‘నాక్‌’ గుర్తింపులేనివి 695 వర్సిటీలు..34వేల కాలేజీలు

–  ‘నాక్‌’ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం : కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో 695 యూనివర్సిటీలకు, 34వేల కాలేజీలకు ‘నాక్‌’ (నేషనల్‌ అసెస్‌మెంట్‌, అక్రిడేషన్‌ కౌన్సిల్‌) గుర్తింపులేదని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. వర్సిటీలు, కాలేజీల్లో బోధన, ఇతర సౌకర్యాలను మదింపు చేసిన తర్వాత ‘నాక్‌’ గ్రేడింగ్‌ (నాణ్యతా స్థాయి) ఇస్తుంది. మెరుగైన గ్రేడింగ్‌ అందుకున్న కాలేజీల వివరాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచుతుంది. ఏ కాలేజీలో చేరాలి? ఏది మెరుగైంది? అన్నది విద్యార్థులకు సులభంగా తెలుసుకోవడానికి యూజీసీ ‘నాక్‌’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే వందలాది వర్సిటీలు, వేలాది కాలేజీలకు ‘నాక్‌’ గుర్తింపు దక్కకపోవటం ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. ”యూజీసీ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 1113 యూనివర్సిటీలు, 43796 కాలేజీలున్నాయి. ఇందులో 418 వర్సిటీలకు, 9062 కాలేజీలకు మాత్రమే ‘నాక్‌’ గుర్తింపు దక్కింది” అని ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ వెల్లడించారు. వర్సిటీలు, విద్యాసంస్థలన్నింటినీ ‘నాక్‌’ పరిధిలోకి తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ‘నాక్‌’ అక్రిడేషన్‌, ఇతర గుర్తింపు పొందేందుకు నిర్దేషించిన ఫీజును తగ్గించామని, నమోదు ప్రక్రియను సరళతరం చేశామని అన్నారు. అనుబంధ కాలేజీల స్వీయ అధ్యయన నివేదికలను కూడా చాలా వరకు తగ్గించినట్టు ఆయన చెప్పారు. కేంద్రం త్వరలో నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ)ని తీసుకురాబోతున్నది. దీంతో వర్సిటీలు, కాలేజీలన్నీ ‘ఎన్‌ఈపీ’ పరిధిలోకి రాబోతున్నాయి. అయితే ‘ఎన్‌ఈపీ’పై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యారంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకే ఈ కొత్త పాలసీని మోడీ సర్కార్‌ ఎంచుకుందని ఆరోపిస్తున్నాయి. దీనివల్ల అణగారిన వర్గాలు, పేదలకు వర్సిటీ విద్య అత్యంత ఖరీదుగా మారుతుందని విద్యావేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు.