సార్‌.. ఫలితంపై ఎంతో నమ్మకంగా ఉన్నాం

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం). శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ధనుష్‌, సంయుక్త మీనన్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వెంకీ చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేసిన ధనుష్‌కి ధన్యవాదాలు. నిర్మాతల్లో ఒకరైన నా భార్య ఈ సినిమా చూసి.. కథగా విన్నప్పుడు కంటే, సినిమాగా చూసినప్పుడు ఇంకా బాగుంది అని చెప్పింది. నేను కూడా ఈ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే.. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం మనకి నేర్పుతున్న పాఠం. కానీ వాటినే సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ప్రపంచం మొత్తం చూసే స్థాయికి తీసుకెళ్లగలిగేది చదువు. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదని ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయడం ఎంతవరకు రైట్‌?. ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. అలాగే టీచర్‌, స్టూడెంట్‌కి మధ్య ఉండే రిలేషన్‌ చాలా పవిత్రమైనది. మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మన గురువులు మనతో పాటే ఉంటారు. అలాగే ఈ ‘సార్‌’ సినిమా కూడా మనతో పాటు చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా అవుతుంది’ అని తెలిపారు. ‘2002లో నా మొదటి తమిళ సినిమా విడుదలైంది. ఇప్పుడు 2023లో నా మొదటి తెలుగు సినిమా విడుదలవుతోంది. అప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ కలిగిందో.. ఇప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇది అద్భుతమైన ఎమోషన్స్‌, మెసేజ్‌తో కూడిన సింపుల్‌ సినిమా. మేం ఒక అర్థవంతమైన సినిమా చేశాం. ప్రేక్షకులకు మాములుగా వాళ్ళ కథలతో ఎక్కువగా కనెక్ట్‌ అవుతారు. ఇది మీ అందరి కథ. దర్శకుడు వెంకీకి, హీరోయిన్‌ సంయుక్త మీనన్‌, నిర్మాత వంశీకి ధన్యవాదాలు’ అని హీరో ధనుష్‌ అన్నారు. ‘ఇది ‘తొలిప్రేమ’ తర్వాత నేను చాలా నమ్మకంగా ఉన్న సినిమా. ఇది ఒక వీకెండ్‌ మాత్రమే చూసే సినిమా కాదు.. కనీసం నాలుగు వీకెండ్‌లు చూసే సినిమా. ఈ సినిమా తెలుగులో కనీసం నాలుగు వారాలు, తమిళ్‌లో కనీసం ఎనిమిది వారాలు ఆడుతుంది. ధనుష్‌ ఒక నాగస్వరం. ఆయన నటిస్తుంటే.. ఆయన ఒక్కడే కనిపిస్తాడు, ఆయన ఒక్కడే వినిపిస్తాడు. అలాంటి నటుడితో సినిమా చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. కథానాయిక సంయుక్త మీనన్‌ మాట్లాడుతూ, ‘సినిమా ప్రివ్యూ చూశాక ఫలితంపై నా కాన్ఫిడెన్స్‌ రెట్టింపు అయింది. ముఖ్యంగా నిర్మాత వంశీ ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శక, నిర్మాతలకు, త్రివిక్రమ్‌కి ధన్యవాదాలు’ అని తెలిపారు. ఈ సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. అందుకే ముందురోజే ప్రీమియర్లు వేయాలని నిర్ణయించుకున్నాం. ఆన్‌ లైన్‌లో పెట్టిన కాసేపటికే ప్రీమియర్‌ షోల టికెట్లు బుక్‌ అవ్వడం చూశాక.. ఈ సినిమా మీద మేమెంత నమ్మకం పెట్టుకున్నామో, ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారని అర్థమైంది. ఈ సినిమా మిమ్మల్ని అసలు నిరాశపరచదు. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది.
– నిర్మాత సూర్యదేవర నాగవంశీ