– మూడు పంటల కేసీఆర్ కావాల్నా..
– మూడు గంటల కాంగ్రెస్ కావాల్నా..
– రైతులు ఆలోచించాలన్న ఎమ్మెల్సీ, విప్ కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
మూడు పంటలకు సాగు నీరందించేందుకు నిరంతర విద్యుత్ సరఫరా చేసే సీఎం కేసీఆర్ కావాల్నా.. మూండు గంటల విద్యుత్ సరఫరా చేస్తామంటున్న కాంగ్రెస్ కావాల్నా.. లేక మత మంటలకు ఆజ్యం పోసే బీజేపీ కావాల్నా అనేది రైతులు ఆలోచించాలని ఎమ్మెల్సీ, మండలి విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. విద్యుత్ సరఫరా పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యుత్ తీగలకు తగిలించి ఆ బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మపై పడి బోరున ఏడుస్తూ సోమవారం తగులపెట్టారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతును రాజులా బతికేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని, దాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కరంట్ సరఫరా ఉండడం లేదంటూ విమర్శలకు దిగుతున్నారని.. దమ్ముంటే వీణవంకలో కరంట్ తీగలు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చర్చించుకునేందుకే రైతు వేదికలు ప్రభుత్వం నిర్మించిందని, రైతులందరూ ఈ విషయంపై రైతు వేదికలతో పాటు గ్రామంలోని ముఖ్యమైన కూడళ్లలో చర్చ పెట్టాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలకు ఎవరూ లొంగొద్దని సూచించారు. రైతుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
టికెట్ నాదే..
సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దు..
నియోజకవర్గంలోని ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని, ముమ్మాటికి హుజురాబాద్ బీఆర్ఎస్ టికెట్ పాడి కౌశిక్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. గతంలో జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ బహిరంగంగానే ఆదేశాలు ఇచ్చారని, ఇటీవల సీఎం కేసీఆర్ సైతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తో స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. కొంత మంది పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తూ సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిని ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ కుట్రలను తిప్పి కొట్టాలని కోరారు. ఇందులో ఎలాంటి తేడా ఉండదని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిచి బీఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలు నమ్మొద్దని కోరారు. తప్పకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆదేశాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.
చంద్రబాబు శిష్యుడే రేవంత్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయన ఆ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి పార్టీని తుగ్లక్ లాగా వ్యవహరిస్తూ పార్టీని నాశనం చేశాడని, అది గ్రహించిన తాను ముందే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం సైతం చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజలను సైతం ముంచేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, ప్రజల గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, పర్లపల్లి రమేష్, గంగాడి సౌజన్య-తిరుపతిరెడ్డి, దాసారపు లక్ష్మణ్, చదవు మహేందరెడ్డి, పొదిల రమేష్, ఒడ్డెపల్లి లక్ష్మి-భూమయ్య, మల్లయ్య, అడిగొప్పుల సత్యనారాయణ, తాళ్లపల్లి మహేష్, గొడుగు రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.