పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి

– ప్రధానోపాధ్యాయులు విద్యాకరరావు,
– సామాజిక కార్యకర్త ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని కొండకల కొండకల్‌ క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు విద్యాకరరావు, సామాజిక కార్యకర్త ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్‌ అన్నారు. శంకర్పల్లి మండలంలోని చేరిగూడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్వర్గీయ పెంటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వీరమని సంతోష్‌ కుమార్‌లు కలిసి విద్యార్థులకు కథల పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్‌, కంబాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి దాతలు ముందుకు వచ్చి విద్యార్థుల అవసరాలను తెలుసుకుని, సందర్భా నుసారం వారికి కావాల్సిన పఠన సామాగ్రిని అందించడం అభినంద నీయ మన్నారు. విద్యార్థులు పుస్తకాలను నిరంతరం చదవడం వలన పఠన నైపుణ్యం మెరుగుపడటంతో పాటు, పుస్తకంలోని సారాంశాన్ని గ్రహించి, కథలలోని నీతిని, మంచి చెడులను తెలుసుకుని సమాజంలో ఎలా జీవించాలో తెలుసు కోగలుగుతారని వారు తెలిపారు. ప్రతీ విద్యార్థి చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణగౌడ్‌, ఉపాధ్యాయులు రాముశర్మ, ఎస్‌ఎంసీ చైర్మెన్‌ శ్రీనివాస్‌, గ్రామస్తులు తదితరులున్నారు.