ప్రాజెక్టులను పరిశీలించిన పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌మాన్‌

నవతెలంగాణ-మర్కుక్‌
సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టును పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌మాన్‌ గురువారం పరిశీలించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు పంజాబ్‌ సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్ధిపేట జిల్లాలో పర్యటించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రిజర్వాయర్ల గురించి సీఎం భగవంత్‌ సింగ్‌మాన్‌కు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన జలవనరుల పథకాలను మ్యాప్‌లు, చార్టులతో వివరించారు. కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్‌ ఉందని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టు 2,85,280 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందని తెలిపారు. అనంతరం ఎర్రవల్లి- నరన్నపేట గ్రామాల మధ్యలో చెక్‌డ్యాంను పంజాబ్‌ సీఎం పరిశీలించారు. గజ్వేల్‌ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా పంజాబ్‌ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణలో మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం పనులు బాగున్నాయని కితాబిచ్చారు. ఆయన వెంట గడ అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌ రెడ్డి, దత్తత గ్రామాల సర్పంచ్‌ మొండి భాగ్యబిక్షపతి, మాధవి రాజిరెడ్డి, ఎంపీటీసీలు గోలినేందర్‌, ధనలక్ష్మి కృష్ణ, మర్కుక్‌ ఎంపీపీ తాండ పాండుగౌడ్‌, జెడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్‌, వైస్‌ ఎంపీపీ మంద బాల్‌ రెడ్డి తదితరులున్నారు.