గృహాలక్ష్మి..మహిళలకే

ఇండ్లు లేని నిరుపేదలందరికి గృహాలక్ష్మి పేరుతో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. గృహాలక్ష్మి పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు..ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల గ్రాంట్‌ కింద ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వ విధివిధానాలు రూపొందించింది. ఇందుకు దరఖాస్తులను ఈ నెలాఖరి నుంచి స్వీకరించనున్నట్టు అధికారులు తెలుపుతున్నారు.
– ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు త్వరలో దరఖాస్తుల పక్రియ ప్రారంభం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 36 వేల గృహాలు కేటాయింపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇల్లు లేని నిరుపేదల సంఖ్య ఘననీయంగా ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తుంది. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన గృహాలక్ష్మి పథకంతో కొంత మేరకు ఉపసమనం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇల్లు జాగా ఉండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్తోమత లేక.. సొంత ఇల్లు నిర్మించులేక పోతున్నవారికి కొంత ఊరట నిచ్చేలా గృహాలక్ష్మి పథకం ఉండబోతుంది. గృహా లక్ష్మి పథకం కింద ప్రతి నియోజక వర్గానికి గృహాలు 3000 చొప్పున కేటాయించడం జరిగింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలకు 36 వేల గృహాలు కేటాయించడం జరిగింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అర్హులకు రూ.3లక్షలు ఇస్తోంది. అయితే ఇందుకు సొంత జాగా ఉండాలి, మహిళల, వితంతువు పేరు మీద గృహాలక్ష్మి కేటాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఇల్లు లబ్ధిదారులకు నచ్చిన విధంగా నిర్మాణం చేసుకోవచ్చు. రెండు గదులతో స్లాబ్‌ వేసుకోవాలి, టాయిలెట్‌ తప్పనిసరిగా నిర్మాణం చేపట్టాలి. ప్రభుత్వం ఆమోదించిన గృహాలక్ష్మి పథకం లోగోను ఇంటిపై వేయాలి.
అర్హత ప్రమాణాలు
లబ్దిదారులు లేక ఆ కుటుంబంలో ఎవరైనా కుటుంబ సభ్యుడు ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. లబ్దిదారులకు సొంత ఇంటి జాగా ఉండాలి. స్థానిక నివాసి, ఓటర్‌ కార్డు, ఆదార్‌ కార్డు కలిగి ఉండాలి. ఇప్పటికే ఆర్‌సీసీ రూఫ్‌తో ఇల్లు ఉంటే పథకానికి అనర్హులు. దరఖాస్తుదారు, లేక అతని కుటుంబ సభ్యులు జీవో -59 ప్రకారం లబ్దిపొంది ఉంటే అనర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది.
గృహాలక్ష్మి మంజూరు
జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషన్‌ అధ్వర్యంలో దరఖాస్తుల పక్రియ ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్‌ , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆధ్వర్యంలో లబ్దిదారులను ఎంపిక చేస్తారు. దశలవారీగా జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుంది.
లబ్దిదారులకు బిల్లుల చెల్లింపు ఇలా..
ఒక్కో ఇంటికి ఇచ్చే మొత్తం 100శాతం సబ్సిడీ కింద రూ. 3లక్షలు ఇస్తోంది. అయితే ఇది మూడు దఫాలుగా చెల్లించనుంది. మొదటి దశ బేస్‌మెంట్‌ స్థాయిలో రూ. లక్ష , రూఫ్‌ లెవల్‌ పూర్తయ్యాక మరో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష ఇవ్వనుంది.
నెలఖారులో ధరఖాస్తుల పక్రియ ప్రారంభం
గృహాలక్ష్మి పథకం అర్హత జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తుంది. ఈ నెలఖారులో ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.