– జీవోలను వెంటనే సవరించండి
– కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాల్సిందే..
– ఇప్పటికైనా 5 జీవోలను గెజిట్ చేయాలి
– సంపద సృష్టికర్తలైన కార్మికుల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
– కార్మికులు రాజకీయంగా చైతన్యం కావాలి :సీఐటీయూ జీపు జాతా ముగింపు సభ లో రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తే సరిపోదని, కార్మికుల కనీస వేతనాల పెంపుపై సర్కారుకు సోయి వున్నదా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ప్రశ్నించారు. దోపీడీ వర్గాలకు వ్యతిరేకంగా.. కార్మికులకు అండగా ఎర్రజెండా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో కనీస వేతనాలు సవరించాలని ఈ నెల 4వ తేదీ నుంచి 13వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో జీపు జాతా చేపట్టింది. గురువారం ముగింపు సభ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలో నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన జరిగిన సభలో చుక్క రాములు మాట్లాడారు.
బీఆర్ఎస్ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తేనే సరిపోదని, కనీస వేతనాల జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు. వెంటనే కనీస వేతనాలు రూ.26వేలు ఉండే విధంగా నూతన జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోలు సవరించే వరకు సీఐటీయూ పోరాటాలు కొనసాగిస్తుందని, కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.కనీస వేతనాల కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని, సంపద సృష్టికర్తలైన కార్మికవర్గం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తయినా విద్య, వైద్యం, నివాసానికి కార్మికులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పాలక వర్గాల విధానాలను కార్మికులు అర్థం చేసుకుని రాజ కీయంగా చైతన్యం కావాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం మతం పేరిట, చైనా, పాకిస్థాన్ బూచీ చూపించి కార్మికుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకుని కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులపై దాడిచేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. పెట్టుబడ ిదారులకు అనుకూలంగా చట్టాలను చేసిందని, కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ వంటివి యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరించే సరళికృత ఆర్థిక విధానాలే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తు న్నదని విమర్శించారు. పాలక వర్గాల దోపీడీ విధానాలను అర్థం చేసుకుని కార్మికవర్గం ఐక్యమై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు (జీపుజాతా నాయకులు) భూపాల్, మల్లికార్జున్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో పని చేస్తున్న కార్మికులకు 15ఏండ్లుగా కనీస వేతనాలు సవరించలేదని చెప్పారు. ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న కోటి మందికిపైగా కార్మికులు కోట్లాది రూపాయల జీతభత్యాలు నష్టపోయారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదేండ్లకోసారి చట్టబద్దంగా వేతనాలు సవరించాలని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు సవరించలేదని ఆవే దన వ్యక్తం చేశారు. జీపు జాతా సందర్భంగా కార్మి కులకు సంబంధించి అనేక సమస్యలు విన్నామని, ఎంతో దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారని అన్నారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, చిన్న చిన్న గదుల్లో 10 నుంచి 15 మందిని ఉంచుతున్నారని చెప్పారు. కనీస సౌకర్యాలు లేకుండా బానిసల మాదిరి గొడ్డుచాకిరీ చేయిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, బోనస్, గ్రాట్యూటీ ఇతర సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదన్నారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన 5 రంగాల జీవోలను గెజిట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు 7గంటలు, వారానికి 5రోజుల పని దినం ఉండాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని, వలస కార్మికులకు 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారం హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఏ.అశోక్, ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు పి.గణేష్, సహాయ కార్యదర్శులు ఐపీ రాజశేఖర్, అధ్యక్షులు బి.వి. సత్యనారాయణ, జి.శ్రీనివాసులు, మహిళలు, కార్మికులు పాల్గొన్నారు.