కొండగట్టుకు రూ.500 కోట్లు

–  ప్రపంచాన్ని ఆకర్షించే ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతాం..
–  850 ఎకరాల్లో విస్తరణ పనులు.. 86ఎకరాల్లో సువిశాల పార్కింగ్‌
–  వేలాది మంది ఒకేసారి దీక్ష విరమించేలా వసతులు
–  ప్రమాదాలకు తావులేకుండా ఘాట్‌రోడ్డు నిర్మాణానికి సూచనలు
–  25ఏండ్ల తరువాత తొలిసారి కొండగట్టును దర్శించుకున్న సీఎం కేసీఆర్‌
–  కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు… మీడియా సహా అందరికీ అనుమతి నిరాకరణ
నవతెలంగాణ – కరీంనగర్‌
ప్రాంతీయ ప్రతినిధి / మల్యాల
”ప్రపంచాన్నే ఆకర్షించే ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు అంజన్న కేంద్రాన్ని రూపుదిద్దుతాం.. దేశంలో అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు పేరు తలుచుకునేలా మారుస్తాం. మరో రూ.500 కోట్లు మంజూరు చేస్తాం. వేలాది మంది ఒకేసారి దీక్ష విరమింపజేసేలా వసతులు కల్పిస్తాం. 850 ఎకరాల్లో ఆలయ విస్తరణ, అభివృద్ధి చేపడుతాం. సువిశాలమైన పార్కింగ్‌ కోసం 86 ఎకరాలు కేటాయిస్తాం. ప్రమాదాలకు తావులేకుండా ఘాట్‌రోడ్డు నిర్మాణం సహా పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, పుష్కరిణిని అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండగట్టు అంజన్నక్షేత్ర అభివృద్ధిపై మాట్లాడారు. రెండున్నర దశాబ్దాల తరువాత జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని ఈ క్షేత్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. హెలికాప్టర్‌ ద్వారా కొండగట్టు ప్రాంతాన్ని వీక్షించారు. ఆలయ విస్తరణకు సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాలపై లొకేషన్‌ మ్యాపుతో పూర్తిగా పరిశీలించారు. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో రెండుగంటలకుపైగా సమీక్షించారు. యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని రూపుదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం మొత్తంగా రూ.600కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. పక్షం రోజుల కిందటే రూ.100కోట్లు మంజూరు చేసిన సీఎం.. మరో రూ.500కోట్లు ఇస్తామని చెప్పారు. కొండగట్టుపైకి ఘాట్‌రోడ్డును ఎలాంటి ప్రమాదాలకూ తావులేకుండా పునరుద్ధరించాలన్నారు. నిధులకు ఎలాంటి కొరతా లేదని, అవసరమైతే రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాల మాదిరి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు కూడా చేపడతామని చెప్పారు. ఏటా లక్షలాది మంది దీక్ష చేపడతారని, వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయికి సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ దావా వసంత, ప్రభుత్వ చీఫ్‌విప్‌ భాను ప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్‌, డాక్టర్‌ సంజరు కుమార్‌, రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌, జీవన్‌ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ సహా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.