ముగిసిన జాతీయ కరాటే పోటీలు

హైదరాబాద్‌ : జాతీయ ఓపెన్‌ కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్స్‌లో స్పోర్ట్స్‌ కరాటే డూ అకాడమీ అథ్లెట్లు నాలుగు పసిడి, రెండు రజత, రెండు కాంస్య పతకాలు సహా ఎనిమిది మెడల్స్‌ సాధించారు. అండర్‌-12 (50కేజీలు) విభాగంలో వై. శివ దీపేశ్‌ పాత్రో, 45కేజీలు విభాగంలో వేదాన్షు ప్రసాద్‌లు స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. అర్జున్‌ అభిలాశ్‌ (అండర్‌-10, 55 కేజీలు), ఆరవ్‌ భువానియ (అండర్‌-10, 40 కేజీలు) గోల్డ్‌ మెడల్స్‌ నెగ్గారు. అభిరామ్‌, ఆలేటి అభినవ్‌ సిల్వర్‌ మెడల్స్‌ కొట్టగా.. భవ్య మీనాక్షి, మోహిత్‌ యడలు కాంస్య పతకాలు నెగ్గారు. జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను కోచ్‌ డెవిడ్‌ అభినందించారు.