ఆర్కే భార్య అరెస్టు

– విజయవాడలో దుడ్డు ప్రభాకర్‌..
– రాష్ట్రంలో ఎన్‌ఐఎ సోదాలు
టంగుటూరు : రాష్ట్రంలో ఎన్‌ఐఎ అధికారుల బృందం శుక్రవారం సోదాలు చేపట్టింది. ప్రకాశం జిల్లాలో మావోయి స్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను, విజయవాడలో కుల నిర్మూల నా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్‌ను అరెస్టు చేసింది. గత ఏడాది జులై 19న శిరీష స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూర పాడు గ్రామానికి ఎన్‌ఐఎ బృందం వచ్చింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడం తో వెనుదిరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ ఎన్‌ఐఎ అధికారులు వచ్చారు. నేరుగా శిరీష ఇంటి వద్దకు వెళ్లి ఆమెను అరెస్టుచేసి జీపులోకి ఎక్కించారు. అక్కడి నుంచి నేరుగా టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద వాహనాలను ఆపినట్లే ఆపి జాతీయ రహదారిపైకి మళ్లించారు. ఈ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచార మూ లేదని టంగుటూరు పోలీసులు తెలిపారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్‌ ను ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఆయనను అరెస్టు చేసి నెంబర్‌ లేని వాహనాల్లో తరలించారు. అక్రమ అరెస్టులను విప్లవ రచయితల సంఘం నేత, ఆర్కే తోడల్లుడు జి.కల్యాణ్‌రావు, పౌర హక్కుల సంఘం ఐఎఫ్‌టియు నేతలు తదితరులు ఖండించారు.