బ్రెజిల్‌లో మోర్‌ డాక్టర్స్‌ ప్రొగ్రామ్‌ పునరుద్ధరణ !

– త్వరలో 15వేల మంది డాక్ట్లర్ల నియామకం
బ్రసీలియా : బ్రెజిల్‌లో మోర్‌ డాక్టర్స్‌ ప్రొగ్రామ్‌ను పునరుద్ధరించే బిల్లుకు బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ప్రజారోగ్య సంరక్షణను విస్తరించాలని ఈ కార్యక్రమం కోరుతోంది. యునిఫైడ్‌ హెల్త్‌ సిస్టమ్‌ (ఎస్‌యుఎస్‌) ప్రాధమిక సంరక్షణ రంగంలో ప్రధానంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్ల సంఖ్యను పెంచాలని కార్యక్రమం కోరుతోంది. ఎస్‌యుఎస్‌ అనేది ఉత్తమమైన ప్రజారోగ్య వ్యవస్థ అని లూలా వ్యాఖ్యానించారు. ప్లానాల్టో ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యానికి కేటాయించే డబ్బును ఒక ఖర్చుగా చూడకూదని, ఒక పెట్టుబడిగా చూడాలని లూలా వ్యాఖ్యానించారు. ఆరోగ్య నిపుణులు, స్పెషలిస్టుల సేవలందుకునే ప్రజల హక్కు నిరాకరించబడుతోందని అంటూ వాస్తవానికి ఈ మోర్‌ డాక్టర్స్‌ కార్యక్రమం దేశంలోని అత్యంత సుదూర ప్రాంతాలను కలుపుతోందని లూలా అన్నారు. ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించడం ఈ దేశం కోసం తీసుకున్న అసాధారణ చర్యగా ఆయన పేర్కొన్నారు. ఎవరికైనా ఎస్‌యుఎస్‌ పట్ల సందేహాలు వున్నట్లైతే కరోనా సమయంలో మన వైద్య రంగ నిపుణులు అందించిన సేవలు చూడాలని ఆయన సూచించారు. ఎస్‌యుఎస్‌ ప్రాధమిక సంరక్షణలో 15వేలమంది డాక్టర్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 13వేలుగా వున్న సంఖ్యను 28వేలకు పెంచుతున్నారు. వీరు దాదాపు 9.6కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తారు. దేశంలోనే శిక్షణ పొందిన డాక్టర్లకు ఈ కార్యక్రమంలో మొదటగా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఒకవేళ అవసరమనుకుంటే ఇతర దేశాల నుండి నిపుణులను తీసుకుంటామని లూలా చెప్పారు.