ఉచిత విద్యుత్‌ను భారంగా భావించకూడదు

– విద్యుత్‌ పోరాటంతో పదేండ్లు చార్జీలు పెంచలే
– 24 గంటల కరెంట్‌ ఇచ్చినా అవసరంమేరకే వినియోగం : వెబినార్‌లో తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కార్పొరేట్ల మేలు కోసమే కొందరు వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ …సబ్సిడీ తదితరాంశాలపై చర్చలను లేవదీస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయమేనని ఆయన తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని భారంగా భావించడం సరైందికాదని స్పష్టం చేశారు.గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా-నిజనిజాలు’ అనే అంశంపై ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ అధ్యక్షతన వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ పోరాట ఫలితంగా పదేండ్లపాటు కరెంటు చార్జీలు పెరగలేదన్నారు. ఆ ఉద్యమ ఫలితంగాన ఆనాటి పాలకులకు రైతాంగానికి ఉచిత విద్యుత్‌ అనే ఆలోచన చేశారని తెలిపారు. 24 గంటల కరెంట్‌ వల్ల నష్టం కాదనీ, ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్వవసాయ ఉత్పత్తులు పెరుగుతాయనీ, తద్వారా ఆహార ధాన్యాల కొరత తీరుతుందని తెలిపారు. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. రానున్న రోజుల్లో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయితే విద్యుత్‌ వినియోగం మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్‌ చౌర్యాన్ని నియంత్రించాలనీ, 12 శాతం ట్రాన్స్‌మిషన్ల నాణ్యతను పెంచాలని కోరారు. అంతేకానీ రైతులకు ఇస్తున్న సబ్సిడీలను ఆపేందుకు ప్రయత్నించడం సరైందికాదని చెప్పారు. వ్యవసాయానికి రాయితీలు ఇవ్వడాన్ని పాలకులు బాధ్యతగా భావించాలని కోరారు. బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ…రైతుల సబ్సిడీపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. సరైన పంటల ప్రణాళిక అమలు చేయడం ద్వారా కొంతమేరకు విద్యుత్‌ వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు. వరికి బదులు ఇతర పంటల కొనుగోలుకు గ్యారంటీ ఇస్తే, రైతులు పంట మార్పిడికి సిద్ధపడుతారని చెప్పారు. గతేడాది మిర్చికి అత్యధిక ధర పలకడంతో ఈసారి పత్తి స్థానంలో మిర్చి సాగు చేస్తున్నారని తెలిపారు. రైతులకు రాత్రిపూట కరెంట్‌ ఇవ్వడం వల్ల పాముకాటుకు, కరెంట్‌ షాక్‌ గురై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణ బిల్లు తీసుకొచ్చిందనీ, తద్వారా మోటార్లకు మీటర్లు బిగించి, బిల్లులు వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఆ మొత్తాన్ని అందుకు సబ్సిడీ రూపంలో రైతులకు ఇవ్వనున్నట్టు చెబుతున్నదని గుర్తు చేశారు. గ్యాస్‌ సబ్సిడీ ఎత్తేసిన తర్వాత రూ.1200 వసూలు చేస్తూ…కేవలం 43 రూపాయల సబ్సిడీ జమ అవుతున్నదని చెప్పారు. అదే మాదిరిగా విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే రైతులు, గృహ వినియోదారులపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయనీ, వాటిని తిప్పికొట్టేందుకు రైతాంగం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.