శాన్‌ఫ్రాన్సిస్కో : మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లోగో మారింది. ఇప్పటి వరకు ఉన్న పక్షీని తొలగించి.. ఆ చోట ఎక్స్ లోగోను ప్రవేశపెట్టారు. అదే విధంగా ట్విటర్ వెబ్‌సైట ను కూడా ఎక్స్.కామ్‌తో అనుసంధానం చేశారు. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ భారీ మార్పులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సోమవారం తెల్లవారుజామున శాన్‌ప్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బ్లాక్ బ్యాక్ గ్రౌండ్‌లో వైట్ కలర్ ‘ఎక్స్’ తో కొత్త లోగోను మస్క్ ఆవిష్కరించారు. ట్విటర్ విస్తృత రీబ్రాండింగ్ ప్రయత్నంలో ఈ మార్పు అని మస్క్ తెలిపారు. ఇక ట్విట్టర్ పేరు కూడా ఎక్స్‌గా మార్చేశారు. ఇకపై ట్విట్టర్ డాట్ కామ్ బదులు ఎక్స్.కామ్ లైవ్‌లోకి వస్తుందని మస్క్ వెల్లడించారు. ఎక్స్ అనేది భవిష్యత్‌లో యూజర్లకు ఆడియో, వీడియో, మెసేజింగ్, చెల్లింపులు, బ్యాంకింగ్ వంటి అపరిమిత సేవలు అందిస్తుందని ట్విట్టర్ సిఇఒ లిండా యాకారినో తెలిపారు. కృత్రిమ మేధ ఆధారితమైన ఎక్స్ ఊహించని రీతిలో అందరినీ కలుపుతుందన్నారు.