పుస్తకాలు అడిగితే పోలీస్‌ జులుం

– ఏపీ ఇంటర్‌బోర్డు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
అమరావతి : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఆందోళన నిర్వహిం చిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించింది. ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ బుధవారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని బోర్డు వద్దకు చేరుకు న్నారు. అక్కడే బైఠాయించి పుస్తకాలు ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వారిని బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించగా.. నాయకులు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లలో పడేశారు. అక్కడ నుంచి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యా ర్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు పంపి ణీకి ప్రభుత్వం నిరాకరిస్తుందంటే వారి చదువును దూరం చేయడమే తప్ప మరొకటి కాదని పేర్కొన్నా రు. అమ్మఒడి బూచి చూపించి ఎగ్గొట్టడం ప్రభుత్వా నికి సిగ్గుచేటు అని ఆగ్రహించారు. జూని యర్‌ కళా శాలల్లో 3 వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. పుస్త కాలు, అధ్యాపకులు లేకపోవడంతోనే గత విద్యా సంవత్సరం జూనియర్‌ కళాశాలల్లో 36 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, ప్రభుత్వం దీనిని గుర్తుంచుకోవాలని అన్నారు. 474 కళాశాల ల్లో 210 ప్రిన్సిపల్స్‌ లేరని, 26 జిల్లాలకు రెగ్యులర్‌ ఆర్‌ఐఒలు, 13 డిప్యూటీ ఇఒలు లేరని చెప్పారు. దీనివల్ల ఇంటర్మీడియట్‌ అడ్మినిస్ట్రేషన్‌ సిలబస్‌ ప్రణాళిక తూతూ మంత్రంగా నడుస్తుందని పేర్కొ న్నారు. ఇంటర్‌ విద్యార్థులకు గత ప్రభుత్వం అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిలిపే సిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను విన్నాను’ అన్న సిఎం జగన్‌కు విద్యార్థుల దగ్గర నుంచి కూడు లాక్కోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు రమేష్‌, సిహెచ్‌ వెంకటేశ్వరరావు, నాయ కులు రాజా, ఎం సోమేశ్వరరావు, కుమార స్వామి, రాజు,నవిత, జ్యోతి, రత్నకుమారి, బాలాజీ ఉన్నారు.
అరెస్టులను ఖండించిన సీపీఐ(ఎం)
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ఖండించింది. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేయాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టు లను భర్తీ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకట నలో డిమాండ్‌ చేశారు. విద్యార్థుల న్యాయమైన కోర్కెలు తీర్చాల్సిన ప్రభుత్వం నిర్బాంధాన్ని ప్రయో గించి నాయ కులను అరెస్టు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు.
అరెస్టయిన వారిని పరామర్శించిన మధు
పోలీసులు అరెస్టు చేసిన వారిని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పి మధు పరామర్శించారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలైన వారిని మంగళగిరిలోని పరామర్శించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. విద్యారంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాల వల్ల పేదలకు విద్య దూరమయ్యే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో అది చదవలేని పేదలు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడం వల్ల లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు వెల్లడం లేదని తెలిపారు. టీచర్‌ పోస్టులను భర్తీ చేయని దృష్ట్యా ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని, ఈ అంశాన్ని ప్రభుత్వం విస్మరిస్తోం దని విమర్శించారు. విద్యా రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నాయని, పేద లకు విద్యను దూరం చేసే విధానాలను అవలంభి స్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యారంగం లో సమస్యలపై విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌, కార్యదర్శి అశోక్‌, ఉపాధ్యక్షులు పరమేష్‌, నాయకులు ఎం బాలాజీ సోమేశ్వరావు, వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ కుమార్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న పాల్గొన్నారు.