సింధు ఓటమి

టోక్యో : భారత అగ్రశ్రేణి షట్లర్‌, మాజీ వరల్డ్‌ నం.2 పి.వి సింధు వైఫల్యాల బాట వీడటం లేదు!. జపాన్‌ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే పరాజయం పాలైన సింధు.. టోక్యో నుంచి నిష్క్రమించింది. చైనా అమ్మాయి జాంగ్‌ యి మాన్‌తో పోరులో 12-21, 13-21తో వరుస గేముల్లోనే చేతులెత్తేసింది. 32 నిమిషాల్లోనే సింధును ఓడించిన చైనా షట్లర్‌ మహిళల సింగిల్స్‌లో ముందంజ వేసింది. కొత్త కోచ్‌ హఫీజ్‌ శిక్షణ సారథ్యంలో సింధు వరుసగా రెండో టోర్నీలో తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ విభాగం ఆల్‌ ఇండియన్స్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 21-15, 12-21, 24-22తో ప్రియాన్షు రజావత్‌పై పైచేయి సాధించాడు. మెన్స్‌ డబుల్స్‌లో కొరియా ఓపెన్‌ విజేతలు సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఇండోనేషియా జోడీ లీయో రాలీ, డానియల్‌ మార్టిన్‌పై 21-16, 11-21, 21-13తో మూడు గేముల మ్యాచ్‌లో విజయం సాధించాడు.