రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలి

– ఏఐఎస్‌ఎప్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-షాద్‌నగర్‌
విద్యారంగ సమస్యల పరిష్కారానికై రేపు జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యులు పవన్‌ చౌహన్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌ కోరారు. సోమవారం షాద్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక విద్యావ్యవస్థ పూర్తిగా భ్రస్టు పట్టిందన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌కు సొంత బిల్డింగులు లేక ఎంతో మంది విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సొంత భవనాలు కేటాయించాలని, లేదంటే నిర్మించాలని దానిలో భాగంగానే బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. నాలుగేండ్లుగా స్కాలర్‌షిఫ్‌, ఫీజు రియింబర్స్‌మెంట్‌ దాదాపు రూ. 4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అవి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రయివేటు కార్పొరేట్‌ పాఠశాలల్లో బుక్స్‌, స్టేషనరీ వస్తువుల అమ్మకాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని పేర్కొన్నారు. యూనివర్సిటీ పేరుతో మోసపోయిన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకాష్‌ నాయక్‌, శిరీష, రాధిక, పి.శివా నాయక్‌, విష్ణు, రామ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సాయి కిశోర్‌, సంధ్య, వాని తదితరులు పాల్గొన్నారు.