ఆటలే దాడి చేస్తే !?

చిన్నప్పుడు తుపాకీ, యుద్ధ విమానాలు,
బాంబులంటూ ఆటలాడుకున్నాను
పోలీసు, మిలట్రీ వాడిలా నటిస్తూ నాన్నను
ఏమార్చి గోడ చాటు దాగి భయపెట్టేవాణ్ణి
భయాన్ని నటిస్తూ నాన్న, ధైర్యాన్ని ప్రకటిస్తూ నేను
మా ఇద్దరి మధ్య యుద్ధం ఆటకు అమాయకమైన
అమ్మ ముసిముసి నవ్వులే ప్రేక్షకులయ్యేవి
ఇప్పుడు –
కళ్లెదుటే నిజమైన యుద్ధవిమానాలు
గగన విహారం చేస్తూ దాడులు చేస్తున్నాయి
శత్రు సైనికుల చేతుల్లోని తుపాకులు బెదిరిస్తున్నాయి
నాన్న నిజమైన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు
ఆటలో నాన్నను భయపెట్టడానికి నాన్న లేడు
చాటు వెళ్ళడానికి ఇంటి గోడలు కూలిపోయాయి
అమ్మ నవ్వులు మాయమయ్యి
కన్నీళ్లు ప్రేక్షకులుగా మిగిలిపోయాయి
ఆకాశమంత ధైర్యాన్నిచ్చే నాన్న
చిటికెన వేలును యుద్ధం మింగేసింది
కొండంత మనిషి తెల్లటి కఫన్‌ గుడ్డలో మూటలా పడి వుంటే
కూలిన కప్పులకింద, గుట్టలుగా పడివున్న శిథిలాల మధ్య
ఇక ఏ జ్ఞాపకాలను వెతుక్కోను!
దాగుడుమూతలాటలో శాశ్వతంగా కనబడని
నాన్నను ఎక్కడని వెతకను !
జీవం లేని కళ్ళతో, కూలిన ఇంటిగోడల శిథిలాల్లో
నాన్నను, చెల్లిని వెతుక్కుంటూ..
అమ్మ!
‘గాజా’ నేలపై రేపటి భవిష్యత్తు మాంసపు ముద్దలుగా
రక్తపు మడుగులో కాగితప్పడవలై తేలుతూ వుంటే..
ఇక ఆటలంటే సరదాలకు మారుగా భయం మేఘాలు కమ్మేసాయి
పాలస్తీనా, పాలస్తీనా.. ఇంతవరకు నీ మట్టిలో ఎదిగిన
చెట్లగాలి పీల్చి ఆటలాడుకున్నాను
ఇక నీ మట్టి పొరలను కఫన్‌గా కప్పుకొని సేద తీరుతాను
ఆట పూర్తి కాకుండానే, నేను అలసిపోక ముందే
ఆట బొమ్మలు లేని నా ఖాళీ పిడికిలితో సమాధిలోకి వెళ్ళిపోతాను
ఇప్పుడు గోడచాటు అక్కర లేదు, నటనలు అక్కరలేదు
కడుపులో దాచుకునే అమ్మ కడుపుకోతలతో కూలిపోయింది
అమ్మ లెక్కకందని గాయాలతో ఏ ఆస్పత్రిలోనో..
అమ్మ కళ్ళలో అన్ని లోకాలు నా కోసం తహతహలాడేవి
ఇప్పుడు ఏ ఒక్కరూ నా వైపు కన్నెత్తి చూడటంలేదు
అనాధగా… ఒంటరిగా మిగిలాను…
పాలస్తీనా –
ఆటలోని కుట్రలు తెలియని పసి కూనలం
నీ మట్టిలో చిన్నప్పుడు పూల మొక్కల విత్తనాలను నాటాను
ఇప్పుడు నా చిట్టి చెల్లిని నాటుతున్నాను
రేపటి కాలంలో ఈ మట్టిలోనే
అందమైన పూల మొక్కలా ఎదగాలని..
ఈ నేలను పరిమళింపజేయాలని …
– డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, 9177857389