద్భుతంగా తీసారు. దీనికి స్క్రీన్ ప్లే కూడా ఆమే రాసుకున్నారు. దానికి అకాడమీ అవార్డునూ అందుకున్నారు.
రూబి ఓ పదిహేడేళ్ళ అమ్మాయి. హై స్కూలులో చదువుతోంది. ఆమె కుటుంబంలో తల్లి తండ్రి అన్న ముగ్గురూ చెవిటి వాళ్ళే. సముద్రంలో చేపలు పట్టడం వీరి వత్తి. రూబి ఒక్కత్తే వినగలదు, మాట్లాడగలదు. ఇంట్లో అందరూ బధిరులు మాట్లాడుకునే సైగల భాష అంటే సైన్ లాంగ్ల్వేజ్ లో మాట్లాడుకుంటారు. కుటుంబ వ్యాపారంలో రూబి సహాయం తప్పని సరి. ప్రొద్దున్నే మూడింటికి సముద్రంలోకి వెళ్లి వేట సమయంలో సముద్రంలో ఇతర పడవల అలారంలను, పడవపై అందే సందేశాలని విని తండ్రి, అన్నకు వాటిని తర్జుమా చేసి చెప్పడం. చేపల అమ్మకంలో కస్టమర్లతోనూ, దళారీలతోను మాట్లాడడం, రేటు నిర్ణయించేటప్పుడు తండ్రికి వ్యాపారస్తులకు అనువాదకురాల్లిగా పని చేయడం ఆమె నిర్వహించే బాధ్యత.
ఆ తరువాత స్కూలుకు వెళ్లి రూబి చదువుకుంటూ ఉంటుంది. శారీరక శ్రమ కారణంగా కొన్ని సార్లు క్లాస్ రూం లో నిద్రపోతుంది కూడా. కాని ఆమె చదువును నిర్లక్ష్యం చేయదు. రూబి స్కూలులో మైల్స్ అనే ఓ యువకుడు కూడా చదువుతున్నాడు. అతని పై రూబి అసక్తి చూపిస్తుంది. కాని మైల్స్ ఆమెను గమనించడు. ఓ సారి అతను స్కూలు సంగీత బందంలో చేరడానికి పేరు ఇస్తాడు. రూబి కి పాడడం ఇష్టం. మైల్స్ తో కలిసి సమయం గడపవచ్చనే ఆశతో ఆమె కూడా సంగీత బందంలో చేరడానికి పేరు ఇస్తుంది. వీరి సంగీతం టీచర్ బర్నార్డో. ఈయన పిల్లలందరికి ఓ చిన్న పరిక్ష పెడతాడు. క్లాసులో బర్నాడో స్టూడెంట్స్‌ని పరీక్షిస్తున్నప్పుడు అందరి ముందు రూబి పాడలేకపోతుంది. కాని ధైర్యం తెచ్చుకుని ఆమె బర్నాడో ముందు మరుసటి రోజు గొంతు విప్పినప్పుడు ఆయన రూబిలోని ప్రతిభ గుర్తిస్తాడు. ఆమె మంచి గాయని కాగలదని రూబి లో ధైర్యాన్ని నింపి ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం మొదలెడతాడు.
రూబి ఇంటి వ్యాపారంలో తన వంతు పని చేస్తూనే సంగీత సాధన కూడా చేస్తూ ఉంటుంది. చాలా సార్లు సమయానికి ఆమె క్లాసుకు వెళ్లలేకపోతుంది. దీనితో బర్నార్డోకు కోపం వస్తుంది. రూబి తండ్రి ఫ్రాంక్ కు, దళారులకు చేపల అమ్మకం విషయంలో గొడవ జరుగుతుంది. తాము ఎంత కష్టపడినా మధ్యలో దళారీలు లాభపడడం తప్ప తమకు పెద్దగా ఏం మిగలట్లేదని ఫ్రాంక్ కోపంతో తానే స్వయంగా పట్టిన చేపల్ని అమ్ముకుంటానని సవాలు చేస్తాడు. దీనితో రూబి అవసరం ఆ కుటుంబానికి ఇంకా పెరుగుతుంది. రూబి సంగీత పాఠాలకు ఆటంకం ఏర్పడుతుంది. రూబి కి ప్రతిష్టాత్మక బర్కలీ సంగీత కాలెజ్ లో సీటు సంపాదించడానికి అక్కడ చదువుకోవడాని స్కాలర్షిప్ కోసం జరిపే ప్రవేశ పరీక్షకు ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉంటాడు బర్నార్డో. కాని రూబి సమయానికి రాలేకపోవడం, వచ్చినా అలసిపోయి, శ్రద్ద చూపలేకపోవడంతో అతనికి విసుగు కోపం వస్తాయి. రూబి మనసంతా సంగీతం మీదే ఉంటుంది. తన మీద బర్నార్డో పెట్టుకున్న నమ్మకం వమ్ము అవుతుందని భయపడి తాను చేపల వేటకు రానని రూబీ ఇంట్లో చెబుతుంది. తాను ఎల్లకాలం వారితో ఉండబోనని, తనకు కొన్ని కలలు ఉన్నాయని వాటిని నెరవేర్చుకోవడం తనకు అవసరం అని వాదిస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళు కూడా అసహనానికి గురి అవుతారు.
రూబీని మైల్స్ తో కలిపి ఓ డ్యూయెట్ పాడించడానికి ప్రయత్నిస్తాడు బర్నార్డో. వారిని కలిసి ప్రాక్టిసు చేయమంటాడు. మైల్స్ దాని కోసం రూబీ ఇంటికి వస్తాడు. ఆ ఇంట్లో రూబీ తల్లి తండ్రులు, వాళ్ల జీవితం అతనికి వింతగా అనిపిస్తాయి. తన స్నేహితుడికి రూబి ఇంట్లో ఆమె తల్లి తండ్రులను తాను చూసిన విధానాన్ని చెప్తాడు మైల్స్. ఇది స్కూలు అంతా పాకుతుంది. అందరూ రూబిని వెక్కిరించడం మొదలెడతాడు. ఇది రూబి మనసును గాయపరుస్తుంది. ఆమె మైల్స్ తో మాట్లాడడం మానేస్తుంది. తన తప్పు తెలుసుకున్న మైల్స్ రూబిని క్షమాపణ కోరతాడు. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు.
ఇంట్లో తాను వేటకు రానని గొడవ పెట్టుకుని రూబి మైల్స్ తో ఈత కోసం నదికి వెళ్తుంది. ఆమె తమతో రాదని తెలుసుకుని ఫ్రాంక్, రూబి అన్న లియో ఇద్దరే వేటకు వెళతారు. కాని అదే రోజు ఓ అబ్జర్వర్ వీరి పనితనాన్ని పరీక్షించడానికి వీళ్ళ పడవ ఎక్కుతుంది. వాళ్ల పనిలో వారుంటూ రేడియో సిగల్స్, వేరే పడవ వాళ్ల హారన్లు వీళ్ళు వినలేకపోతారు. దానితో కోస్ట్ గార్డులు ప్రమాదం జరుగుతుందని పసి గట్టి పడవను ఆపుతారు. లేకపోతే ఆ రోజు సముద్రంలో వీళ్ళ పడవ మరో పడవను ఢకొీనబోయేదే. దీనితో వాళ్ళ లైసెన్స్లు రద్దు చేస్తారు ఆఫీసర్లు. రూబి తమతో లేకపోవడంతోనే ఇలా జరిగిందని ఫ్రాంక్ లియోలిద్దరూ ఆమెతో అంటారు. కాని తాను ఎల్లకాలం వాళ్లతో ఉండబోనని అంటుంది రూబి. ఫ్రాంక్ లియోలు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టి తమ లైసెన్స్లను తెచ్చుకుంటారు. అయితే వారితో ఓ మాట్లాడే వ్యక్తి కచ్చితంగా ఉండాలని ఆఫీసర్లు షరతు విధిస్తారు.
కుటుంబానికి తన అవసరం ఉందని గ్రహించి రూబీ కాలేజీ గురించి ఆలోచించడం మానేయాలని నిశ్చయించుకుంటుంది. అదే తల్లి తండ్రులకు చెబుతుంది కూడా. కాని ఆమె అన్న లియో దీనికి ఒప్పుకోడు. రూబిలో ప్రతిభ ఉందని అది వ్యర్ధం కాకూడదని ఆమె తమతో రానవసరం లేదని, తామే మరో దారి వెతుక్కుంటామని చెప్తాడు. రూబి తల్లి కూడా కూతురి మనసు అర్ధం చేసుకుంటుంది. రూబి కోసం కొత్త గౌను కొని ఆమె భవిష్యత్తు కోసం, ఆమె కల నేర్చుకోవడం కోసం తామంతా ప్రోత్సాహం అందిస్తాం అంటూ ఆ తల్లి కూతుర్లు సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకునే సీన్ ప్రేక్షకుల కళ్ళను తడి చేస్తుంది.
రూబి సంగీతం మీద శ్రద్ద పెడుతుంది. కాలేజి వార్షికోత్సవంలో ఆమె పాట వినడానికి ఆమె కుటుంబం మొత్తం వస్తుంది. కాని వారికి ఏమీ అర్ధం కాదు. చూట్టూ ఉన్నవారి హావ భావాలు, వారి చప్పట్లు కొందరి కళ్లల్లో నీళ్ళూ గమనించి తమ బిడ్డ చాలా గొప్పగా పాడుతుందని అర్ధం చేసుకుంటారు వాళ్లు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక ఫ్రాంక్ రూబిని ఆరుబయట మళ్ళీ పాడమని అడిగి ఆమె గొంతును తడిమి ఆ ప్రకంపనలను అనుభవించడానికి ప్రయత్నించడం సినిమాలో మరో గొప్ప దశ్యం.
బర్కలీ కాలేజ్ లో ప్రవేశం కోసం ఆడిషన్లు జరుగుతూ ఉంటారు. రూబి తాను వెళ్ళకూడదనే అనుకుంటుంది. కాని ఆమె కుటుంబం ఆమెను వెళ్ళమని బలవంత పెడుతుంది. దానితో చివరి నిముషంలో ఆమె బాస్టన్ చేరుకుంటుంది. ఫ్రాంక్, లియో, రూబీ తల్లి జాకీ ముగ్గురూ ఆమెకు తొడుగా ఆ కాలేజి కి వెళతారు. రూబి పెద్దగా ప్రిప్రేర్ అవలేదని బర్నార్డో కి తెలుసు. అందుకే అతనే ఆమెకు తోడుగా పియానో వాయిస్తాడు. మొదట రూబి ఆ వాతావరణానికి భయపడుతుంది. రూబి తల్లి, తండ్రి, అన్న ఆ హాలు బాల్కనిలో కూర్చుని ఉంటారు. రూబి వాళ్ళని చూస్తుంది. ఆమె తడబడి తప్పుచేస్తే దాన్ని కప్పి పుచ్చడానికి బర్నార్డో పియానో తప్పుగా మీటి మళ్ళీ మొదటి నుండి పాడే అవకాశం రూబికి కల్పిస్తాడు. బర్నార్డో తనకిస్తున్న ప్రోత్సాహం, తన కుటుంబం తనపై చూపే ప్రేమ, ఇవి రూబి లో ధైర్యాన్ని నింపుతాయి. ఆమె అద్భుతంగా పాడుతుంది. తన పాట తల్లి తండ్రులను వినిపించదని ఆమెకు తెలుసు. అందుకే తాను పాడే పదాలకు సైన్ లాంగ్వేజ్ జోడించి తల్లి తండ్రులకు అర్ధం అయ్యే విధంగా ఆ పాటలోని పల్లవి, చరణాలను ఆమె వినిపించే తీరు ఈ సినిమా మొత్తంలోనే అతి గొప్ప దశ్యం.
రూబికి బర్కిలిలో ప్రవేశం లభిస్తుంది. ఆమెను ఫ్రాంక్, జాకీ, లియోలు కాలేజి లో చేరడానికి పంపిస్తారు. అక్కడ పని చేసే వేరే జాలర్లు ఈ కుటుంబం కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలెడతారు. దానితో వాళ్ళ వ్యాపార సమస్య కూడా తీరుతుంది. అందమైన భవిష్యత్తు వైపుకు దూసుకు వెళుతూ ఆనందంతో రూబి తన కుటుంబం పై తనకున్న ప్రేమను ‘ఐ లవ్ యూ’ అంటూ సైన్ లాంగ్వేజ్ లో చెప్తుండగా సినిమా ముగుస్తుంది.
దర్శకురాలు సియాన్ హెదర్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడానికి అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌ను నేర్చుకున్నారు. సినిమా నలభై శాతం సైన్ లాంగ్వేజ్ లోనే నడుస్తుంది. అలాగే ఆమె జాలరుల జీవితం, చేపలను పట్టడం, వాటి అమ్మకాలను స్వయంగా చూసి అనుభవించి ఈ సినిమాకు కథ రాసుకున్నారు. ఫ్రెంచ్ మాతకలో ఆ కుటుంబ సభ్యులు ఫార్మ్ లో పని చేసే కార్మికులు. కాని ఇంగ్లీషులో సినిమాకి దర్శకురాలు జాలర్ల జీవితాన్ని నేపద్యంగా తీసుకున్నారు
ఈ సినిమాలో రూబి తల్లి జాకి పాత్రలో నటించిన మార్లీ మాట్లిన్ కూడా బధిరురాలే. నటన ఆమె వత్తి. 1986లో ‘చిల్డ్రన్ ఆఫ్ ఏ లెస్సర్ గాడ్’ అనే సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న మొదటి బధిర నటి ఆమె. దానితో పాటు ఎన్నో అవార్డులను ఆమె నటనలో సాధించారు. ఈ సినిమాలో రూబితో సంభాషణ జరిపే ఒక్క సీన్ చాలు ఆమె ప్రతిభ అర్ధం అవడానికి.
రూబి తండ్రి పాత్రలో నటించిన ట్రారు కాట్సుర్ కూడా ఫ్రొఫెషనల్ నటుడే. ఈ సినిమాలో ఈయన నటనకు ఉత్తమ సహాయనటుడి విభాగంలో ఆస్కార్ లభించింది. జూడి తండ్రిగా ఈయన నటన అత్యద్భుతం. బిడ్డతో అనుబంధాన్ని ఆయన వ్యక్తీకరించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. రూబి స్కూల్ లో పాడుతున్నప్పుడు ఎమీ వినిపించక ఆయనలోని అయోమయం, తరువాత రూబి గొంతును పట్టుకుని ఆ ప్రకంపనలను అనుభవిస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం, రూబి ఆడిషన్ సమయంలో తమకోసం ఆమె సైన్ లాంగ్వేజ్ లో పాడుతున్నప్పుడు ఆయన కళ్లల్లో మెరుపులు, బిడ్డను కాలేజికి పంపుతూ వీడ్కోలు పలుకుతున్నప్పుడు ఆయన కనబర్చిన భావోద్వేగాలు, సినిమాలో చూసి తీరవలసిందే.
రూబి అన్న పాత్రలో డానియల్ డూరంట్ నటన కూడా బావుంటుంది. బార్‌లో తమను వెక్కిరించిన వారిపై గొడవకు దిగె సీన్ లో డూరంట్ నటన చాలా బావుంది. ఈయన కూడా బధిర థిóయేటర్‌లో తన ప్రతిభ ప్రదర్శించి ఈ సినిమాకు ఎన్నికయిన మరో బధిర నటుడు.
మ్యూజిక్ టీచర్ బర్నార్డో పాత్రలో నటించిన స్పానిష్ నటుడు యూగెనియో డెర్బెజ్ నటనను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒక మంచి టీచర్ గా ఆయన తన శిష్యురాలికి మార్గనిర్దేశకం చేయడం, ఆమెను ప్రోత్సహించడం, కటువుగా ఉంటూనే ఆమెను ప్రేమించడం చాలా బాగా స్క్రీన్ పై చూపించారు. ముఖ్యంగా నీకు పాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అని ఆయన అడుగుతున్నప్పుడు భాష రాక, ఏం చెప్పాలో తెలియక రూబి సైగలతో తనలోని ఆనందాన్ని వ్యక్తీకరించడం, దాన్ని ఆయన అర్ధం చేసుకుని ఆమె కోసం శ్రమపడడం చాలా గొప్పగా వచ్చిన సీన్. ఆడిషన్ లో రూబి తప్పుని కప్పు పుచ్చడానికి అతనే తప్పుగా పియానో వాయించి రూబి మళ్ళీ పాటను మొదటి నుండి అందుకోవడానికి అవకాశం కల్పించిన ఓ మంచి టీచర్ గా బర్నార్డో పాత్ర మనకు గుర్తుండిపోతుంది.
రూబి పాత్రలో నటించిన ఎమిలియా జోన్స్ బ్రిటీష్ నటి. కాని ఈ సినిమాలో ఓ అమెరికన్ టీనేజర్ గా కనిపిస్తుంది ఈమె. ఆమె అమెరికన్ ఇంగ్లీషుని సినిమాలో విని ఆమె బ్రిటీష్ నటి అని చాలా మంది నమ్మలేదట. ఈ సినిమా కోసం ఆమె తొమ్మిది నెలల పాటు అమెరికన్ సైన్ లాంగ్వేజ్ ని, అలాగే చేపల ట్రాలర్‌ని లాగడాన్ని నేర్చుకుంది. ఈ సినిమాలో నటించేటప్పుడు ఆమె వయసు కేవలం పందొమ్మిదేళ్ళే. జఉణA అంటే జష్ట్రఱశ్రీస శీట ణవaట Aసబశ్ర్‌ీర అని అర్ధం. అంటే భధిరుల సంతానం. అలాగే సంగీత భాషలో రాగంలోని చివరి భాగం అని కూడా అర్ధం వస్తుంది. రూబి టీనేజ్ జీవితంలోని ఆఖరి ఘట్టానికి గుర్తుగా కూడా ఈ సినిమా నిలుస్తుంది.
ఈ సినిమాను వికలాంగ సంఘాలన్నీ ప్రశంసించాయి. అప్పటిదాకా వికలాంగులను అసహాయులుగా జాలి గొలుపుతూ చూపడం తప్ప సినిమాలలో తమకు గౌరవమైన స్థానాన్ని ఇవ్వలేదని. ‘కోడా’ లో బధిరులందరూ మామూలు జీవితం గడుపుతూ, జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ చూపడం ఎంతో బావుందని, తమకు పూర్తి సమానత్వం ఈ సినిమా ద్వారా లభించిందని వాళ్లంతా హర్షం వ్యక్తం చేయడం ఈ సినిమా సాధించిన మరో విజయం.
పి.జ్యోతి
98853 84740