చరిత్ర ఘనం…వర్తమానం దుర్భరం

– సమస్యల సుడిగుండంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
– రిజిస్ట్రేషన్‌ ప్రక్రియే ప్రధాన అడ్డంకి
– ఫలితంగా ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం
న్యూఢిల్లీ : దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు) పరిస్థితి గత మంతా ఘనం… వర్తమానం దుర్భరం అన్న చందంగా ఉంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, ఎగుమతులలో 40% వాటా కలిగిన ఈ పరిశ్రమలు ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ రుద్దిన బలవంతపు నియంత్రణలు, కోవిడ్‌ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో అనవసరంగా విధించిన లాక్‌డౌన్‌… వీటన్నింటి కారణంగా ఎంఎస్‌ఎంఈల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ముఖ్యంగా రిజిస్టర్‌ చేసుకోని పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం పొందలేకపోతున్నాయి. పోనీ ప్రభుత్వ సంస్థల వద్ద రిజిస్టర్‌ చేసుకుందామంటే సవాలక్ష ఆంక్షలు…గజిబిజి నిబంధనలు.
అత్యవసర రుణ గ్యారంటీ పథకం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమల కోసం రుణ హామీ నిధి ట్రస్ట్‌, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్‌ అభివృద్ధి కార్యక్రమం, సాంప్రదాయిక పరిశ్రమల పునరుత్పత్తికి సంబంధించిన నిధి పథకం… ఈ పథకాలు, సబ్సిడీలు, నూతన విధాన చర్యలు అన్నీ రిజిస్టర్డ్‌ ఎంఎస్‌ఎంఈలకే వర్తిస్తున్నాయి. రిజిస్టర్‌ కాని సంస్థలకు ఇవేవీ లభించడం లేదు.
గణాంకాలే లేవు
దేశంలో ఎన్ని ఎంఎస్‌ఎంఈలు నమోదయ్యాయి? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అందుబాటులో లేదు. 2006-07లో సేకరించిన గణాంకాల ప్రకారం 1.55 మిలియన్ల ఎంఎస్‌ఎంఈలు నమోదయ్యాయి. మొత్తం 26.1 మిలియన్ల ఎంఎస్‌ఎంఈలలో కేవలం 5.9% మాత్రమే క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. 2006-07 తర్వాత దేశంలో ఎలాంటి గణన చేపట్టలేదు. 2019లో ప్రభుత్వం 7వ ఆర్థిక గణన నిర్వహించినప్పటికీ ఆ వివరాలను బహిర్గతం చేయలేదు. 2015-16లో నిర్వహించిన 73వ రౌండ్‌ జాతీయ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రకారం దేశంలో 63 మిలియన్ల ఎంఎస్‌ఎంఈలు రిజిస్టర్‌ అయ్యాయని అంచనా వేశారు. వీటిలో 30% అసంఘటిత రంగంలో ఉన్నాయి. అయితే ఈ సర్వే లోపభూయిష్టంగా ఉంది.
ప్రక్రియ మొత్తం గందరగోళం
యాజమాన్యాలు వివిధ చట్టాల కింద ఎంఎస్‌ఎంఈలను కేవలం లాంఛనప్రాయంగానే నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. వివిధ చట్టాల కింద కేవలం 30% అసంఘటిత రంగ సంస్థలు మాత్రమే రిజిస్టర్‌ అవుతున్నాయి. ఫ్యాక్టరీల చట్టం కింద పరిశ్రమలను రిజిస్టర్‌ చేస్తే వాటికి సామాజిక భద్రతా ప్రయోజనాలు, ఇతర లాభాలు చేకూరుతాయి. ఇతర చట్టాల కింద నమోదయ్యే పరిశ్రమలకు ఎలాంటి ప్రయోజనాలు లభించవు. పోనీ ప్రభుత్వ ఏజెన్సీల వద్ద పరిశ్రమలను రిజిస్టర్‌ చేయిద్దామని అనుకుంటే ఆ ప్రక్రియ యావత్తూ గజిబిజిగా ఉంటోంది. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలు జీఎస్టీ, సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉద్యం వంటి వివిధ పథకాల కింద రిజిస్టర్‌ కావాల్సి వస్తోంది. దీంతో వాటిపై పరిపాలనా సంబంధమైన భారం పడుతోంది. గందరగోళం ఏర్పడుతోంది. 2020లో కేంద్రం ఉద్యం రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. పరిశ్రమలు ఇందులో రిజిస్టర్‌ చేసుకొని, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. అయితే ఇప్పటి వరకూ కేవలం 14.3 మిలియన్ల పరిశ్రమలు మాత్రమే దీనిలో రిజిస్టర్‌ అయ్యాయి. 2015-16 నాటికే దేశంలో 63 మిలియన్ల కంపెనీలు ఉన్నాయని అంచనా. అయితే ఈ సమాచారం కూడా చాలా పాతది. వ్యవసాయం తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడం విచారకరం.
ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయించడం లేదు?
దేశంలోని చాలా పరిశ్రమల వివరాలు ప్రభుత్వ సంస్థల పుస్తకాలలో లేవు. అవి అసంఘటిత రంగంలో కొనసాగుతున్నాయి. నియంత్రణ, పర్యవేక్షణ, పన్నుల నుంచి తప్పించుకునేందుకు అవి తమ వివరాలు నమోదు చేసుకోవడం లేదు. రిజిస్టర్‌ అయిన తర్వాత ఆ పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఖాతా పుస్తకాలను నిర్వహించడం, రిటర్న్‌లు ఫైల్‌ చేయడం, చట్టాలు-నిబంధనలకు కట్టుబడి ఉండడం వంటి బాధ్యతలు నిర్వర్తించాలి. అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి ఇది తలకు మించిన భారం అవుతోంది. ఎందుకంటే ఆర్థిక వనరుల కొరత కారణంగా యాజమాన్యాలు నిపుణులైన ఉద్యోగులను నియమించుకోలేవు. దేశంలోని ఎంఎస్‌ఎంఈలు సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు, రుణ గ్యారంటీల వంటి ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హులు. అయితే చాలా మంది చిన్న వ్యాపారులు వీటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అదీకాక రిజిస్ట్రేషన్‌, దాని ప్రయోజనాల గురించి ఎంఎస్‌ఎంఈల యజమానులకు అవగాహన లేదు. పైగా పరిశ్రమలు అనేక రకాల రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వస్తోంది. వ్యయం కంటే రిజిస్ట్రేషన్‌ కారణంగా ఒనగూరే ప్రయోజనమే ఎక్కువ ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సులభంగా రుణం లభించడం, మౌలిక సదుపాయాల కల్పనలో సాయం, పన్నుల వ్యవస్థ సరళతరంగా ఉండడం వంటి చర్యలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జీవం పోస్తాయి.