విలేజ్‌ టూ వరల్డ్‌కప్‌!

– గ్రామీణ క్రికెటర్లకు సరికొత్త వేదిక
– ఐఎస్‌బిసి ప్రధాన లక్ష్యం ఇదే
– క్యాట్‌ కార్యదర్శి సునీల్‌ బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌

‘ మా పిల్లాడు చాలా బాగా ఆడతాడు. అయినా, స్కూల్‌ టీమ్‌లో రెండుమూడేండ్లుగా ఒకే జట్టును ఆడిస్తున్నారు. ప్రతిభ ఉన్న కొత్త వారికి అవకాశం దక్కటం లేదు’… ఎంతో మంది స్కూల్‌ క్రికెటర్ల తల్లిదండ్రుల ఆవేదన ఇది. జిల్లా స్థాయిలో క్రికెట్‌ జట్ల ఎంపికలోనూ ఇదే దుస్థితి. ప్రతిభ ఉన్న గ్రామీణ క్రికెటర్లకు ప్రాధాన్యత దక్కటం లేదు. ఇటు స్కూల్‌ క్రికెట్‌, అటు గ్రామీణ క్రికెట్‌లో వ్యవస్థాగత సమస్యలకు చెక్‌ పెట్టేందుకు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (క్యాట్‌), ఐఎస్‌బిసి (ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డు ఆఫ్‌ క్రికెట్‌) ముందుకొచ్చాయని క్యాట్‌ కార్యదర్శి సునీల్‌ బాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో హెచ్‌సీఏకు ప్రత్యామ్నాయం క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణే (క్యాట్‌) అని బీసీసీఐ సైతం భావిస్తున్న దశలో సునీల్‌ బాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ …
గ్రామీణ క్రికెటర్లకు అద్భుత వేదిక
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవ లేదు. హెచ్‌సీఏ రాజధాని ప్రాంతానికే పరిమితం కాగా.. జిల్లాల్లో క్రికెట్‌ను ముందుకు నడిపిస్తున్నది క్యాట్‌. ప్రతి జిల్లాలోనూ శాశ్వత శిక్షణ శిబిరం ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతున్నాం. ఇటీవల హనుమకొండలో ఆధునాతన ట్రైనింగ్‌ సెంటర్‌ను ఆరంభించాం. గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటేందుకు అద్భుత వేదిక క్యాట్‌ అందిస్తోంది. పదేండ్లుగా గ్రామీణ క్రికెట్‌ అభివృద్ది కోసం క్యాట్‌ కృషి చేస్తోంది. తెలంగాణలో గ్రామీణ క్రికెట్‌ అభివృద్దికి క్యాట్‌ కృషి బీసీసీఐ దృష్టిలోనూ ఉంది.
ఐఎస్‌బిసితో గుణాత్మక మార్పు
పాఠశాల స్థాయి క్రికెట్‌ను దేశానికి పరిచయం చేసింది క్యాట్‌. ఇప్పుడు ఐఎస్‌బిసి బ్యానర్‌తో 2024 జనవరిలో స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచ కప్‌ నిర్వహిస్తున్నాం. ప్రతిభ ఉండి స్కూల్‌ టీమ్‌లో చోటు దక్కని క్రికెటర్లు, జిల్లా జట్లలో చోటు సాధించలేని వర్థమాన క్రికెటర్ల కెరీర్‌లో ఇది గుణాత్మక మార్పు తీసుకురానుంది. స్కూల్‌ క్రికెట్‌లోనే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడిన అనుభవం యువ క్రికెటర్లకు అందించబోతున్నాం. రానున్న కాలంలో స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌లో పోటీపడటమే.. పాఠశాల స్థాయి క్రికెటర్ల లక్ష్యంగా మారనుంది. స్కూల్స్‌ క్రికెట్‌కు అధికారిక బోర్డుగా ఐఎస్‌బిసి రూపుదిద్దుకోనుంది. ఇండియన్‌ స్కూల్స్‌ టాలెంట్‌ లీగ్‌లో పది జట్లు పోటీపడతాయి. ఐఎస్‌టీఎల్‌లో సత్తా చాటిన క్రికెటర్లు స్కూల్స్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు.
60 సెకండ్ల వీడియో విప్లవం!
దేశవ్యాప్తంగా 766 జిల్లా కేంద్రాల్లో శాశ్వత శిక్షణ శిబిరాలు ఏర్పాటు దిశగా సాగుతున్నాం. ప్రతి జిల్లా నుంచి 400 మంది క్రికెటర్లను ఎంపిక చేయనున్నాం. ప్రతిభావంతులైన క్రికెటర్లు తమ నైపుణ్యాలతో కూడిన 60 సెకండ్ల వీడియోను ఐఎస్‌బిసి వెబ్‌సైట్‌, యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇప్పటికే గణనీయంగా వీడియోలు వచ్చాయి. ప్రతి జిల్లాకు ఓ సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసి 400 మంది క్రికెటర్లను ఎంపిక చేస్తున్నాం. నైపుణ్యం ఆధారంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి క్రికెటర్లను ఎంపిక చేస్తారు.
రాజమౌళి రాక గేమ్‌ చేంజర్‌!
దిగ్గజ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఐఎస్‌బిసి గౌరవ చైర్మెన్‌గా రావటం స్కూల్‌ క్రికెట్‌, రూరల్‌ క్రికెట్‌కు అతిపెద్ద ఊతం. స్కూల్‌ క్రికెట్‌లో ‘విలేజ్‌ టూ వరల్డ్‌కప్‌’ నినాదం ఆయనను ఆకర్షించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మెరికల్లాంటి మరింత మంది ధోనీలను వెలుగులోకి తీసుకురావాలనే ఐఎస్‌బిసి సంకల్పం రాజమౌళి రాకతో ఆచరణలోకి రానుంది. రాజమౌళి రాకతో దేశవ్యాప్తంగా ఐఎస్‌బిసి, ఇండియన్‌ స్కూల్స్‌ టాలెంట్‌ లీగ్‌ (ఐస్‌టీఎల్‌)కు విశేష ఆదరణ లభించనుంది.