ప్రత్యర్థులమైనా..దేశం కోసం ఏకమయ్యాం

– ప్రజా సమస్యల పరిష్కారానికి ఆగస్టు 7న కలెక్టరేట్‌ల ముట్టడి
– 25న మణిపూర్‌ ఘటనలపై ఆందోళనలు
– 26 నుంచి 30 వరకు ‘సేవ్‌ ఆర్‌టీసీ’ నిరసనలు
– రాష్ట్రంలో సీపీఐ, సీపీఐ(ఎం) బలమైన స్థానాల్లో పోటీకి ఏర్పాట్లు : సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలైనప్పటికీ జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేయడం హర్షదాయకం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీయేతర పార్టీలు జాతీయస్థాయిలో పోస్ట్‌ పోల్‌ అలయన్స్‌గా రూపొందించే ప్రక్రియలో భాగమే ఇండియా కూటమి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆగష్టు 7న అన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌లను ముట్డడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమిని ఆయన స్వాగతించారు. హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో మంగళవారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశ నిర్ణయాలను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పశ్యపద్మ, ఇటి.నరసింహా, కలవేణి శంకర్‌తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని వెల్లడించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు యూపీఏ స్థానంలో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి పేరు నిర్ధారణలో సీపీఐ, సీపీఐ(ఎం) కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఇరు పార్టీలు సైద్ధాంతికంగా మద్దతునివ్వడం దేశ ప్రజలకు ఎంతో ఉపయోగకర మన్నారు. ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని ప్రధాని మోడీ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఓటమి భయం మోడీలో కనపడుతోందన్నారు. ఎన్‌డీఏ పార్టీలతో మోడీ సమావేశం పెట్టుకోవచ్చా?, ఇతరులు మాత్రం సమావేశం కావొద్దా, ప్రతిపక్ష పార్టీల సమావేశమైతే అది స్వార్థం, కుటుంబ రాజకీయాల కోసమా? అని కూనంనేని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేరళ , బెంగాల్‌లో ప్రత్యర్థులమే
ఇండియా కూటమిలో బీఆర్‌ఎస్‌ లేకపోవడం, ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తాయా? అని విలేకరులడిగిన ప్రశ్నకు ఆయన సమాధానిస్తూ జాతీయ పార్టీలకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధం లేదని చెప్పారు. మునుగోడులో బీజేపీిని నిలవరించేందుకు బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని, అందులో విజయవంతమయ్యామని తెలిపారు. కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్‌ కూటములే ప్రధాన ప్రత్యర్థులని, పశ్చిమ బెంగాల్‌లో సైతం తణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు, కాంగ్రెస్‌ ప్రత్యర్థులని గుర్తుచేశారు. కానీ జాతీయ స్థాయిలో దేశం కోసం వీరందరూ ఇండియా కూటమిలో భాగస్వాములుగా లేరా? అని కూనంనేని ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లో పోరాటం ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రమాదకరమైన బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఒకటిగా ఉన్నామని వివరించారు. కొన్ని ఎన్నికల ముందు (ప్రీ పోల్‌), కొన్ని ఎన్నికల అనంతరం (పోస్ట్‌ పోల్‌) పొత్తులు ఉంటాయని చెప్పారు.
బలమైన స్థానాలలో కచ్చితంగా పోటీ
సీపీఐ, సీపీిఐ(ఎం) బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించామని, ఆయా స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయడంతో పాటు, పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలని ఉభయ పార్టీలు నిర్ణయించుకున్నట్టు కూనంనేని స్పష్టం చేశారు. సీపీఐ బలంగా ఉన్న చోట ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నామని, రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వివరించారు.
ఆర్టీసీ, ప్రజా సమస్యలపై పోరుబాట
ప్రమాదంలో పడిన ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ‘సేవ్‌ ఆర్టీసీ’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు, సమావేశాలు, సెమినార్‌ నిర్వహిస్తామని కూనంనేని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఆగస్టు 7న పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు. ఇండ్లు, గుడిసెలకు పట్టాలు, అనేక సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్‌లను ముట్టడిస్తామన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
25న మణిపూర్‌ ప్రజలకు సంఘీభావ ప్రదర్శన
మణిపూర్‌ ప్రజలకు సంఘీభావంగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనుసరిస్తున్న మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ నెల 25న నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మణిపూర్‌ వెళ్లిన అనీరాజాపై కూడా కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మణిపూర్‌లో హిందూత్వ ప్రాతిపదికన మరింత బలోపేతమయ్యేందుకు అక్కడి పాలక బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మణిపూర్‌ సీఎం తన పదవికి రాజీనామా చేయాలని, రెండు తెగల మధ్య సఖ్యత తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.