హక్కుల కోసం పోరాటం

–  వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, భూమిలేని పేదలకు న్యాయం చేయాలని, అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని చేస్తున్న పోరాటాల ఫలితంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో కదలిక వస్తున్నాయని తెలిపారు. హౌరాలోని జ్యోతిబసు నగర్లో జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్లో రెండోరోజైన గురువారం పలు రాష్ట్రాల నుండి హాజరైన ప్రతినిధులు కార్యదర్శి నివేదికపై మాట్లాడారు.
పోరాటాలతో ప్రభుత్వంలో కదలిక
పేదల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి నాగరాజు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బిజెపికి అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ నుండి మాట్లాడిన నాగరాజు తెలిపారు. . సంఘం ఆధ్వర్యాన 11 రకాల అంశాలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పరిశ్రమల కోసం భూములు లాక్కుంటారని, దీనివల్ల ఎక్కువమంది పేదలు భూమి కోల్పోతున్నారని తెలిపారు. దీనిపై తాము పోరాటం నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే దళితులకు పంచిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని వివరించారు. దీనిపై పోరాటంలో అనేకమంది జైళ్లపాలు చేశారని వివరించారు. ఆందోళనకారులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని వివరించారు.
భూ పోరాటాలు జరిగే ప్రాంతంలో నాయకులు, పోరాటాల్లో పాల్గొంటున్న వారిని పోలీసులు ముందుగా నిర్బంధిస్తున్నారని తెలిపారు. కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ భూములను కార్పొరేట్లకు కట్టబెతున్నారని, దీనిపైనా పోరాటాలు సాగిస్తున్నామని చెప్పారు.
కేంద్ర ఒత్తిడులు ఎదుర్కొంటున్నాం రతీంద్రన్‌ కేరళ ప్రతినిధి
కేరళలో వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కేరళ ప్రతినిధి రతీంద్రన్‌ తెలిపారు. పజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినట్లు చెప్పారు. దీన్ని తట్టుకోలేని కేంద్రం తనిఖీల పేరుతో వేధింపులకు దిగుతోందని చెప్పారు. ఎన్‌ఐఎ, ఇడిని అడ్డం పెట్టుకుని దాడులకు దిగుతోందన్నారు.
పట్టణాల్లో ఉపాధి కోసం పోరు కోదండన్‌, తమిళనాడు ప్రతినిధి
పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ… తమిళ నాడులో పోరా టాలు నిర్వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రతినిధి కోదండన్‌ తెలిపారు.
దీనిపై 2021లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రేపాకుల శ్రీనివాస్‌, తెలంగాణ
తెలంగాణా ప్రాంతంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ నుండి చర్చల్లో పాల్గొన్న రేపాకుల శ్రీనివాస్‌ చెప్పారు. మూడో మహాసభ ఖమ్మంలో లక్షమందితో నిర్వహించా మన్నారు. భూమి, ఇళ్లస్థలాలు, పోడుభూమి, భూములు కోల్పోతున్నవారు, ఉపాధి హామీ పథకంపై పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించా మన్నారు. ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ విషయంలో పేదలకు న్యాయం చేయాలని డిమాండు చేస్తున్నట్లు తెలిపారు . ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో పేదల భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. దీనిపైనా ఆందోళన చేపట్టామన్నారు. అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు, తహశీల్దార్‌ కార్యాలయాల ముందు పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు.
పోరాటాల ద్వారా విస్తరణ బుర్రి ప్రసాద్‌, తెలంగాణ ప్రతినిధి
కోవిడ్‌ సమయంలో వ్యవసాయ కార్మిక సంఘం సేవా కార్యక్రమాలు అమలు చేసిందని తెలంగాణ తెలిపారు. అలా చేసిన పోరాటాల వల్ల కొత్త ప్రాంతాల్లోకి విస్తరించామని తెలిపారు. అనేక సామాజిక పరమైన అంశాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. మహిళా వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. మహిళా కార్మికులు ఉద్యమంలోకి ఎక్కువగా వస్తున్నారని వివరించారు. వారిని మరింత చైతన్యం చేసేం దుకు అనేక సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే భూపోరాటాల్లోకి పెద్దఎత్తున పేదలు కదలివస్తున్నారని తెలిపారు. తెలంగాణాలో పెట్టిన ధరణి వెబ్‌సైట్‌ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, వాటిపైనా పోరాడుతున్నామని చెప్పారు.
మత విద్వేషాలను తిప్పికొట్టండి మహాసభలో తీర్మానం
 ప్రవేశపెట్టిన తుషార్‌ఘోష్‌, బలపరిచిన పళనిస్వామి
జ్యోతిబసు నగర్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
దేశంలో రోజురోజకూ పెరుగుతున్న మత విద్వేషాలను తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మికసంఘం జాతీయ మహాసభ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సంఘం జాతీయ సహాయ కార్యదర్శి తుషార్‌ఘోష్‌ ప్రతిపాదించగా తమిళనాడు ప్రతినిధి పళనిస్వామి బలపరిచారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఎక్కడికక్కడ ఐక్యం కావాలని తీర్మానంలో పేర్కొన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత లౌకికతత్వంపై దాడి పెరగడం ఆందోళనమని, మోడీ వచ్చిన తరువాత ఇది మరింత పెరిగిందని తెలిపారు. అధికారిక సంస్థలను ఉపయోగించడం ద్వారా దీన్ని ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా లౌకికతత్వం ప్రమాదంలోకి వెళ్లిందని తీర్మానంలో పేర్కొన్నారు.
గత మూడేళ్లలో దేశంలో 50 చోట్ల మతపరమైన ఘర్షణలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని వివరించారు. ఆహార అలవాట్లపైనా, మైనార్టీలు, చర్చిలపైనా దాడులు పెరిగాయని వివరించారు. ముస్లిములపై దాడులు చేయడం లవ్‌జిహాద్‌ పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే వారి ఆస్తులను బుల్‌డోజ్‌ చేస్తున్నారని తీర్మానంలో పొందుపరిచారు. సీఏఏ పేరుతో ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. . బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం వ్యతిరేక ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోందని పేర్కొన్నారు. ఆవులు, ఆహారం పేరుతో పేదలపై నిరంతరం దాడులు చేయడంతోపాటు పెట్టుబడిదారుల దోపిడీకి దీన్ని ఒక ఆయుధంగా వినియోగిస్తున్నారని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా బలమైన లౌకికతత్వంతో కూడిన పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. మతం, కార్పొరేట్‌ అనుబంధ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని తీర్మానించారు.