– ఆరేండ్లలో రూ.57 వేల కోట్లు లాభం
– ప్రీమియంలు వసూలు అవుతున్నా క్లెయిమ్‌లు మాత్రం తక్కువే
– వెల్లడిస్తున్న ప్రభుత్వ గణాంకాలు
– పీఎంఎఫ్‌బీవై పని తీరుపై రైతన్నల ఆవేదన
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) ప్రయివేటు ఇన్సురెన్స్ కంపెనీలకు లాభాలను తెచ్చిపెడుతున్నది. అయితే, అన్నదాతలకు మాత్రం దీని నుంచి సరైన ప్రయోజనం అందటం లేదు. కేంద్రం గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ప్రయివేటు ఇన్సురెన్స్ కంపెనీలకు రూ. 57,621 కోట్లు లాభం జరగిందని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) వల్ల రైతుల కంటే.. ప్రయివేటు బీమా కంపెనీలకే లాభం జరుగుతుందని ఏఐకేఎస్ వంటి రైతు సంఘాలు మొదటి నుంచీ తెలుపుతున్నాయి. తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు వెలిబుచ్చుతున్నాయి. అయితే, మోడీ సర్కారు మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తోంది. అయితే గణాంకాలు మాత్రం ఏఐకేఎస్ చెప్పిందే వాస్తవమని పేర్కొంటున్నాయి. మోడీ ప్రభుత్వం 2016లో పీఎంఎఫ్‌బీవై పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా రైతుల కంటే బీమా కంపెనీలు దానిని ఎక్కువగా లాభం పొందుతున్నాయి. రాజ్యసభలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. గడిచిన ఏడేండ్లలో బీమా కంపెనీలు రూ.1,97,657 కోట్లను అన్నదాతల నుంచి ప్రీమియంగా స్వీకరించాయి. ఇందులో దాదాపు రూ.1,40,036 కోట్లను రైతులకు క్లెయిమ్‌ల రూపంలో చెల్లించాయి. అంటే, సుమారు రూ. 57,621 కోట్లు ప్రయివేటు బీమా కంపెనీలకు ఆదా కావటం గమనార్హం.
2022-23లో బీమా కంపెనీలు రూ.27,900 కోట్ల ప్రీమియం పొందాయి. అయితే పంట నష్టానికి సంబంధించి రైతులకు కేవలం రూ.5,760 కోట్లు చెల్లించాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రయివేటు బీమా కంపెనీలు రైతులకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవటం గమనార్హం. అయినప్పటికీ కంపెనీలు వందల కోట్లు ప్రీమియం రూపంలో పొందాయి. మధ్యప్రదేశ్‌లో ఒక ప్రయివేటు బీమా సంస్థ రూ.672 కోట్ల ప్రీమియం పొందిందనీ, అయితే పంట నష్టం క్లెయిమ్ లేదని డేటా వెల్లడించింది. పీఎంఎఫ్‌బీవై కింద రైతులు ఖరీఫ్ సీజన్‌లో బీమా మొత్తంలో నామమా త్రంగా 2 శాతం, రబీలో 1.5 శాతం, రెండు సీజన్‌లలో వాణిజ్య పంటలకు 5 శాతంతో పాటు ప్రీమియంగా చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు 50:50 చొప్పున చెల్లిస్తాయి. క్లెయిమ్‌లు చెల్లించకపోవడం, ఆలస్యంగా చెల్లింపులకు సంబంధించి, చాలా ఫిర్యాదులను పరిష్కరించి నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెం ట్ కోసం రాష్ట్రాల సహకారం నుంచి దాని ప్రీమియం వాటాను తొలగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రీమియం రూపంలో చెల్లించిన తర్వాత.. క్లెయిమ్‌లు తక్కువగా రావటం లేదా కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌లు లేకపోవటం బీమా కంపెనీలకు కలిసివస్తున్నదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అయితే, ఈ విధంగా బీమా కంపెనీలకు ఈ పథకం ద్వారా కోట్ల రూపాయల్లో లాభాలు వస్తున్నాయనీ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకొని రైతులకు లబ్ది చేకూరేలా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని వారు సూచించారు.