జన్మమర్మం

నడుస్తున్న కాలంమీద కనుబొమ్మలు
బట్టలు ఇప్పుకొని తిర్గుతున్నయి
మాటలను అర్వు దెచ్చుకునెటొళ్ళ సుట్టు
చూపులు శూలాలై పొడుస్తున్నయి
పట్టపగలే సిరి బత్తెలా
మానవత్వం సచ్చిపోయి ఊరేగుతుంది

మనిషన్నంక ఏడ పుడ్తే ఏందిరా
మనిషి జన్మమర్మం తెల్సుక మస్లాలే
ఇమానంగా బత్కెటొళ్ళ మీద
అమానుషంగా గా తల్లులను
అప్పుడే పుట్టిన బిడ్డలను జేసి
ఊరంతా ఊరేగిస్తిరి కదరా
మీరు అమ్మలకే పుట్టిండ్రా
గా మనువు గార్చిన జొల్లుకు రాలిండ్రా

మట్టిని చెట్టును పూజించే దేశంరా మనది
అమ్మలనే నగంగా నడిబజార్లో
నడిపించే విషసంస్కతి ఎక్కడిదిరా
కండ్లకు ఎక్కిన కామం నేలకు దిగేదాక
ఒడుపుగా వరిపోట్టులేసి
మీ మగతనాన్ని బూడిద జెయాలే
ఆడతల్లుల జోలికొస్తే
మోడువాడిన చెట్టై బీడు పడాల్సిందేరా..

పేదోళ్ళకు ఆత్మగౌరవమే ఆస్తిపాస్తులు
దానే అంగడి బోమ్మలను జేస్తిరి కదరా
అమానవీయ, అరాచకాలకు చోటిస్తే
మానవత్వం చిరునామా గల్లంతైతది
కండ్లుండి చూపులేని పాలకులారా
హరిజన గిరిజనులను
ఓట్ల సరుకులను చేయకుండిరా
గూటందెబ్బ గుద్దితే
మీ పాలనంతా చిల్లెంపల్లెం ఐతది

– బోల యాదయ్య, 9912206427