వనమా ఎన్నిక చెల్లదు

– హైకోర్టు సంచలన తీర్పు
నవతెలంగాణ-హైదరాబాద్‌
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావుకు. ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. పిటిషనర్‌ జలగం వెంకట్రావుకు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. 2018 ఎన్నికల్లో వనమా కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొత్తగూడెంలో గెలుపొందారు. తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌ నేటి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. అప్పుడు టీఆర్‌ఎస్‌ తరఫున జలగం వెంటకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు. వనమా ఎన్నికను జలగం సవాల్‌ చేస్తూ 2019లో హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఆమోదిస్తూ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు చెప్పింది. ఎన్నికల అఫిడవిట్‌లో వాస్తవాలు దాచిపెట్టారని తేల్చింది. 2018 డిసెంబర్‌ 18 నుంచి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొనసాగుతారని వెల్లడించింది. కొత్తగూడెం పీఎస్‌లో ఒక కేసు గురించి వనమా కావాలని వెల్లడించలేదు. పాల్వంచలోని 300 గజాల జాగాలోని ఇల్లు గురించి 2004 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో చూపించారు. 2018 ఎన్నికల్లో చూపించలేదు. అందులో సగం స్థలం భార్య అంజలికి అమ్మినట్టు చెబుతున్నారు. మిగిలిన స్థలం నుంచి కూడా వనమా అఫిడవిట్‌లో పేర్కొనలేదు. అంజలి తన భార్య కాదని వనమా వాదించినప్పటికీ సేల్‌డీడ్‌లో 151 గజాల అమ్మకానికి సంబంధించిన సేల్‌డీడ్‌లో వనమా భార్యగా పేర్కొంటున్న అంజలి విక్రయించినట్టుగా రికార్డుల్లో ఉందని పిటిషన్‌ పేర్కొన్నారు. ఈ వివాదంలోకి వెళ్లడం లేదని, అయితే గత అఫిడవిట్లల్లోని స్థలం ఏమైందో తేల్చలేదని తప్పుపట్టింది. ఎన్నికల కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా వనమా రాలేదని తప్పుపట్టిది. ‘ఎన్నికల అఫిడవిట్‌లో వాస్తవాలు దాచడం, ఆదాయ లెక్కలు చెప్పకపోవడం అవినీతి కిందకే వస్తుంది..’ అని తీర్పు చెప్పింది