గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– జేఏసీతో చర్చలు జరపాలి
– సమ్మెను విరమింపజేయాలి
– సీఎంకు సీఐటీయూ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాపితంగా 12,769 గ్రామ పంచాయితీల్లో 50వేల మంది గ్రామపంచాయితీ సిబ్బంది స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌కలెక్టర్లుగా వివిధ కేటగిరిల్లో పనిచేస్తున్నారనీ వీరి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కార్మికులంతా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన పేదలేనని తెలిపారు. తమ ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా గ్రామాలను శుభ్రం చేస్తూ, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. అనేకసార్లు ప్రభుత్వానికి తమ సమస్యలు మొరపెట్టుకున్నప్పటికీ అవి పరిష్కారం కాలేదనీ, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సమ్మె నోటీస్‌ ఇచ్చారని తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదనీ, అనివార్య పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి జూలై 6 నుంచి రాష్ట్ర సమ్మెను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని జేఏసీ నాయకత్వంతో చర్చలు జరపాలనీ, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కరి పేరుతో వచ్చే రూ.8500ల వేతనాన్ని ఇద్దరు ముగ్గురు సిబ్బంది పంచుకుంటున్నారని తెలిపారు.దీంతో వీరు అత్యంత దీనస్థితిలో బతుకుతున్నారని పేర్కొన్నారు. కనీస వేతనం, పీఎఫ్‌, ఆరోగ్య బీమా, గ్రాట్యూటీ, సెలవులు, గుర్తింపు కార్డుల సౌకర్యం లేదని గుర్తుచేశారు. చనిపోయిన సిబ్బందికి కనీసం అంత్యక్రియల ఖర్చు, ఆర్థిక సహాయంకూడా అందించడంలేదని తెలిపారు. రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేశారు. చట్టబద్దంగా జరుగుతున్న పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు. అధికారులు సమ్మెను విచ్చిన్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనీ, పోటీ కార్మికులతో పనులు చేయించే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.